లండన్‌లో గోవిందుడి చిందులు
ఇప్పటివరకూ విలన్ల ఆట కట్టించే మాస్ హీరోగానే రామ్‌చరణ్ కనిపించారు. తెగిన బంధాలను కలిపి, కుటుంబంలోని అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపే వంశోద్ధారకునిగా మాత్రం ఆయన కనిపించలేదు. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్‌ది అలాంటి పాత్రే. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు చరణ్ చేరువ కావడం ఖాయమని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఘంటాపథంగా చెబుతున్నారు.
యాభై ఏళ్ల పాటు చెప్పుకునే సినిమాగా ‘గోవిందుడు....’ నిలుస్తుందని ఆయన చెబుతున్నారు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్, బాబాయ్‌గా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో కమలినీ ముఖర్జీ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది.
అక్కడ రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నట్లు బండ్ల గణేశ్ తెలిపారు. మిగిలి వున్న పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామనీ, దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఆయన చెప్పారు. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోందనీ, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 1న దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని బండ్ల గణేశ్ అన్నారు. జయసుధ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా.