వైద్యదేవుడికి సలాం
తమిళసినిమా: వైద్య దేవుడికో సలాం అన్నారు నెంజిల్ తుణివిరుందాల్ చిత్ర యూనిట్. ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదైపోయింది. ఆస్పత్రికి వెళ్లి సగం సొత్తును వైద్యులు పిండేస్తున్న పరిస్థితి. అయితే వైద్యోనారాయణో అంటారు. దాన్ని నిజం చేసిన వైద్యుడొకరు ఉండేవారు. కోవైలోని రాజగణపతి నగర్‌కు చెందిన బాలసుబ్రమణియం వైద్యుడిగా తీసుకున్న తొలి ఫీజు రూ.2. ఆ తరువాత రూపాయి విలువ పడిపోతూ వస్తున్న పరిస్థితుల్లో ఆయన తీసుకున్న చివరి ఫీజు రూ.20.గత ఏడాదే బాల సుబ్రమణియం కన్నుమూశారు. ఆయన్ని అందరూ రూ.20 రూపాయల డాక్టర్ అని పిలిచేవారు. వైద్యమే దైవంగా భావించే బాలసుబ్రమణియం మరణించినప్పుడు ఆ ఊరు అంతా కన్నీటి అంజలి పోస్టర్లు వెలిశాయి. ఆ వైద్యుడి కూతురు, అల్లుడు, మనవడిని నెంజిల్ తుణివిరుందాల్ చిత్ర యూనిట్ సత్కరించారు.
మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ బాలసుబ్రమణియం కుటుంబసభ్యులను అతిథులుగా ఆహ్వానించి సత్కరించారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం నెంజిల్ తుణివిరుందాల్. సంధీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన ఇందులో విక్రాంత్ ముఖ్య పాత్రలో నటించారు.నటి లక్ష్మి నాయకిగా, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అణ్నై ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఆంటోని నిర్మిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వైద్యం నేపథ్యంలో చిత్రం కావడంతో డాక్టర్ బాలసుబ్రమణియం కుటుంబ సభ్యులను ఆహ్వానించి సత్కరించినట్లు చిత్ర దర్శకుడు సుశీంద్రన్ పేర్కొన్నారు. ఇది ఆయన 10వ చిత్రం కావడం విశేషం.ఈ చిత్ర టైటిల్‌ను సుశీంద్రన్ తండ్రి నల్లసామి ఆవిష్కరించారు.