
శరత్‌కుమార్
ఇదివరకు చాలా సినిమాల్లో సాగరకన్యను చూశారు. ఇప్పుడు సాగర వీరుడుని చూపించబోతున్నాం అంటున్నారు తమిళ హీరో శరత్‌కుమార్. ఏ.వెంకటెశ్ దర్శకత్వంలో శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాంబన్’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్స్‌లో శరత్ కుమార్ సగం మనిషి, సగం సర్పంలా కొత్త అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ గెటప్ చూడగానే మనిషి సర్పంగా మారాడా లేక సర్పం మనిషిగా మారిందా? అనే అసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
పాము పగపట్టిందంటే తీర్చుకునే వరకు వదలదు అంటారు. మరి ఆగ్రహం నిండిన కళ్లు, చేతిలో శూలం చూస్తుంటే ఈ పాము మనిషి ఎవరి మీదో పగతో రగిలిపోతున్నట్టుగా ఉంది కదూ. మరి ఈ సినిమాలో ‘సర్ప మనిషి’గా కనిపిస్తున్న శరత్‌కుమార్ ఎవరి మీద బుసలు కొడతాడో? ఎలా పగ తీర్చుకుంటాడో చూడాలి. గతంలో దర్శకుడు వెంకటేశ్– శరత్‌కుమార్ కాంబినేషన్‌లో ‘మహాప్రభు, చాణక్య’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఈసారి కూడా హిట్ ఖాయం అంటున్నారు.