బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే సల్మాన్ ఖాన్ అని టక్కున చెప్పేస్తారు. ‘ప్రేమకు సై.. పెళ్లికి నై’ అన్నది ఈ కండల వీరుడి సిద్ధాంతం అని జోక్‌లేస్తారు కూడా. మరి.. సల్మాన్ లవర్స్ లిస్ట్ తక్కువేం కాదు కదా! సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, ప్రస్తుతం లూలియా వంతూర్... ఇలా చాలా మందితో ఈయనగారు ప్రేమాయణం సాగించారు. బట్.. పెళ్లి? ఊహూ! మూడు ముళ్లు వేసేదాకా ఏ ప్రేమనూ కొనసాగించలేదు. అందుకే సల్మాన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడగకుండా ఉండరు. తాజాగా ఇదే ప్రశ్న మరోసారి ఈ కండలవీరుడికి ఎదురైంది.
సల్మాన్, కత్రినా జంటగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ‘టైగర్ జిందా హై’ డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మెజారిటీ ఫ్యాన్స్ సల్లూభాయ్ పెళ్లి విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇందుకు సల్మాన్ స్పందిస్తూ– ‘‘నా పెళ్లి గురించి మీరందరూ ఆలోచిస్తుండటం సంతోషంగా ఉంది. పెళ్లి టైమ్ వస్తే అయిపోతుంది. లేకుంటే లేదు. పెళ్లి గురించి ప్రత్యేకంగా ఆలోచించడం లేదు. నాకు పెళ్లి అయితే మీకేం లాభమో నాకర్థం కావడం లేదు. అయినా నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా’’ అంటూ ఎప్పటిలానే పెళ్లెప్పుడో చెప్పకుండా దాటేశారు.
Comments
Please login to add a commentAdd a comment