తెలుగు తెరకు కొత్త దేవుడు
అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో మరో భక్తి రస చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తుడు హథీరాం బాబా జీవితకథ ఆధారంగా సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు నమో వెంకటేషాయ అనే పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
సాక్ష్యాత్తు శ్రీనివాసుడితో పాచికలాడిన పరమ భక్తుడు హథీరాం బాబా కథతో సినిమా అంటే ఆ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కూడా చాలా సమయం తెర మీద కనిపిస్తోంది. అందుకే ఆ పాత్రలో కనిపించే నటుడి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. గతంలో అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాల్లో సుమన్ దేవుడి పాత్రలో కనిపించగా కొత్త సినిమా కోసం ఓ ఉత్తరాది నటుణ్ని తీసుకురావాలని భావిస్తున్నారట.
పలు హిందీ సీరియల్స్లో శ్రీమహావిష్ణువు, కృష్ణుడు, శ్రీ రాముడి పాత్రల్లో కనిపించిన సౌరభ్ రాజ్ జైన్ను నాగార్జున సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లి తెర మీదే కనిపించిన సౌరభ్కు తొలిసారిగా సినిమా అవకాశం రావటం పై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో సౌరభ్ క్యారెక్టర్పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.