ప్రతీకాత్మక చిత్రం
సాక్షి , చెన్నై: మితిమీరిన శృంగారం, హద్దులు దాటిన హింస నేటి సినిమాల్లో పెరిగిపోయిందని ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తాతినేతి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఆశిస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాము అని సినీ ప్రముఖులు వాదించడం సరికాదు, ప్రేక్షకులు అలాంటి హింస, శృంగారాన్ని కోరుకోవడం లేదు, అవి లేకుండానే చిత్రాలను ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు.
తన 80 ఏళ్ల జీవితంలో 50ఏళ్లపాటూ తెలుగు సినీ ప్రపంచంలో గడిపిన తాతినేని రామారావు నాటితరం ప్రేక్షకులకు చిరపరిచితులే. ఎన్‌టీఆర్‌తో యమగోల, ఏఎన్‌ఆర్‌తో నవరాత్రి, శోభన్‌బాబుతో జీవనతరంగాలు, అమితాబ్‌తో అంధాకానూన్ చిత్రాలను నిర్మించారు. తెలుగులో 40, హిందీలో సుమారు 35 సినిమాలకు దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనేక చిత్రాలను నిర్మించారు. తమిళంలో 15 సినిమాలకు నిర్మాతగా వ్యహరించారు. ప్రస్తుతం తన కుమారుడు టీ అజయ్‌కుమార్ నిర్మించే చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
2000లో ‘పూలందీ’ (హిందీ) అయన నిర్మించిన చివరి చిత్రం. ఆ తరువాత నుంచీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చిన తాతినేని, మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తెలుగు సినీరంగంలో తాజా పరిస్థితులు పరిణామాలపై ముచ్చటించారు. ఒకప్పుడు తెలుగు సినీరంగాన్ని బ్రాహ్మణులు శాసించేవారు. చిత్తూరు నాగయ్య అంటే పరిశ్రమలో ఎంతో గౌరవం ఉండేది. క్రమేణా ఇతరులు ఆ స్థానాన్ని అందుకున్నారు. తరువాతి కాలంలో అదే నాగయ్యను ఒక జూనియర్ ఆర్టిస్టులా అగౌరవపరిచారు.
పరిశ్రమలో కుల పరమైన విభజన, మంచి, చెడు అనేవి నాడు, నేడూ కూడా మిళితమై ఉన్నాయి. సినిమా ఫెయిలైతే నిర్మాతను ఆదుకునేందుకు నటీనటులు మరో సినిమాకు సిద్ధమయ్యేవారు. మా హయాంలో షెడ్యూలు వేళల ప్రకారం నటీనటులు, సాంకేతిక నిపుణలు స్పాట్‌కు వచ్చేవారు. నేడు సినీ రంగంలో అలాంటి క్రమశిక్షణ లోపించింది. వారసత్వం పెరిగిపోవడం వల్ల హీరో అనే పదానికి అర్థం మారిపోయింది. ఒకప్పుడు హీరో అంటే ఎన్‌టీఆర్ లా ఉండాలని నిర్మాతలు ఆశించేవారు. నేడు అలాంటి పరిస్థితి లేదు. అందుకే సినిమాలు ఆపేశాను. సినీ పరిశ్రమపై అవగాహన లేనివారంతా రంగ ప్రవేశం చేయడం వల్లనే నష్టాలు, కొందరు నిర్మాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
హీరో క్రేజును అడ్డుపెట్టుకుని అత్యధిక రేట్లకు సినిమా హక్కులు అమ్మిన నిర్మాతలు అదే సినిమా ఫ్లాప్ అయినపుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత సొమ్ము చెల్లించడం సరైన విధానమే. సక్సెస్ ఉంటేనే సినీరంగంలో హవా. అయితే అదృష్టవశాత్తూ దక్షిణాది, ఉత్తరాదిలో కూడా నేను అనేక విజయాలు చవిచూశాను. సినీరంగంలోని నేటి పరిస్థితులకు ఇమడలేక నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నాను. మంచి సినిమా తీయాలనే ఉంది. ఏమో చూద్దాం. తమిళనాడులోని సొంత వ్యాపారాల రీత్యా అందరితోపాటూ హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా చెన్నైలో స్థిరపడ్డాను.
సినీ పరిశ్రమలో గౌరవం అనేది అడిగి పుచ్చుకునేది కాదు, ప్రవర్తనను బట్టి వస్తుంది. నాతో పనిచేసిన వారు నేటీకి టచ్‌లో ఉంటూ నా పట్ల అభిమానం చూపుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై నో కామెంట్. విశాల్‌పై తెలుగువాడు అనే ముద్రలేదు. హీరోగా ఆదరిస్తున్నారు కదా. నిర్మాతల మండలి అధ్యక్షులుగా విశాల్ మంచి చేస్తున్నారు, గిట్టనివారు విమర్శిస్తున్నారు. అఖిలభారత దర్శకుల సంఘం సభ్యులుగా నేటికీ కొనసాగుతున్నాను. అయితే ఎందుచేతనో ‘మా’లో సభ్యత్వం తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment