సల్మాన్ ఖాన్కు బెయిల్
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు ముంబై హైకోర్టులో ఉపశమనం లభించింది. హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడ్డ సల్మాన్కు న్యాయస్థానం బెయిల్ను మంజూరు చేసింది. అంతేగాక కింది కోర్టు తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. సెషన్స్ కోర్టులో విచారణ సరిగా జరగలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ ఎం తిప్సే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 30 వేల రూపాయల బాండ్ సమర్పించాల్సిందిగా సల్మాన్ ను ఆదేశించారు. సల్మాన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేదు. విచారణ సమయంలో ఆయన బాంద్రాలోని ఇంట్లో ఉన్నారు. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, సోదరి అల్వీరా కోర్టుకు వచ్చారు.
హిట్ అండ్ రన్ కేసులో రెండ్రోజుల క్రితం ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. ఈ బెయిల్ గడువు ఈ రోజుతో ముగిసింది. కాగా బెయిల్ పొడగించాలని సల్మాన్ తరపున ఆయన న్యాయవాది విన్నవించగా న్యాయస్థానం మన్నించింది. దీంతో ఆయనకు ఊరట కలిగింది.