జులై 7న పెళ్లి బాజాలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో షాహిద్ కపూర్ పెళ్లి తేదీ ఖరారైంది. ఢిల్లీకి చెందిన మీరా రాజ్పుత్, షాహిద్ ల వివాహం ఈ నెల 7న అంగరంగ వైభవంగా జరగనుంది. గుర్గావ్లోని ఒబెరాయ్ హోటెల్ ఈ పెళ్ళికి వేదిక కానుంది. వధూవరులు కుటుంబ సభ్యులు విడుదల చేసిన శుభలేఖ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతోపాటుగా సంగీత్, మెహిందీ కార్యక్రమాలను ఈనెల 6 న నిర్వహించినున్నట్టు ఒక ప్రకటనలో వారు వెల్లడించారు.
వివాహం అనంతరం ఈనెల 12వ తేదీన ముంబయిలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్టు షాహిద్ సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితులను షాహిద్ ఆహ్వానించినట్టు తెలిసింది. కాగా వరుడు షాహిద్ కోసం ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రవాల్ , వధువు మీరా రాజపుట్ కోసం కోలకతాకు చెందిన డిజైనర్ అనామిక ఖన్నా ప్రత్యేక పెళ్లి దుస్తులను సిద్ధం చేశారు. వీరిద్దరి కోసం మ్యాచింగ్ కలర్స్లో దుస్తులను తయారు చేయించినట్టు సన్నిహితవర్గాలు తెలిపాయి.
మరోవైపు ఝలక్ దిఖలాజా టీవీ షోలో బిజీగా ఉన్న షాహిద్ తన బ్యాచ్లర్ పార్టీని కూడా రద్దు చేసుకున్నట్టు సమాచారం. కరీనా కపూర్తో కలిసి నటిస్తున్న ఓ పంజాబీ సినిమా కారణంగా తన హనీమూన్ కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.