తన కెరీర్‌లో ఇప్పటి వరకూ జీరో సినిమాకు పెట్టినంత భారీ బడ్జెట్ ఏ సినిమాకు పెట్టలేదన్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదన్నారు. సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూ.200 కోట్లు ఖర్చు పెట్టి జీరో సినిమాను తెరకెక్కించారు షారుక్. కానీ ఈ చిత్రం కనీసం 100 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. షారుక్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే ఈ చిత్రం ఈ నెల 20న బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్భంగా షారుక్ ఓ చైనా పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో జీరో సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను మా ప్రేక్షకులకు నచ్చే ఓ మంచి సినిమా తీయలేకపోయాను. వారికి నచ్చే విధంగా ఈ స్టోరీని చెప్పలేకపోయాను. కానీ ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. ఇక్కడి ప్రజలకు ఈ సినిమా బాగా నచ్చుతుందని నా నమ్మకం’ అన్నారు.
అంతేకాక ‘ఈ చిత్రం కోసం నేను మూడేళ్లపాటు శ్రమించాను. ఆ కష్టమంతా వృథా అయ్యింది. ఫలితం నాకు అనుకూలంగా రాలేదు. అయితే ఈ విషయం గురించి నేను పెద్దగా బాధపడటం లేదు’ అన్నారు షారుక్. అంతేకాక ‘ఓ సినిమా ఫెయిల్ అయ్యిందని తెలిస్తే.. వెంటనే దాన్ని చూడలేను. ఓ 3 నెలల తర్వాత చూస్తే సినిమాలో నేను ఎక్కడ తప్పులు చేశానో అర్థం అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. ‘జీరో’ సినిమా కోసం షారుక్ నిజంగానే సాహసం చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన మరుగుజ్జు పాత్రలో కనిపించారు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గతేడాది క్రిస్టమస్ సందర్భంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment