రామ్‌గోపాల్ వర్మ
‘‘ఆర్‌జీవీ వరల్డ్’లో నా అభిరుచికి తగ్గ సినిమాలే ఉంటాయి. చూడాలనుకున్నవాళ్లే చూస్తారు. నా సినిమాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రా లు నేను తీయను. ఇంట్లోనే ఒక్కొక్కరు వేరు వేరు గదుల్లో ఒంటరిగా చూసే సినిమాలు తీస్తాను’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్‌జీవీ వరల్డ్’ అనే ఓ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ‘క్లైమాక్స్’ చిత్రం ఈ యాప్‌లో విడుదల కానుంది. అలాగే వర్మ నేతృత్వంలోని మరో చిత్రం ‘కరోనా వైరస్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతుంది. ‘ఆర్‌జీవీ వరల్డ్ యాప్’, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ల హవా వంటి విషయాలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. ఆ విశేషాలు..
► నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం నుంచీ వెబ్‌సిరీస్ అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడిదో (డిజిటల్ ప్లాట్‌ఫామ్) ప్యారలల్ ఇండస్ట్రీ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూయర్‌షిప్ పెరుగుతుందంటే ఆడియన్స్ చూస్తున్నట్లేగా. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌వారు కంటెంట్ కోసం కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు.
► ఇండస్ట్రీలో 90శాతం ఫ్లాప్‌లు ఉంటాయి. ఒక సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాకు వీకెండ్ ఓపెనింగ్స్ రావాలి. దీని పబ్లిసిటీ కోసం నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, థియేటర్స్ ఇలా మరికొన్ని పనులను చక్కబెట్టుకోవాలి. ఇంతా చేసిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా? రారా? అనే టెన్షన్. మొబైల్‌లో సినిమా చూసినప్పుడు థియేటర్ ఫీల్‌ని మిస్ అవుతాం అనే ఫీల్‌ని పక్కనపెడితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వల్ల పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుంది. కొందరు నిర్మాతలకు ఇది ప్లస్.
► పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు, ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ సినిమాలయితే థియేటర్‌లో చూడటానికి బాగుంటాయి. కానీ కొన్ని స్టోరీ బేస్డ్, కంటెంట్ ఉన్నవి ఓటీటీలో వర్కౌట్ అవుతాయి. అలాగే ఫీచర్ ఫిల్మ్ అంటే కనీసం రెండు గంటల నిడివి ఉండాలన్న కండీషన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండదు. నా ‘క్లైమాక్స్’ మూవీ నిడివి 55నిమిషాలు మాత్రమే.
► ‘ఆర్‌జీవీ వరల్డ్’ ఐడియా నాకు ఎప్పటినుంచో ఉంది. ఇందులో ‘పే ఫర్’ వ్యూ విధానంలో చూడొచ్చు. చూసిన ప్రతిసారీ చార్జ్ చేస్తాం.
► కమల్‌హాసన్ ‘డైరెక్ట్ హోమ్’ ఫార్మట్‌లో ‘విశ్వరూపం’ విడుదల ప్లాన్ చేశారు. అప్పుడు సెటప్ బాక్స్‌లు అందరికీ లేవు. కానీ ఈ నిర్ణయాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. అయితే ఇప్పుడు మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్స్ ఓపెన్ చేసి లేవు. ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు.
► నేను తీసిన తొలి కుటుంబ కథాచిత్రం ‘కరోనా వైరస్’. ఇది నా దృష్టిలో ఒక హారర్ ఫిల్మ్. దెయ్యం బదులు వైరస్ ఉంది. అంతే తేడా. ఇన్ని దశాబ్దాల తర్వాత ఎవరో దగ్గుతున్నారని మనం భయపడుతున్నామంటే అది హారర్ సినిమాయే కదా! యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా ఓ హారర్ ఫిల్మ్‌లా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే ‘కరోనావైరస్’ చిత్రాన్ని చేశాం. ఆర్టిస్టులను ఒక చోటుకు చేర్చి సినిమాను ఎలా పూర్తి చేశానన్నది ఆర్జీవీ సీక్రెట్.
► ఫిల్మ్‌మేకింగ్ అనేది టీమ్ ఎఫర్ట్ అని నమ్ముతాను. అయితే సినిమాకు ఎవరు రూపకల్పన చేస్తారనేది ముఖ్యం. మా దగ్గర నేను చేస్తాను. ఎవరు ఎక్కువ కష్టపడితే వారికి క్రెడిట్ ఇస్తాను. ‘కరోనా వైరస్’ సినిమాకు అగస్త్య మంజు డైరెక్టర్. ఆలోచన నాది. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది.
► జబ్బు, తుఫాన్, యాక్సిడెంట్... ఇలా ఏ కారణంతో అయినా మనకు చావు రావొచ్చు. ఈ జాబితాలో కరోనా వైరస్ కూడా చేరింది. కరోనా వైరస్ వెళ్లేట్లు లేదు. ఇంకేం చేస్తాం? దానితో కలిసి ఉండటమే. లాక్‌డౌన్ సమయంలో ‘క్లైమాక్స్, కరోనా వైరస్’ చిత్రాల పనులు చూసుకున్నాను. నేను తాత (వర్మ కుమార్తె రేవతి ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది)ను అయ్యానని తెలిసినప్పుడు నాకేం అనిపించలేదు. చచ్చినట్లు కరోనా వైరస్‌ను భరించాలి. నేను తాతను అయ్యానన్నది భరించాలి.
► ‘కరోనా వైరస్’ ట్రైలర్ చివర్లో ఉన్న రెండు డైలాగ్స్ సెటైర్స్ కాదు. నా సినిమాకి నప్పుతాయని పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ నుంచి చైనా వరకు కరోనా విషయంలో అందరూ చేయాల్సింది చేస్తున్నారు. అందుకే నేను ఎవరిపైనా సెటైర్ వేయలేదు.
ఆ అమ్మాయంటే ఇష్టం
చాలామంది పోర్న్‌స్టార్స్ ఉన్నప్పటికీ ‘జీఎస్‌టీ’, ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కొవానే ఎందుకు తీసుకున్నానంటే ఆ అమ్మాయి అంటే నాకిష్టం. అమెరికన్ కపుల్ ఓ టూర్‌కి వెళతారు. అక్కడి వారి అనుభవాల ఆధారంగా ‘క్లైమాక్స్’ చిత్రం ఉంటుంది. హారర్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. ‘ఎంటర్ ద గాళ్ డ్రాగన్’ చిత్రం షూటింగ్ ఇంకా నాలుగు రోజులు చేయాల్సి ఉంది. చైనా షూట్‌ను కంప్లీట్ చేశాం. మేం చైనా నుంచి వచ్చిన నాలుగు రోజులకు అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment