
'సుబ్రమణ్యం ఫర్ సేల్' రివ్యూ
టైటిల్ : సుబ్రమణ్యం ఫర్ సేల్
జానర్ : రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామ
తారాగణం : సాయి ధరమ్ తేజ్, రెజీనా, ఆదాశర్మ, నాగబాబు, సుమన్, రావు రమేష్
దర్శకత్వం : హరీష్ శంకర్
సంగీతం : మిక్కీ జె మేయర్
నిర్మాత : దిల్రాజు
'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి సూపర్హిట్ సినిమా తరువాత మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ అదే బ్యానర్లో అదే హీరోయిన్తో చేసిన సినిమా కావటంతో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' రిలీజ్కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా 'రామయ్యా వస్తావయ్యా' లాంటి ఫెయిల్యూర్ తరువాత హరీష్ శంకర్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేశాడు. అందుకే మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకొని సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. మరి 'సుబ్రమణ్యం ఫర్ సేల్' హీరో సాయికి, డైరెక్టర్ హరీష్ శంకర్కు ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.
కథ:
కర్నూలులోని ఓ పెద్ద కుటుంబానికి చెందిన సీత (రెజీనా) తన తండ్రి రెడ్డప్ప (సుమన్) ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడన్న కోపంతో ఇంట్లో నుంచి పారిపోతుంది. కుటుంబానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో అమెరికా చేరిన సీతకు, తన జీవితంలోని ప్రతి నిమిషాన్ని డాలర్లుగా మార్చాలన్న కసితో ఉన్న సుబ్రమణ్యం (సాయి ధరమ్ తేజ్ ) పరిచయం అవుతాడు. అదే సమయంలో వారితో కలిసిన చింతకాయ్ (బ్రహ్మనందం), రెజీనా, సుబ్బులు మంచి మిత్రులవుతారు.
ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న కోపంతో సీతను కుటుంబసభ్యులు ద్వేషిస్తుంటారు. అదే సమయంలో తన చెల్లెలు (తేజస్వి) పెళ్లికి రావాలనుకున్న సీత... సుబ్బును తన భర్తగా నటించమంటుంది. అలా తిరిగి కర్నూలు చేరిన కథ ఎలాంటి మలుపు తిరిగింది. సుబ్బుకు అప్పటికే గోవింద్ (అజయ్), అతని చెల్లెలు దుర్గ (ఆదాశర్మ)లతో ఉన్న శతృత్వం ఏంటన్నదే మిగతా కథ.
నటన:
తొలి సినిమాతోనే తానేంటో రుజువు చేసుకున్న సాయి ధరమ్తేజ్ ఈ సినిమాలో మరింత పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన ఎమోషన్స్ను చాలా బాగా పండించాడు. అయితే ఎక్కువ సన్నివేశాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ల బాడీలాంగ్వేజ్, డైలాగ్ మాడ్యూలేషన్లను ఇమిటేట్ చేయటంతో ఒరిజినాలిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ రెజీనా గ్లామర్తో పాటు నటిగా కూడా ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్తో పాటు ఎమోషనల్, కామెడీ సీన్స్లో కూడా తన మార్క్ చూపించి సీత క్యారెక్టర్కు తనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ప్రూవ్ చేసుకుంది. నాగబాబు, సుమన్, రావు రమేష్ ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు:
పాత కథను సరికొత్తగా వెండితెర మీద ఆవిష్కరించటంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ ఫార్ములా సినిమాకు, ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేసి మంచి ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. ఇక హీరో క్యారెక్టర్ను ఎలివేట్ చేయటంలో, హీరోయిజం బిల్డప్ చేయటంలో తనకు తిరగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. పంచ్ డైలాగులు, యాక్షన్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్తో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించాడు. లొకేషన్స్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం, రామ్ లక్ష్మణ్ స్టంట్స్ మరింత ప్లస్ అయ్యాయి.
విశ్లేషణ:
విడుదలకు ముందు నుంచి చెపుతున్నట్టుగానే దొంగమొగుడు, బావగారు బాగున్నారా.., పరుగు, బృందావనం లాంటి సినిమాల ఇన్స్పిరేషన్తో ఈ సినిమా కథను రెడీ చేసినట్టుగానే కనిపిస్తుంది. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినా హరీష్ తన టేకింగ్తో ఆకట్టుకున్నాడు. సినిమా స్టార్టింగ్లో కథలోకి వెళ్లడానికి కాస్త ఆలస్యం అయినట్టు అనిపిస్తుంది. పాత్రలను ఎస్టాబ్లిష్ చేయటంలో తన మార్క్ చూపించిన దర్శకుడు, సాయి ధరమ్తేజ్ ఎనర్జీని బాగా ప్రజెంట్ చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. తొలి భాగం అంతా ఎక్కువగా సాయి, రెజీనా లవ్ సీన్స్ మీదే దృష్టిపెట్టడంతో బోర్ ఫీలింగ్ వస్తుంది. కథ కర్నూలు చేరాక వచ్చిన కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. బ్రహ్మనందం కామెడీతో పాటు, మ్యూజిక్, యాక్షన్ ఎపిసోడ్స్ కమర్షియల్ మూవీ లవర్స్ను ఆకట్టుకుంటాయి.
ప్లస్ పాయింట్స్
సాయిధరమ్తేజ్
రెజీనా
సెకండాఫ్ కామెడీ
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
ఫస్టాఫ్లొ కొన్ని సీన్స్
ఓవరాల్గా సుబ్రమణ్యం ఫర్ సేల్ రొటీన్ ఫార్ములాతో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్