గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారిన సమంత, సిద్ధార్థల ప్రేమ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే ఈసారి వారిద్దరికీ రహస్యంగా వివాహం జరిగిపోయినట్లు కొన్ని తమిళ పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. సమంత, సిద్ధార్థల కుటుంబ సభ్యులతో పాటు, పరిమిత బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగిట్లు ఆ పత్రికలు పేర్కొన్నాయి.
సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఇంతకు ముందే ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలసి జబర్దస్త్ అనే తెలుగు చిత్రంలో నటించారు. ఆ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారమైంది. ఆ తర్వాత సిద్ధార్థ, సమంత కుటుంబసభ్యులు శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకుని రాహుకేతువు పూజ నిర్వహించారు. దాంతో వారి ప్రేమ వ్యవహారంపై వార్తలు వెలువడ్డాయి.
అయితే దీనిపై స్పందించిన సిద్ధార్థ అది తమ వ్యక్తిగత వ్యవహారమని, ప్రచారాలకు పుల్స్టాప్ పెట్టాలని ట్విట్ట్ చేశారు. కాగా సిద్ధార్థ తన స్నేహితురాలు మేగ్నాని 2003లో ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. అయితే వారి పెళ్లి మూడునాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది దాంతో వారిద్దరూ 2006లో విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ మాత్రం తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకూ బయట పొరపాటున కూడా మాట్లాడక పోవటం విశేషం.
ఇక సమంత అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోనుగాక చేసుకోను...నాకు నచ్చినోడ్ని నా పెద్దలకు పరిచయం చేసి వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది కూడా. అంతే కాకుండా తాను ఓ వ్యక్తి ప్రేమలో ఉన్నానని, అయితే ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఇప్పుడే కాదని దానికి చాలా టైమ్ ఉందనీ ఆ సమయం వచ్చినప్పుడు తాను మెచ్చినవాడ్ని అందరికి పరిచేయం చేస్తానని సమంత చెప్పింది కూడా ప్రేమ వివాహమే..అని చెప్పడానికి తనకు భయం లేదనీ ప్రేమిస్తేనే ఒకర్ని ఒకరు అర్థం చేసుకొని జీవితం సాఫీగా సాగిపోవడానికి వీలవుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని సమంత అబిప్రాయపడింది.
ప్రస్తుతం సమంత కెరీర్ టాప్ గేర్లో దూసుకుపోతుంది. ఆమె అయిదు చిత్రాల్లో నటిస్తుండగా, వాటిలో రెండు చిత్రాలు దాదాపు పూర్తయ్యాయి. తమిళంలోనూ ఈ చిన్నది బిజీబిజీగా ఉంది. సిద్ధార్థ కూడా తెలుగుతో పాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఇటీవల తమిళంలో నటించిన ఓ చిత్రంలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. సిద్ధూ కోరిక మేరకే ఆమె ఈ పాత్ర పోషించినట్లు కోలీవుడ్ టాక్.
అంతేకాకుండా హైదరాబాద్లో ఓ తెలుగు ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమంత దక్షిణాది సంప్రదాయంలో నిండుగా పట్టు చీర కట్టుకొని, జడ ముడి వేసుకొని ఆ ముడి చుట్టు నిండైన పూలు అలంకరించుకొని అప్పటికే పెళ్లి అయిపోయిన గృహిణిలా రావడం అందరినీ ఆశ్చర్య పరచింది. అలాగే ఇటీవల సిద్ధార్థ స్నేహితుడి వివాహ వేడుకలోనూ సిద్దార్థ, సమంత హంగామా చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై వారిద్దర్లో ఎవరూ ఒకరు పెదవి విప్పితే కాని పెళ్లి గుట్టు బయటపడే అవకాశం ఉంది.