
సాక్షి, హైదరాబాద్ : ఎల్‌బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకూ ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా వాహనాల మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏఆర్ పెట్రోల్ పంప్, అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్‌కోఠి, లిబర్టీ, రవీంద్రభారతి నుంచి ఎల్‌బీ స్టేడియం మీదగా వెళ్లే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ముఖ్య అతిథిగా చిరంజీవి
కాగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరూ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరు కానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.