మహేశ్‌బాబుకు జన నీరాజనం.. | Sarileru Neekevvaru Team Attended Success Meet In Warangal | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబుకు జన నీరాజనం..

Published Sat, Jan 18 2020 11:12 AM | Last Updated on Sat, Jan 18 2020 1:38 PM

Sarileru Neekevvaru Team Attended Success Meet In Warangal  - Sakshi

సాక్షి, హన్మకొండ: హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన “సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, హీరోయిన్‌ రష్మిక, లేడీ అమితాబ్‌ విజయశాంతి, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాతలు దిల్‌ రాజు, అనిల్‌ సుంకర, నటులు రాజేంద్రప్రసాద్‌ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మూడు గంటల పాటు సాగిన వేడుకల్లో సత్య బృందం నృత్యాలు, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ సమకూర్చిన పాటలతో గాయకులు అభిమానులను ఉర్రూతలూగించారు.

అందరికీ ధన్యవాదాలు
తనపై అభిమాన వర్ష కురిపించిన ప్రతి ఒక్కరికి హీరో మహేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఐదు సినిమాలకే దర్శకత్వం వహించిన అనిల్‌ రావిపూడి అన్ని సూపర్‌ డూపర్‌ హిట్లను ఇవ్వడం సంతోషకర విషయం అన్నారు. అంచనాలకు మించి బ్లాక్‌ బస్టర్‌ కా బాప్‌గా సినిమాను ఆదరించిన అభిమాన దేవుళ్లకు రుణపడి ఉంటానని తెలిపారు. భవిష్యత్‌లో కూడా మంచి సందేశాత్మకమైన చిత్రాలే కాకుండా అభిమానులకు నచ్చే విధంగా తీస్తానని హీరో అన్నారు. 

మంచిగున్నారా...
హీరోయిన్‌ రష్మిక మాట్లాడుతూ ‘హలో వరంగల్‌.. మంచిగున్నారా’ అంటూనే సినిమాలోని అర్థమవుతుందా అనే డైలాగ్‌ను చెప్పడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభకు వేలాదిగా అభిమానులు హాజరుకాగా జేఎన్‌ఎస్‌ కిక్కిరిసిపోయింది.

సినీ పరిశ్రమను వరంగల్‌ కు గుంజుకురండి
రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ‘సినిమాలు అనగానే విజయవాడ, వైజాగ్‌కు వెళ్తున్నారు.. అలా కాకుండా సిని పరిశ్రమను వరంగల్‌ అడ్డాగా గుంజుకురావాలి’ అని సినీ ప్రముఖులను ఉద్దేశించి కోరారు. అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులతో తన వంతుగా సహకరిస్తానని అన్నారు. కాగా నిర్మాత దిల్‌ రాజు తన ప్రసంగంలో సినీ పరిశ్రమను వరంగల్‌కు గుంజుకురావడం కష్టమైనదేనని చెప్పారు.

చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డాక్టర్‌ టి.రాజయ్య, నగర పోలీసు కమిషనర్‌ వి.రవీందర్, గ్రేటర్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావుతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. కాగా, సభ అనంతరం చిత్ర యూనిట్‌ సభ్యులు పర్వతగిరిలో మంత్రి దయాకర్‌రావు స్వగృహానికి వెళ్లారు.
చదవండి: నెవ్వర్‌ బిఫోర్‌ సంక్రాంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement