
మెక్‌డోర్మండ్, గెలెర్మో డెల్‌టొరో, గ్యారీ ఓల్డ్‌మేన్
డాల్బీ థియేటర్.. లాస్ ఏంజిల్స్, యూఎస్‌ఏ. సినిమాకు పండగలాంటి ‘ఆస్కార్–2018’ వేడుక జరుగుతోంది. బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న గెలెర్మో డెల్‌టొరో మాట్లాడుతూ.. ‘‘ఈ కళ, ఈ సినీ పరిశ్రమ వల్ల జరిగే ఓ గొప్ప ప్రయోజనం ఏంటంటే.. ఈ మట్టిలో మనం గీసుకున్న గీతలను అవి చెరిపేస్తాయి. ఈ ప్రపంచం ఆ గీతల్ని ఎంత ఒత్తుగా గీస్తూ వెళ్లినా మనం ఆ గీతలను చెరిపేస్తూనే ఉండాలి..’’ అన్నాడు. హాలీవుడ్‌లో అక్కడి పరిశ్రమకు కేంద్రమైన అమెరికా నుంచే నటులు, టెక్నీషియన్స్ ఎక్కువగా కనిపిస్తారు. గెలెర్మో మెక్సికన్. అయినా కూడా సినిమాయే తనను ఈ స్థాయిలో నిలబెట్టి, దేశాల మధ్య సరిహద్దులు చెరిపేసిందనే కోణంలో ఆయన తన స్పీచ్ ఇచ్చారు.
నిజమే! శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న, ప్రపంచాన్ని ఏకం చేయగల శక్తి సినిమా అనే మాధ్యమానికి తప్పకుండా ఉంది. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కూడా అంత ఉంది ఆ సినిమాకు. అలాంటి సినిమాకు పెద్దన్న లాంటి హాలీవుడ్ సినీ పరిశ్రమ ఏటా చేసుకునే ఆస్కార్ సంబరం, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 90వ ఆస్కార్ వేడుకలో హాలీవుడ్‌లో గతేడాది అద్భుతాలు సృష్టించిన సినిమాలు, టెక్నీషియన్స్‌కు అవార్డులు అందజేసి ఆస్కార్ సంబరం జరిపింది. గతేడాది ఆస్కార్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ప్రముఖ హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్, ఈ ఏడాది కూడా తన స్టైల్లో ఈ షోను ఉత్సాహంగా మొదలుపెట్టి, అలాగే నడిపించాడు. అతని మోనోలాగ్‌తోనే ఈ షో ప్రారంభమైంది.
మోనోలాగ్‌లో ‘‘ఆస్కార్ అవార్డు ప్రకటించే సమయంలో మీ పేరు రాగానే, వెంటనే వచ్చి అవార్డు తీసుకోకండి. ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే గతేడాదిలాగా జరగొద్దని కోరుకుంటున్నా..’’ అన్నాడు. గతేడాది బెస్ట్ పిక్చర్ విషయంలో జరిగిన తప్పిదం తెలిసిందే. బెస్ట్ పిక్చర్ అయిన ‘మూన్‌లైట్’కు బదులు ‘లా లా లాండ్’ను బెస్ట్ పిక్చర్‌గా ప్రకటించి, ఆ తర్వాత తప్పు జరిగిపోయిందని, మూన్‌లైట్‌కు ఆస్కార్ ఇచ్చారు. ఈసారి అలా జరగబోదని, ఎన్వలెప్‌లన్నీ సరిగ్గా చూసుకున్నామని జిమ్మీ చెప్పడంతో డాల్బీ థియేటర్ అంతా గట్టిగా నవ్వులు వినిపించాయి. ఆస్కార్స్‌లో టాప్ అవార్డు అయిన ‘బెస్ట్ పిక్చర్’ను ఈ ఏడాది ‘ది షేప్ ఆఫ్ వాటర్’ అందుకుంది.
పోటీకి నిలబడ్డ తొమ్మిది సినిమాల్లో మిగతా ఎనిమిది సినిమాలను పక్కనబెట్టి బెస్ట్ పిక్చర్ అనిపించుకుంది. ఆస్కార్స్‌లో ఈ ఏడాది ఎక్కువ అవార్డులు అందుకుంది కూడా ఈ సినిమానే! బెస్ట్ పిక్చర్‌తో పాటు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులందుకుంది ‘షేప్ ఆఫ్ వాటర్’. ఇక రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో డంకర్క్ ఎవాక్యుయేషన్‌ను బేస్ చేస్కొని తెరకెక్కిన ‘డంకర్క్’.. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్‌లతో మూడు అవార్డులందుకుంది. ‘బ్లేడ్ రన్నర్ 2049’, ‘కోకో’, ‘డార్కెస్ట్ అవర్’, ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ సినిమాలు రెండు చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి. నామినేషన్స్ దక్కించుకోవడానికి ముందు నుంచే ఆస్కార్‌లో సత్తా చాటుతాయని భావించిన ‘ది పోస్ట్’, ‘లేడీ బర్డ్’ సినిమాలు ఒక్క అవార్డూ దక్కించుకోలేదు.
దాదాపు 4 గంటలకు పైనే సాగిన ఈ వేడుకలో గతేడాదిలాగా ఘోర తప్పిదాలేవీ జరగకపోయినా, అక్కడక్కడా కాస్త బోరింగ్‌గా నడిచిందనే టాక్ తెచ్చుకుంది. గతేడాది ఆస్కార్స్‌ను యూఎస్‌లో 3.29 కోట్ల మంది చూశారని అంచనా. ఈసారి ఆ నంబర్ కాస్త తగ్గొచ్చనే అంచనా వేస్తున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న గ్యారీ ఓల్డ్‌మన్ తన స్పీచ్‌లో చెప్పాల్సిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాక, ‘‘ఆస్కార్ కంటే పెద్దదైన మా అమ్మకు.. వచ్చే బర్త్‌డేకి ఆమెకు 99 ఏళ్లు. ఆమె ఇప్పుడు సోఫాలో కూర్చొని ఈ వేడుక చూస్తూంటుంది. ఆమెకు ఇవ్వాళ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అమ్మా! కాఫీ రెడీగా ఉంచు. ఆస్కార్‌ను ఇంటికి తీసుకొస్తున్నా..’’ అన్నాడు. ఆ మాటకు థియేటర్ అంతా గట్టిగా నవ్వింది. ఆ నవ్వులాంటి ఇంకెన్నో ఎమోషన్స్‌తో ఆస్కార్ ఎప్పట్లానే ఫ్యాన్స్‌కు పండగలా వచ్చి, మళ్లీ వచ్చే ఏడాది కలుద్దామంటూ వెళ్లిపోయింది.
► హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లా డాడు. హార్వీ వెయిన్‌స్టీన్‌పై చేసిన పోరాటం గొప్పదని, ఇది హాలీవుడ్‌లో మార్పు తప్పకుండా తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
► తక్కువ టైమ్‌లో స్పీచ్ పూర్తి చేసిన అవార్డ్ విన్నర్‌కు జిమ్మీ కిమ్మెల్ జెట్ స్కైని గిఫ్ట్‌గా ఇస్తానన్నాడు. మార్క్ బ్రిడ్జెస్ తక్కువ మాట్లాడి (30 సె‘‘) దక్కించుకున్నాడు.
► రోజర్ డేకిన్స్ 13సార్లు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నామినేషన్ సాధించి, నిరాశతో వెనుదిరిగాడు. ఈసారి ‘బ్లేడ్ రన్నర్ 2049’ సినిమాకు ఆస్కార్ దక్కించు కున్నాడు.
► ఫస్ట్ టైమ్ రైటర్‌గా ఒక ఆఫ్రికన్ – అమెరికన్ (జోర్డాన్ పీలె) అవార్డు అందు కున్నాడు.
► 89 ఏళ్లకు ఆస్కార్ అందుకొన్న అతి పెద్దవాడిగా రైటర్ జేమ్స్ ఐవరీ రికార్డ్ సాధించారు.
ఆస్కార్స్ వేడుకలో ‘ఆస్కార్స్ ఇన్ మెమొరియమ్’ పేరుతో ఆ ఏడాది ఈ లోకాన్ని విడిచివెళ్లిన ఫిల్మ్ స్టార్స్‌ను తల్చుకునే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది మెమొరియమ్ సెక్షన్‌లో ఇండియన్ సినిమా లెజెండ్స్ శ్రీదేవి, శశి కపూర్‌లను ఆస్కార్స్ తలుచుకుంది.
అవార్డ్ విన్నింగ్ స్పీచ్
90వ ఆస్కార్ వేడుకలో ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ ఇచ్చిన స్పీచ్‌ను అవార్డ్ విన్నింగ్ స్పీచ్ అనొచ్చు. ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న మెక్‌డోర్మండ్, యాక్సెప్టెన్స్ స్పీచ్‌లో చెప్పాల్సిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పాక, ‘‘నేనిప్పుడు ఒక విషయం చెప్పాలి..’’ అంటూ ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆడవాళ్లందరినీ నిలబడమని చెప్పింది. రెండే రెండు పదాలు చెప్పి ఈ స్పీచ్ ముగిస్తా, అని ‘‘ఇన్‌క్లూజన్ రైడర్’’ అంది. దానర్థం సినిమాల్లో నటించేముందు అగ్రిమెంట్ మీద సంతకం చేసే ఏ–లెవెల్ స్టార్స్‌కు సినిమా క్రూ అండ్ కాస్ట్‌లో 50 శాతం జెండర్ ఈక్వాలిటీ అడిగే చాన్స్ ఉందని. అంటే 50 శాతం మంది ఆడవాళ్లను టీమ్‌లో ఉండేలా చూసుకోమని. ఈ విషయం ఆస్కార్ వేడుక ముగిసాక, మెక్‌డోర్మంటే క్లారిటీ ఇస్తూ చెప్పింది.
విన్నర్స్ లిస్ట్
బెస్ట్ పిక్చర్
ది షేప్ ఆఫ్ వాటర్
బెస్ట్ డైరెక్టర్
గెలెర్మో డెల్‌టొరో (ది షేప్ ఆఫ్ వాటర్)
బెస్ట్ యాక్ట్రెస్ – లీడింగ్ రోల్
ఫ్రాన్సెన్స్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)
బెస్ట్ యాక్టర్ : లీడింగ్ రోల్
గ్యారీ ఓల్డ్‌మేన్ (డార్కెస్ట్ అవర్)
బెస్ట్ యాక్ట్రెస్ : సపోర్టింగ్ రోల్
ఎలిసన్ జేలీ (ఐ, టోన్యా)
బెస్ట్ యాక్టర్ : సపోర్టింగ్ రోల్
సామ్ రాక్‌వెల్ (తీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్)
జోర్డాన్ పీలే (గెట్ ఔట్)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్)
జేమ్స్ ఐవరీ (కాల్ మీ బై యువర్ నేమ్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ
రోజర్ డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్
అలెగ్జాండర్ డిప్లా (ది షేప్ ఆఫ్ వాటర్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
క్రిస్టిన్ ఆండర్సన్ లోపెజ్, రాబర్ట్ లోపెజ్
( సాంగ్ : రిమెంబర్ మి సినిమా : కోకో)
బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ (ఫీచర్)
కోకో
బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ (షార్ట్)
డియర్ బాస్కెట్ బాల్
బెస్ట్ లైవ్ యాక్షన్ (షార్ట్)
ది సైలెంట్ చైల్డ్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ (ఫీచర్)
ఇకారస్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ (షార్ట్)
హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్
ఎ ఫెంటాస్టిక్ వుమన్ (చిలీయన్ సినిమా)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
పాల్ డీ ఆస్టర్‌బెల్లీ, జెఫ్రీ ఎ మాల్విన్, షేన్ వియ (ది షేప్ ఆఫ్ వాటర్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్
జాన్ నెల్సన్, గెర్ద్ నెఫ్‌జర్, పాల్ లాంబర్ట్, రిచర్డ్ ఆర్ హూవర్ (బ్లేడ్ రన్నర్ 2049)
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్
లీ స్మిత్ (డంకర్క్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్
కజుహిరొ సుజి, డేవిడ్ మాలినోవ్‌స్కీ, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ అవర్)
బెస్ట్ కాస్టూమ్ డిజైన్
మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్)
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్
రిచర్డ్ కింగ్, అలెక్స్ గిబ్సన్ (డంకర్క్)
బెస్ట్ సౌండ్ మిక్సింగ్
మార్క్ వెంగర్టిన్, గ్రెగ్ ల్యాండెకర్, గ్యారీ ఎ రిజొ (డంకర్క్)
ఆష్లే జడ్, గాల్ గోడాట్, గ్రేటా గెర్‌విగ్, హీడీ క్లమ్, జెన్నిఫర్ లారెన్స్
అదిరేటి డ్రెస్సు మీరేస్తే ఆహా.. మనసుకి ఆహా.. కంటికి ఆహా అంటూ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసిన అందాల తారలను చూసిన వీక్షకులు ఆహా.. ఓహో అనుకున్నారు. సేమ్‌టైమ్ బెదిరేటి డ్రెస్సులు వేసుకొచ్చిన భామలూ ఉన్నారు. ‘అబ్బే.. బొత్తిగా ఫ్యాషన్ తెలియదు’ అని వాళ్లను చూసి పెదవి విరిచేశారు. ఏదేతైనేం విదేశీ భామలది విశాలమైన హృదయం అని సరదాగా జోకేసుకున్నవారూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment