టైటిల్ : రోషగాడు
జానర్ : ఎమోషనల్ డ్రామా
తారాగణం : విజయ్ ఆంటొని, నివేదా పేతురాజ్, సాయి దీనా
సంగీతం : విజయ్ ఆంటొని
దర్శకత్వం : గణేషా
నిర్మాత : ఫాతిమా
కోలీవుడ్‌లో మంచి విజయాలు సాధించిన విజయ్ ఆంటొని బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్‌లో కూడా ఘనవిజయం సాధించాడు. అయితే తరువాత తన ప్రతీ సినిమాను టాలీవుడ్ లో రిలీజ్ చేసినా మరో సక్సెస్ మాత్రం దక్కలేదు. తాజాగా రోషగాడు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటొని. మరి రోషగాడు విజయ్ ఆంటొనికి మరో సక్సెస్ అందించిందా.?
కథ :
పోలీస్ కానిస్టేబుల్ కుమారస్వామి (విజయ్ ఆంటొని), తన తమ్ముడు రవిని ఎలాగైనా ఇన్స్‌పెక్టర్ చేయాలని తయారు చేస్తుంటాడు. కానీ అన్న పదే పదే చదువు, ఫిట్‌గా ఉండు అని చెప్పటం టార్చర్ అని ఫీల్ అయిన రవి ఇంట్లో నుంచి పారిపోతాడు. హైదరాబాద్‌లో బాబ్జీ అనే రౌడీ దగ్గర చేరిన రవి హంతకుడిగా మారతాడు. ప్రమోషన్ మీద హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన కుమారస్వామి ఓ హత్య కేసులో తన తమ్ముడిని ఎన్‌కౌంటర్ లో చంపేస్తాడు. కానీ తరువాత తన తమ్ముడిలా వేల మంది బాబ్జీ కోసం పనిచేస్తున్నారని తెలుసుకొని అందరిని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. కుర్రాళ్లు రౌడీలను హీరోలుగా భావించటం వల్లే వారి వెనుక తిరుగుతున్నారని.. వారి దృష్టిలో పోలీసులను హీరోలను చేస్తే అందరూ మారిపోతారన్న నమ్మకంతో బాబ్జీని దెబ్బతీయాలనుకుంటాడు. మరి ఈ ప్రయత్నంలో కుమారస్వామి విజయం సాధించాడా..? బాబ్జీ చెర నుంచి కుర్రాళ్లను కాపాడాడా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
తన ప్రతీ సినిమాలో ఓ ఎమోషనల్ పాయింట్ ఉండేలా చూసుకునే విజయ్ ఆంటొని ఈ సినిమా కూడా అదే స్టైల్ లో సెలెక్ట్ చేసుకున్నాడు. తమ్ముడి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు విజయ్. కుమారస్వామి పాత్రలలో సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. హీరోయిన్‌గా నటించిన నివేదా పేతురాజ్ చలాకీ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. లుక్స్ పరంగాను మంచి మార్కులు సాధించింది. ఇక కీలక మైన విలన్ పాత్రలో నటించిన సాయి దీనా, బాబ్జీ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. మిగతా నటీనటులంతా తమిళ వాళ్లే కావటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేరు.
విశ్లేషణ :
దర్శకుడు గణేషా.. విజయ్ ఆంటొని ఇమేజ్‌కు తగ్గ కథా కథనాలను రెడీ చేసుకున్నా.. అనుకున్నట్టుగా సినిమాను తెర మీద చూపించటంలో కాస్త తడబడ్డాడు. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినా ఎమోషనల్ సీన్స్‌తో పాటు కామెడీ డైలాగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లోకథనం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఉన్నవి మూడు పాటలే అయినా అవికూడా తెలుగు ప్రేక్షకులను అలరించేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు తగ్గట్టుగా కుదిరింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ ;
విజయ్ ఆంటొని
మెయిన్ స్టోరి
మైనస్ పాయింట్స్ ;
స్లో నేరేషన్
నేటివిటి
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment