ఖైదీ x శాతకర్ణి
♦ గత సంక్రాంతికి బాబాయ్, అబ్బాయి.. థియేటర్ల వార్
♦ జూనియర్ సినిమా బెనిఫిట్‌షో అనుమతికి నిరాకరణపై వివాదం
♦ తాజాగా పండుగ బరిలో మెగాస్టార్, యువరత్న చిత్రాలు
♦ విజయవాడలో ఖైదీ నెంబర్–150 ట్రైలర్ రిలీజ్‌కు అనుమతించకపోవడంపై మెగా అభిమానుల ఆగ్రహం
♦ హాయ్‌ల్యాండ్‌లో ఈ నెల 7న ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ రిలీజ్
సాక్షి, అమరావతి: ఏడాదికో మారు వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి నందమూరి బాలకృష్ణకు సంకటంగా మారుతోంది. గడిచిన సంక్రాంతికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల రిలీజ్‌తో థియేటర్ల కొరత నందమూరి వారసుల మధ్య వార్‌కు తెరతీసిన సంగతి తెల్సిందే. ఈ సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య పోటీ సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ జనవరి 11 న, యువరత్న బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వియ్యంకుడి గా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినిమా రిలీజ్‌కు సినిమా హాళ్ల సమస్య ఉండ దు. అదే సమయంలో సినీ నిర్మాత అల్లు అర వింద్‌కు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లు ఉండటంతో ఆయన బావ చిరంజీవి సినిమా విడుదలకు ఇబ్బందిలేదు. అయితే రెండు చిత్రాల టీజర్, ఆడియో, ట్రైలర్, సినిమా విడుదల వరకు చోటు చేసు కుంటున్న వరుస పరిణామాలు మెగా అభి మానుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
చిరు సినిమా ట్రైలర్ రిలీజ్‌పై మెగా వివాదం...
చిరంజీవి సినిమా ట్రైలర్ రిలీజ్‌కు వేదిక విషయంలో తలెత్తిన సమస్య అధికార తెలుగుదేశం పార్టీపై మెగా అభిమానులు ఆగ్రహానికి దారితీసింది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఈ నెల 4 న విజయవాడలో ట్రైలర్ విడుదల చేయాలని భావించారు. అయితే అందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడానికి ప్రభుత్వ ఒత్తిడే కారణమని మెగా ఫ్యాన్స్ గత కొద్ది రోజులుగా సోషల్ నెట్‌వర్క్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చివరకు గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఈ నెల 7న ఖైదీ నెంబర్ 150 సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేలా సోమవారం నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 26 న తిరుపతిలో నిర్వహించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఈ సినిమా వెయ్యి రోజులకు పైగా ఆడాలని అభిలషించారు. ఈ నేపథ్యంలోనే తన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమాకు మెగాస్టార్ సినిమా ఖైదీ నెంబర్ 150 పోటీ కాకుండా ఉండాలనే ముందుచూపుతోనే అధికార పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఈ మేరకు పోస్టింగుల్లో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్‌తో...
గత ఏడాది సంక్రాంతి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలయ్య ‘డిక్టేటర్’ల నడుమ థియేటర్ల వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా ఆగస్టు 31 అర్ధరాత్రి తరువాత బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతి రాకుండా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో జూనియర్ సినిమాలు చూడొద్దం టూ బాలయ్య అభిమానుల పేరుతో అధికార పార్టీ శ్రేణులు పలువురికి సెల్ మెసేజ్‌లు పంపడం, సోషల్ నెట్‌వర్క్‌లో పోస్టులు పెట్టడం వివాదాస్పదమయ్యాయి. చివరకు ఆ పంచాయతీ సీఎం వద్దకు చేరి అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా బెనిఫిట్ షో కి ప్రభుత్వం అనుమతి ఇవ్వక తప్పలేదు.
ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు
చినకాకాని (మంగళగిరి): మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ కార్యక్రమం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకానిలో జరగనుంది. హాయ్‌ల్యాండ్ ఎదుట గల ఖాళీ భూములలో నిర్వాహకులు వేదికను ఏర్పాటు చేస్తున్నారు. చాలాకాలం అనంతరం చిరంజీవి సినిమాలలో నటిం చడం సినిమా ప్రీ రిలీజ్‌కు మంగళ గిరిని వేదికగా చేసుకోవడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశముందని భావిస్తున్నారు.