
చింతనిప్పుల్లాంటి కళ్లు, రౌద్రంగా కనిపించే ముఖంతో ప్రతినాయకుడి వేషాల్లో జీవించే జీవ, హాస్యనటి శ్రీలక్ష్మితో కలిసి ఆడిపాడారు. బంతిపూల తోటలో ఇద్దరూ ఒక్కటిగా యుగళగీతం ఆలపించారు. ఈ సన్నివేశాలను స్థానికులు ఎగబడి చూశారు. గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామం సమీపంలో నిన్న (మంగళవారం) పూలతోటలో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ షూటింగ్‌లో నెలకొన్న సందడి ఇది. గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మాతగా, పెదరావూరు ఫిలిం స్టూడియో పతాకంపై ఆలీ, రిషిత హీరో హీరోయిన్లుగా దిలీప్‌రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గత రెండు నెలలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపుకుంటోంది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో తీసే సినిమాగా రిజిస్ట్రర్ అయిన తొలి సినిమాగా గుర్తింపుతో పాటు, ప్రభుత్వ అనుమతులను చిత్ర యూనిట్ పొందింది. ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటులు వినోద్ కుమార్, బాబూమోహన్, సుధ, దేవి తదితరలు నటిస్తున్నారు.