Oscars Awards 2023: Oscars Awards Date, Time, Venue And All You Need To Know - Sakshi
Sakshi News home page

Oscars 2023: ఆస్కారం ఎవరికి ఎక్కువ!.. లైవ్‌ ఎన్ని గంటలకు?

Published Sun, Mar 12 2023 5:54 AM | Last Updated on Sun, Mar 12 2023 7:15 PM

Oscars Awards 2023: Oscars Awards 2023 will be held on 12 March 2023 in Los Angeles - Sakshi

ఆస్కార్‌ సంబరానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల12న (భారతీయ కాలమానం ప్రకారం 13వ తేదీ) లాస్‌ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. 23 విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఆస్కార్‌ రేస్‌లో ఉన్న చిత్రాల్లో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రం అత్యధికంగా 11 నామినేషన్స్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత ‘ది బన్షీష్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌’,  ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ చిత్రాలు తొమ్మిది నామినేషన్స్‌తో పోటీలో ఉన్నాయి. కాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వంటి విభాగాలతోపాటు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌కు నామినేట్‌ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’పాట గురించి కూడా హాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. అవార్డు దక్కే ఆస్కారం ఎక్కువగా ఎవరికి ఉంది? అంటూ హాలీవుడ్‌ చేస్తున్న విశ్లేషణలోకి వెళదాం.
 
ఉత్తమ చిత్రం  
బెస్ట్‌ మూవీ విభాగంలో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘ది బన్షీష్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌’, ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’, ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’, ‘టాప్‌గన్‌: మ్యావరిక్‌’, ‘ఎల్విస్‌’, ‘ది ఫేబుల్‌మ్యాన్స్‌’, ‘టార్‌’, ‘ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌’, ‘ఉమెన్‌ టాకింగ్‌’ ఇలా మొత్తం పది చిత్రాలు బరిలో ఉన్నాయి. కాగా ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రానికే అవార్డు దక్కే ఆస్కారం ఉందనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. 28వ క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డ్స్, 29వ యాన్యువల్‌ స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డ్స్, 38వ ఫిల్మ్‌ ఇండిపెండెంట్‌ స్పిరిట్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవాల్లో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలిచింది. అలాగే ఇతర విభాగాల్లో 80వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్, 76వ బాఫ్తా అవార్డ్స్‌లో ఈ చిత్రం అవార్డులను సాధించి, ఆస్కార్‌ కమిటీ దృష్టిని ఆకర్షించింది. చైనా నుంచి అమెరికాకు వలస వచ్చి, లాండ్రీ షాపు పెట్టుకున్న ఓ కుటుంబం అనుకోని ప్రమాదాల నుంచి ఎలా బయటపడింది? అన్నదే ఈ చిత్రకథ. డేనియల్‌ క్వాన్, డేనియల్‌ స్కీనెర్డ్‌ దర్శకత్వంలో ఆంథోనీ రుస్సో, జో రుస్సో, మైక్‌లరోకా, జోనాథన్‌ వాంగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిచెల్‌ యోహ్, స్టెఫానీ హ్సు, కే హుయ్‌ క్వాన్‌ ముఖ్య తారలు.

ఉత్తమ దర్శకుడు
ఉత్తమ దర్శకుడి విభాగంలో మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీష్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌) డానియల్‌ క్వాన్, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌), రూబెన్‌ ఆస్టాండ్‌ (ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌) టడ్‌ ఫీల్డ్‌ (టార్‌) పోటీ పడుతున్నారు. కాగా డానియల్‌ క్వాన్, డానియేల్‌ స్కీనెర్ట్‌లు ఉత్తమ దర్శకులుగా అవార్డు తీసుకెళ్తారని టాక్‌. 28వ క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డ్స్‌లో క్వాన్, స్కీనెర్ట్‌ అవార్డు సాధించారు.  

ఉత్తమ నటుడు
ఉత్తమ నటుడి విభాగంలోని అవార్డు కోసం ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌), కొలిన్‌ ఫార్రెల్‌ (ది బన్షీష్‌ ఆఫ్‌ ఇని షెరిన్‌), బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌), బిల్‌ నిగీ (లివింగ్‌),పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌) పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువ పోటీ మాత్రం ‘ఎల్విస్‌’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన ఆస్టిన్‌ బట్లర్, ‘ది వేల్‌’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్‌ ఫ్రాసెర్‌ల మధ్య కనిపిస్తోంది. ఇక ఇటీవల జరిగిన క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డ్స్‌లో బెస్ట్‌ యాక్టర్‌గా బ్రెండన్‌ ఫ్రాసెర్‌ అవార్డును కొల్లగొట్టగా, 80వ గోల్డెన్‌ గ్లోబ్, 76వ బాఫ్తా అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఆస్టిన్‌ బట్లర్‌ నిలిచారు. దీన్ని బట్టి ఆస్టిన్‌ బట్లర్‌కే ఉత్తమ నటుడి అవార్డు దక్కే అవకాశం కనిపిస్తోంది. అమెరికన్‌ రాక్‌ అండ్‌ రోల్‌ మ్యూజిక్‌ సింగర్, యాక్టర్‌ ఎల్విస్‌ ప్రెస్లీ జీవితం ఆధారంగా రూ΄÷ందిన ‘ఎల్విస్‌’లో టైటిల్‌ రోల్‌లో తన నటనతో వావ్‌ అనిపించారు ఆస్టిన్‌ బట్లర్‌. ఈ చిత్రానికి బాజ్‌ లుహార్మాన్‌ దర్శకుడు.  
 
ఉత్తమ నటి
ఉత్తమ నటి విభాగంలో అవార్డు కోసం పోటీలో ఉన్న ‘అన్నా దె అర్మాస్‌’ (బ్లాండ్‌), ‘ఆండ్రియా రైజ్‌బరో’ (టు లెస్లీ), ‘మిషెల్‌ యో’ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), ‘మిషెల్‌ విలియమ్స్‌’ (ది ఫేబుల్‌మ్యాన్స్‌) లను దాటుకుని ‘కేట్‌ బ్లాంచెట్‌’ (టార్‌) విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డ్స్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్, బాఫ్తా అవార్డ్స్‌ ప్రదానోత్సవాల్లో ఉత్తమ నటిగా ‘కేట్‌ బ్లాంచెట్‌’ అవార్డులు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగల ప్రతిభ ఉన్న ఓ మహిళా సంగీత విద్యాంసురాలు జీవితంలో ఎదుగుతున్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కోవలసి వచ్చింది? వాటిని ఆమె ఎలా అధిగమించారు? అన్నదే ‘టార్‌’ సినిమా కథాంశం. మహిళా విద్వాంసురాలిగా కేట్‌ బ్లాంచెట్‌ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు టాడ్‌ ఫీల్డ్‌ దర్శకుడు.


ఆస్కార్‌లో భారత్‌
ఈ ఏడాది దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌) నామినేషన్స్‌ దక్కాయి. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు రావాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక బరిలో ఉన్న ఈ మూడు విభాగాల విశేషాల్లోకి వస్తే...


 
నాటు నాటు..కే అవార్డు?

‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఐదుపాటలు బరిలో ఉన్నాయి. వీటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు..’పాటకు అవార్డు వస్తుందని హాలీవుడ్‌ మీడియా జోస్యం చెబుతోంది. ఇప్పటికే 80వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో, 28వ క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డ్స్‌లో ‘బెస్ట్‌ సాంగ్‌’గా ‘నాటు నాటు..’ నిలిచింది. హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ తదితర అవార్డ్స్‌లోనూ అవార్డులు గెల్చుకుంది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు. ‘నాటు నాటు’తోపాటు ‘టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌’లోని ‘అప్లాజ్‌’, ‘బ్లాక్‌΄పాంథర్‌: వకాండ ఫరెవర్‌’లోని ‘లిఫ్ట్‌ మీ అప్‌’, ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’లోని ‘దిస్‌ ఈజ్‌ ఏ లైఫ్‌’, ‘టాప్‌గన్‌: మ్యావరిక్‌’ చిత్రం నుంచి ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’పాటలు నామినేషన్స్‌ దక్కించుకున్నాయి. ఒకవేళ ‘నాటు నాటు..’పాటకు అవార్డ్‌ వస్తే భారతీయులకు పండగే పండగ.
 
గాయపడ్డ పక్షుల కోసం...
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో శౌనక్‌ సేన్‌ దర్శకత్వం వహించిన ఇండియన్‌ డాక్యుమెంటరీ ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ నామినేషన్‌ దక్కించుకుంది. గాయపడిన పక్షుల సంరక్షణ కోసం ఢిల్లీకి చెందిన సోదరులు నదీమ్‌ షెహజాద్, మహమ్మద్‌ సౌద్‌ తమ జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు? అన్నదే ఈ డాక్యుమెంటరీ ప్రధాన కథాంశం. గత ఏడాది 75వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ గోల్డెన్‌ ఐ అవార్డును సాధించింది. ఇక ఇదే విభాగంలో అమెరికన్‌ ‘ఫైర్‌ ఆఫ్‌ లవ్‌’, రష్యా ‘నవల్నీ’, ‘ఎ హౌస్‌ మేడ్‌ ఆఫ్‌ స్పింట్లర్స్‌’, ‘ఆల్‌ ది బ్యూటీ అండ్‌ ది బ్లడ్‌ షెడ్‌’ పోటీలో ఉన్నాయి.
 
తప్పిపోయిన ఏనుగు

తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్‌ రూ΄÷ందించిన డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’తోపాటు ‘హాలౌట్‌’, ‘హౌ డు యు మెసర్‌ ఎ ఇయర్‌’, ‘ది మార్తా మిచెల్‌ ఎఫెక్ట్‌’, ‘స్ట్రేంజర్‌ ఎట్‌ ది గేట్‌’ పోటీలో ఉన్నాయి.


 
లైవ్‌లో నాటు.. నాటు
ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు..’పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌పాడనున్నారు. ఈపాటకు తాను కూడా లైవ్‌లో పెర్ఫార్మ్‌ చేయనున్నట్లు ఆమెరికన్‌ యాక్ట్రస్, డ్యాన్సర్‌ లారెన్‌ గాట్లీబ్‌ వెల్లడించారు. కాగా హిందీలో ‘ఏబీసీడీ’, ‘ఏబీసీడీ 2’ వంటి చిత్రాల్లో నటించారామె.


 
ప్రీ ఆస్కార్‌పార్టీ
అమె రికాలో ప్రీ ఆస్కార్‌పార్టీ అదిరిపోయే లెవల్‌లో జరిగింది. ఈపార్టీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతోపాటు ప్రియాంకా చో్ర΄ా, ప్రీతి
జింతా తదితర ప్రముఖులుపాల్గొన్నారు.



లైవ్‌ ఎన్ని గంటలకు అంటే...
సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి భారతీయులు ఆస్కార్‌ అవార్డు వేడుకను వీక్షించవచ్చు. అవార్డు వేడుక లాస్‌ ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యే రెండు గంటల ముందు రెడ్‌ కార్పెట్‌ సందడి షురూ అవుతుంది. వేడుక దాదాపు 11 గంటలకు ముగిసే అవకాశం ఉంది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి వేడుకను వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్, ఏబీసీ నెట్‌వర్క్‌ (ఏబీసీ టీవీ, ఏబీసీ.కామ్, ఏబీసీ యాప్, యూట్యూబ్‌) హులు లైవ్‌ టీవీ, డైరెక్ట్‌ టీవీ, ఫ్యూబో టీవీ, ఏటీ అండ్‌ టీ టీవీలో ఆస్కార్‌ అవార్డుల వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. అయితే కొన్నింటికి సబ్‌స్క్రిప్షన్‌ అవసరమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement