మహేశ్ సినిమాలో ఒక్క ఫ్రేములో కనిపించినా చాలు!
‘‘నా కెరీర్ ‘భలే మంచిరోజు, బాఘీ’ సినిమాల తర్వాత పీక్స్‌లో ఉంది. ఈ టైమ్‌లో మల్టీస్టారర్ ఎందుకు? సోలో హీరోగా చేస్తే మంచి రీచ్ ఉంటుందేమో! అని ఆలోచించా. గతంలో విన్న మల్టీస్టారర్ కథలు నచ్చలేదు. అందువల్ల, శ్రీరామ్ ఆదిత్య ఈ కథ చెబుతానంటే అయిష్టంగా వినేసి ‘నో’ చెబుదామనుకున్నా. కానీ, కథ విన్నాక ‘యస్’ అనేశా’’ అన్నారు సుధీర్‌బాబు. ఆయనతో పాటు నారా రోహిత్, సందీప్‌కిషన్, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘భవ్య’ ఆనంద ప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ ఈ నెల 14న విడుదలవుతోంది. సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు..
∙శ్రీరామ్ ఆదిత్య లైఫ్‌లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన చిత్రమిది. ఇందులో ‘అమ్మ ప్రేమ తెలీకుండా పెరిగిన కుర్రాడి’గా నేను చేసిన పాత్ర మా అమ్మను నాకు పరిచయం చేసింది. రియల్ లైఫ్‌లో మా అమ్మ పుట్టిన వెంటనే అమ్మమ్మ చనిపోయారు. అందువల్ల, తల్లి ప్రేమ లేకుండానే మా అమ్మ పెరిగారు. ఈ పాత్ర చేస్తున్నంత సేపూ ‘తల్లి ప్రేమ తెలీకుండానే అమ్మ నన్నెంత ప్రేమగా పెంచింది’ అని ఆలోచించా. ∙ఇప్పుడు రోహిత్‌తో ‘వీరభోగ వసంతరాయులు’ అనే సినిమా చేస్తున్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్, రాజా దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించా. గోపీచంద్ బయోపిక్ కోసం ఏడెనిమిది కిలోలు బరువు తగ్గాలి. మూడు కిలోలు తగ్గాను. ∙‘మహేశ్‌బాబు సినిమాలో విలన్‌గా చేస్తారా?’ అని అడగ్గా... ‘‘భాఘీ’ తర్వా చాలామంది విలన్ రోల్స్ ఆఫర్ చేసినా, నచ్చక చేయలేదు. మహేశ్ సినిమాలో విలన్‌గా ఏంటి? చిన్న ఫ్రేములో కనిపించినా చాలు’’ అన్నారు.