ప్రణయ గీతంలో రాకుమారి!
ఓ పక్క వర్షం.. మరోపక్క ప్రణయ గీతం. రాకుమారిగా శ్రీయ నృత్యం.. మధ్యప్రదేశ్‌లోని రాజదర్బార్‌లో జరుగుతున్న సందడి ఇది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసమే ఇదంతా. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న చారిత్రక చిత్రమిది. శాతకర్ణిగా బాలకృష్ణ, శాతకర్ణి అర్ధాంగి యువరాణి వశిష్ఠదేవిగా శ్రీయ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు నెల రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం సిరివెన్నెల సాహిత్యం అందించగా, చిరంతన్ భట్ స్వరపరిచిన గీతాన్ని చిత్రీకరిస్తున్నారు.
డ్యాన్స్ మాస్టర్ స్వర్ణ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. రోజుకి 18 గంటల పాటు యూనిట్ సభ్యులు కష్టపడుతున్నారు. బాలకృష్ణ, శ్రీయతో పాటు ఇతర నటీనటులు, ముంబయ్‌కు చెందిన క్లాసికల్ డ్యాన్సర్లపై పాటను తెరకెక్కిస్తున్నారు. శ్రీయ పార్ట్ సోమవారంతో పూర్తయింది. ఈ నెల 25తో ముగిసే ఈ షెడ్యూల్‌తో 80శాతం సినిమా పూర్తవుతుందట. వచ్చే నెల 3వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.