రిపీట్... హిట్‌కు సానపెట్ట...రా! | repeat combinations in bollywood | Sakshi
Sakshi News home page

రిపీట్... హిట్‌కు సానపెట్ట...రా!

Published Fri, Jul 17 2015 10:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రిపీట్... హిట్‌కు సానపెట్ట...రా! - Sakshi

రిపీట్... హిట్‌కు సానపెట్ట...రా!

కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ క్రేజీనే. సెంటిమెంట్ మీద నడిచే సినీసీమలో అయితే మరీనూ! ఒక డెరైక్టర్, ఒక హీరో కలసి గతంలో ఒక సూపర్‌హిట్ ఇచ్చారంటే చాలు... వాళ్ళ కాంబినేషన్‌లో తాజా సినిమా మీద అనేక అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం హిందీలో అలాంటి క్రేజీ హిట్ కాంబినేషన్ల సినిమాలు కొన్ని ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సినీ వ్యాపార వర్గాలనూ, ప్రేక్షకులనూ ఏకకాలంలో ఆకర్షిస్తున్న అలాంటి క్రేజీ ‘రిపీట్’ కాంబినేషన్లు... పాత బాక్సాఫీస్ సక్సెస్‌ను కూడా రిపీట్ చేస్తాయా?
 
 రోహిత్‌శెట్టి - షారూక్‌ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లా...దూసుకెళ్ళేందుకు...
 అయిదేళ్ల క్రితం మాట ఇది. అప్పుడు అజయ్ దేవగన్‌తో ‘సింగం’ సినిమా రూపొందిస్తున్నారు రోహిత్ శెట్టి. అప్పుడో ఆలోచన వచ్చిందాయనకు. ప్రముఖ నటుడు సంజీవ్‌కుమార్ కథానాయకునిగా నటించిన ‘అంగూర్’ చిత్రం రీమేక్ చేయాలన్నదే ఆ ఆలోచన. సంజీవ్‌కుమార్ పాత్రకు షారూక్ ఖాన్‌ను అనుకున్నారు. ఆ విషయం షారూక్‌తో కూడా చెప్పారు. కానీ, ఎందుకో ఆ ఆలోచన ఆచరణలోకి రాలేదు. కట్ చేస్తే... ముంబై నుంచి రామేశ్వరం వరకూ సాగే ఓ ప్రేమకథకు వాణిజ్య హంగులు జోడించి, షారూక్‌కు ఓ కథ చెప్పారు రోహిత్. ఆ కథ షారూక్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
 
  అదే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’. షారూక్, దీపికా పదుకొనే జంటగా నటి ంచిన ఈ చిత్రం మంచి విజయం సాధించి, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు కొద్ది విరామం తరువాత మళ్ళీ రోహిత్‌శెట్టి, షారూక్‌ల కాంబినేషన్ రిపీట్ అవుతోంది. తాజాగా ఈ దర్శక, హీరోల కలయికలో వస్తున్న చిత్రం ‘దిల్‌వాలే’. ఈ చిత్రంలో వరుణ్‌ధావన్, కృతీసనన్ మరో జోడీ. రోహిత్, షారుక్‌ఖాన్‌ల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడం, పైగా ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’తో హిట్ జోడీ అనిపించుకున్న షారూక్, కాజోల్ చాలా విరామం తరువాత ఈ చిత్రంలో జంటగా నటిస్తుండడంతో ఈ ‘దిల్‌వాలే’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి... ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా? ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో కొత్త రికార్డులు సృష్టించిన షారూక్, రోహిత్ వాటిని బద్దలు కొడతారా? ఆ సంగతి తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకూ ఆగాల్సిందే.
 బడ్జెట్: 75 కోటు్లూ
 వసూళ్లు: 400 కోట్లు

 
  హృతిక్ రోషన్ - ఆశుతోష్ గోవారీకర్ చరిత్రను తిరగదోడదాం!
 ‘జోథా అక్బర్’... హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ జంటగా ఆశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో రూపొందిన చారిత్రక చిత్రం ఇది. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికో హైలైట్. ఆ సూపర్‌హిట్ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ హృతిక్ హీరోగా ఆశుతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మొహెన్‌జొదారో’. చరిత్ర నేపథ్యంలో ప్రేమ, సాహసం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జోథా అక్బర్’ వంటి విజయాన్ని ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ‘మొహెన్‌జొ దారో’పై భారీ అంచనాలు ఉన్నాయి. వైవిధ్యమైన కథాంశాలను అద్భుతంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకునిగా ఆశుతోష్‌కీ, దర్శకుడు అనుకున్న పాత్రలో ఒదిగిపోయే ప్రతిభ ఉన్న హీరోగా హృతిక్‌కీ పేరుంది. కాబట్టి, ఈ దర్శక, హీరోలు మరో ఘనవిజయం సాధిస్తారని బాలీవుడ్ జనం బలంగా నమ్ముతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.
  బడ్జెట్:40 కోటు్లూ
 వసూళ్లు:115 కోట్లు

 
  అక్షయ్‌కుమార్ - ప్రభుదేవా ఈ సింగ్...బాక్సాఫీస్ కింగ్?
 ‘వాంటెడ్’ చిత్రం ద్వారా హిందీ రంగానికి దర్శకునిగా పరిచయమయ్యారు ప్రభుదేవా. తెలుగు సూపర్‌హిట్ మహేశ్‌బాబు ‘పోకిరి’కి రీమేకైన ఆ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడంతో దక్షిణాది చిత్రాలవైపు కన్నెత్తి చూసే తీరిక లేనంతగా అక్కడే బిజీ అయ్యారు ప్రభుదేవా. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘రౌడీ రాథోడ్’ ఒకటి. తెలుగు ‘విక్రమార్కుడు’కి ఇది రీమేక్. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తరువాత ‘రాంబో... రాజ్‌కుమార్’, ‘యాక్షన్ జాక్సన్’ లాంటి సినిమాలు చేసిన ప్రభుదేవా ఇప్పుడు మళ్లీ అక్షయ్‌కుమార్‌తో సినిమా చేస్తున్నారు. వీరిద్ధరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ తాజా చిత్రం - ‘సింగ్ ఈజ్ బ్లింగ్’. అక్షయ్‌కుమార్‌కి హిందీ రంగంలో కలక్షన్ కింగ్ అనే పేరుంది. మరి.. ఈ సింగ్ ఆ పేరు నిలబెడతాడా? బాలీవుడ్‌లో దర్శకునిగా ప్రభుదేవా ఖాతాలో మరో విజయం పడుతుందా? మరో మూడు నెలల్లో తెలిసిపోతుంది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
  బడ్జెట్:45 కోటు్లూ
 వసూళ్లు:200 కోట్లు

 
  సల్మాన్ ఖాన్ - కబీర్‌ఖాన్ నో డౌట్... బ్లాక్‌బస్టర్ హిట్!
 హిందీ చిత్రరంగంలోని ప్రసిద్ధ సంస్థల్లో ‘యశ్‌రాజ్ ఫిలిమ్స్’ ఒకటి. అలాంటి సంస్థలో వరుసగా మూడు సినిమాల్లో అవకాశం రావడమంటే మరీ గొప్ప విషయం. ఆ అదృష్టం దక్కిన దర్శకుడు కబీర్‌ఖాన్. ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’తో కబీర్‌ను దర్శకునిగా పరిచయం చేసింది యశ్‌రాజ్ సంస్థ. ఆ తర్వాత అదే సంస్థలో ‘న్యూయార్క్’ చిత్రం చేశారు కబీర్ ఖాన్. మూడో సినిమా కూడా ఆ సంస్థలోనే! సల్మాన్‌ఖాన్ హీరోగా ‘ఏక్‌థా టైగర్’. ఆ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. వాస్తవానికి ఆ చిత్రం షారూక్ ఖాన్ చేయాల్సి ఉంది. కానీ, ఆయనకు ఖాళీ లేకపోవడంతో సల్మాన్ చేశారు. హిట్ హీరో సల్మాన్, ఈసారి మరో నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్‌తో కలిసి సినిమా నిర్మించారు.
 
 కబీర్‌ఖాన్‌ను డెరైక్టర్‌గా పెట్టుకున్నారు. అదే ‘బజరంగీ భాయ్‌జాన్’. నిన్న శుక్రవారం ప్రపంచమంతటా విడుదలైంది. ‘ఏక్ థా టైగర్’ తరువాత కబీర్, సల్మాన్ ఖాన్‌ల కాంబినేషన్ ఇందులో రిపీటైంది. మన దేశంలో తప్పిపోయిన ఓ చిన్నారిని పాకిస్తాన్‌లోని ఆమె స్వస్థలానికి భద్రంగా చేర్చే హనుమద్భక్తుడు బజరంగీ పాత్రను సల్మాన్ పోషించారు. ‘ఏక్ థా టైగర్’తో మామూలు హిట్ ఇచ్చిన సల్మాన్-కబీర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తారో అనే చర్చ జరిగిన నేపథ్యంలో మొదటి ఆటకే ‘సూపర్ హిట్’ టాక్ తెచ్చుకుందీ చిత్రం. ప్రతి ఒక్కర్నీ ఉద్వేగానికి గురి చేసే చిత్రం ఇదని చూసినవాళ్లు అంటున్నారు. సో.. రెండోసారి కూడా కబీర్-సల్మాన్ ‘హిట్ కాంబినేషన్’ అని నిరూపించుకున్నారు. ఇటీవల హిందీలో విడుదలైన చిత్రాల రికార్డ్‌లను ఈ చిత్రం బద్దలు కొట్టడం ఖాయమట.
 
 బడ్జెట్:75 కోటు్లూ
 వసూళ్లు:320 కోట్లు

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement