సాహోకు తిప్పలు తప్పవా..? | Saaho Hindi Box Office Collection Day 4 Film Close To Rs 100 Crore | Sakshi
Sakshi News home page

సాహోకు తిప్పలు తప్పవా..?

Published Tue, Sep 3 2019 2:43 PM | Last Updated on Wed, Sep 4 2019 12:19 PM

Saaho Hindi Box Office Collection Day 4 Film Close To Rs 100 Crore - Sakshi

బాహుబలి ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోహీరోయిన్లుగా భారీబడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ హిందీలో రూ.100 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. సాహో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ వెర్షన్లలో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో కలుపుకుని మూడు రోజుల్లో దాదాపు 300 కోట్ల కలెక్షన్లు సాధించింది. సినిమాపై డివైడ్‌ టాక్‌ వచ్చినా, సినీ విశ్లేషకులు నెగెటివ్‌గా రివ్యూలిచ్చినా బాక్సాఫీస్‌ వసూళ్లు వాటికి గట్టి సమాధానం చెప్పాయి.

ఇకపోతే మూడు రోజలుగా కలెక్షన్లు కురిపిస్తున్న సాహో కాస్త నెమ్మదించినట్టు తెలుస్తోంది. సోమవారం వినాయక చవితి ఉండటంతో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దీని ప్రభావం హిందీ వెర్షన్‌పై పడింది. హిందీలో వసూళ్లు 50 శాతానికి పైగా పడిపోయి రూ.14 కోట్లు మాత్రమే రాబట్టింది. గత నాలుగు రోజులుగా బాలీవుడ్‌లో పలు రికార్డులను మట్టి కరిపిస్తూ రూ.93 కోట్లు వసూళ్లు సాధించిన సాహో సెంచరీకి చేరువలో ఉంది. ఎలాగోలా సాహో హిందీలో సెంచరీ కొట్టడం ఖాయం. అయితే సాహోకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. సెలవులు పూర్తయ్యాయి. మరి ఇప్పుడు నిజంగా సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి చూస్తాడా లేదా అనేది తేలనుంది.

ఇక అనవసర సీన్లు ఉన్నాయని, స్క్రీన్‌ప్లే సాగదీసినట్టుగా ఉందంటూ పలువురు సినిమాపై విమర్శలు ఎక్కుపెట్టారు. మూడు సంవత్సరాల తర్వాత ప్రభాస్‌ సాహో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుండటంతో భారీ అంచనాలతో హైప్‌ క్రియేట్‌ అయినా చివరకు ఉసూరుమనిపించిందని పెదవి విరిచారు. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేరోమ్‌ సల్లే తన ‘లార్గో వించ్‌’ సినిమాను కాపీ కొట్టి సాహోను చిత్రీకరించారని సాహో యూనిట్‌పై మండిపడ్డారు. గతంలోనూ లార్గో వించ్‌ చిత్ర కథా కథనాలను కాపీ చేసి అజ్ఞాతవాసి తీశారని, దీనిపై పోరాడుతానని చెప్పినా అది బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో గమ్మునుండిపోయాడు.

ఇప్పుడు సాహో కూడా కాపీ సినిమా అంటూ కామెంట్‌ చేస్తూ.. ‘తీస్తే తీశారు. కనీసం కాపీ కొట్టడమైనా కరెక్ట్‌గా చేయండి’ అంటూ తెలుగు దర్శకులకు సూచించారు. సాహోపై విమర్శలు రావటం ఇది మొదటిసారేం కాదు.. గతంలోనూ బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్‌ అనుమతి తీసుకోకుండా తన ఆర్ట్‌ను సినిమాలో సెట్‌ డిజైన్‌ వాడుకున్నారని ఆరోపించారు. పలు పోస్టర్‌లు కూడా హాలీవుడ్‌ చిత్రాల్లో నుంచి మక్కీకి మక్కీ దించారని సాహో టీం ఆరోపణలు ఎదుర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement