
పంచాయితీ తప్పలేదు!
‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌కు పంచాయితీకి వెళ్లక తప్పలేదు! ఇప్పుడంటే పోలీసులు, కోర్టులు, హ్యూమన్ రైట్స్ కమీషన్లు... ఇలా న్యాయం కోసం ప్రజలు ఎక్కే మెట్లు బోలెడు.
‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌కు పంచాయితీకి వెళ్లక తప్పలేదు! ఇప్పుడంటే పోలీసులు, కోర్టులు, హ్యూమన్ రైట్స్ కమీషన్లు... ఇలా న్యాయం కోసం ప్రజలు ఎక్కే మెట్లు బోలెడు. అప్పట్లో చాలా సమస్యలు, గొడవలను పంచాయితీల్లోనే పెద్దలు పరిష్కరించేవారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో! అప్పట్లో అంటే 20, 30 ఏళ్ల క్రితం! సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రకథా నేపథ్యమంతా 1985వ సంవత్సరమే.
అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా ప్రేమ, ద్వేషం, స్వార్థం అంశాలను మేళవించి కమర్షియల్ పంథాలో సుకుమార్ కథను రాసుకున్నారు. కథ ప్రకారం పల్లెటూరి పంచాయితీ, అందులో సన్నివేశాలు సినిమాకు కీలకమట! ఓ రకంగా చెప్పాలంటే... కథలో కొంత భాగం పంచాయితీ చుట్టూ నడుస్తుందట! మరి, చరణ్ పంచాయితీకి ఎందుకు వెళ్లారో, ఎవరితో గొడవపడ్డారో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయమ్) నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట!