
సంక్రాంతికి మన పందెం కోళ్లు ఫెస్టివల్ బ్రేక్ తీసుకున్నాయి. డ్యూయెట్లు పాడి, ఫైట్లు చేసి, సెంటిమెంట్లు పండించి, పంచ్ డైలాగ్‌లు కొట్టి, అలసి సొలసి పుంజుకోవడానికి బ్రేక్ తీసుకున్నారు.
సంక్రాంతికి సైరా
ఫుల్ ఫెస్టివల్ మూడ్. ‘సైరా’ టీమ్ ఫుల్ ఫెస్టివల్ మూడ్‌లో ఉంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను కంప్లీట్ చేశారు. ఫిబ్రవరిలో నెక్ట్స్ షెడ్యూల్‌ను పొలాచ్చిలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే.. ‘సైరా’ టీమ్ హ్యాపీగా పండగ చేసుకోవచ్చు.
బ్రేక్‌కి గురిపెట్టారు
పోలీసాఫీసర్‌గా నాగార్జున మరో హిట్‌పై గురిపెట్టి బుధవారం నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి రెండు రోజులు బ్రేక్ వచ్చేలా చిత్రబృందం షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించనున్నారని సమాచారం.
నాన్‌స్టాప్ షూట్
గురూ... ‘గురు’ రిలీజై పది నెలలైంది. నెక్ట్స్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అని వెంకటేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వెంకీ స్లో అయ్యారనుకుంటున్నారేమో? ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తేజతో ఒక సినిమా, త్రివిక్రమ్‌తో ఒక సినిమా, అనిల్ రావిపూడి సినిమా లైన్‌లో ఉన్నాయి. వీటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుంది? అన్నది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న. ప్రస్తుతానికి బ్రేక్‌లో ఉన్న వెంకీ వన్స్ షూట్ లోకి ఎంటరైతే ఏడాదంతా నాన్‌స్టాప్‌గా చేస్తారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి.. మూడు సినిమాలంటే అంతే కదా. బ్రేక్ తీసుకునే వీలు ఎక్కడుంటుంది? పండగ బ్రేక్ తర్వాత గురు సెట్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది.
బ్యాక్ టు బ్యాక్ బ్రేక్
కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు మహేశ్‌బాబు. అలాంటిది పెద్ద పండగ సంక్రాంతికి ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించకుండా ఉంటారా? ఆల్రెడీ కేటాయించారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు 13న ప్యాకప్ చెబుతారట. సో.. పండగకు సెలవు దొరికేసినట్లే. ఆల్రెడీ ఇప్పుడు మహేశ్‌బాబు బ్రేక్‌లో ఉన్నారు. ఇలా షూటింగ్‌లో పాల్గొని, అలా ఐదు రోజులు చేసి బ్రేక్ తీసుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ అన్నమాట.
స్టార్ట్ చేస్తే ఆగేది లేదు
కెరీర్‌లో ఎప్పుడూ తీసుకోనన్ని రోజులు ఎన్టీఆర్ బ్రేక్ తీసుకున్నారు. ‘జై లవ కుశ’ రిలీజై మూడు నెలలకు పైగా అయింది. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ కాలేదు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ మేకోవర్‌కి దాదాపు రెండు నెలలు పడుతుంది. లాంగ్ బ్రేక్‌కి ఇదే కారణం అయ్యుంటుంది. ఈ గ్యాప్‌లో మేకోవర్‌పై దృష్టి పెడుతూనే ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్ వెళ్లారు. సో... పండక్కి సెలవే. బహుశా వచ్చే నెల షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగేది లేదు.
చిట్టిబాబుకు సెలవు
రీసెంట్‌గా రామ్‌చరణ్ ఎక్కువగా గడుపుతున్నది పల్లెటూరిలోనే. ఈపాటికే మీకు అర్థం అయ్యుంటుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమా గురించి మాట్లాడు తున్నామని. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. ప్రజెంట్ హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌కు 12వ తేదీ తర్వాత సంక్రాంతి సెలవులు ఇస్తారట. పండగ తర్వాత రాజమండ్రిలో స్టార్టయ్యే కొత్త షెడ్యూల్‌లో రామ్‌చరణ్ పాల్గొంటారు.
బ్రేక్ ఉందోయ్
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీ. ఈ చిత్రం ‘ఫస్ట్ ఇంపాక్ట్’కి వచ్చిన రెస్పాన్స్ సూపర్బ్. సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా చేసినందుకు యూనిట్ ఫుల్ హ్యాపీ. మామూలుగా బన్నీ ఎనర్జిటిక్. ఇక హ్యాపీ మూమెంట్స్ అంటే జోరు పెరుగుతుంది కదా. మరి.. పండగ రోజు కూడా షూటింగ్ చేస్తారా? అంటే.. గమ్మునుండవోయ్. బ్రేక్ ఉందోయ్. పండగకి ముందు రోజు వరకూ షూటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటారు.
ఇలా స్టార్ట్ చేసి.. అలా బ్రేక్
ఒకవైపు ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తున్నారు రవితేజ. మరోవైపు ఈరోజు నుంచి కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూట్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. ఇలా స్టార్ట్ చేసి.. అలా బ్రేక్ తీసుకోవాలను కుంటున్నారు. నేటి నుంచి మరో వారం రోజుల పాటు జోరుగా షూటింగ్ చేస్తారు. ఆ తర్వాత పండగకు స్మాల్ బ్రేక్. జస్ట్ రెండు మూడు రోజులంతే. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌తో బిజీ అయిపోతారు.
యుద్ధానికి బ్రేక్
ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. అర్జున్‌కి, కృష్ణాకి. ఒకరిది ప్యారిస్ అయితే.. మరొకరిది తిరుపతి అట. అయితే... వీరిద్దరూ యు« ద్ధం చేయడానికి రెడీ అయ్యారు. అసలు ఎవరీ ఇద్దరు అంటే.. ఇద్దరూ నానీనే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. రీసెంట్‌గా పాతబస్తీమే సవాల్ అంటూ విలన్స్‌ను ఇరగదీశాడు నాని. సంక్రాంతి పండక్కి జస్ట్ టు డేస్ బ్రేక్ తీసుకుని మళ్లీ షూట్‌లో జాయిన్ అవుతారు. అంటే.. యుద్ధానికి టు డేస్ బ్రేక్ అన్నమాట. మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మిస్తున్న ‘అ’ సినిమా టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు.
ఫస్ట్ ఫెస్టివల్... లాంగ్ బ్రేక్
కొత్త పెళ్లికొడుకు నాగచైతన్య పెళ్లి తర్వాత జస్ట్ కొన్ని రోజులే బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘సవ్యసాచి’ షూటింగ్‌తో బిజీ. చైతూ–సమంత పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ హిందూ ఫెస్టివల్ సంక్రాంతి. క్రిస్మస్ పండగను ఈ జంట బాగానే జరుపుకున్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ షూటింగ్‌తో బిజీగా ఉన్న చైతూ 11, 12తేదీల వరకూ ఈ సెట్స్‌లోనే ఉంటారు. ఆ తర్వాత పండగకి బ్రేక్ ఇస్తారు. ఇది రెండు మూడు రోజుల బ్రేక్ కాదు. నెలాఖరు వరకూ ఈ యూనిట్ బ్రేక్ తీసుకుంటారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మళ్లీ షెడ్యూల్ మొదలవుతుంది.
ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టి..
ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టి పండగ చేసుకోబోతున్నారు వరుణ్ తేజ్. ప్రేమకు ఫుల్‌స్టాప్ పడితే ఎవరైనా పండగ చేసుకుంటారా అనుకుంటున్నారా? వరుణ్ ముగింపు పలికింది సినిమా లవ్‌కి. ప్రస్తుతం ‘తొలి ప్రేమ’ అనే లవ్‌స్టోరీ మూవీలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుగుతోంది. పండగకి ముందే ఇది పూర్తయిపోతుంది. దీంతో సినిమా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో.. పండగ షురూ.
‘అల్లరి’ నరేశ్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్‌తో పాటు మరికొందరు హీరోలు సంక్రాంతికి బ్రేక్ తీసుకోబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment