అనుబంధం భవతి
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు తీసే బేనర్... స్టోరీ సెలక్షన్‌లో బెస్ట్ అనిపించుకున్న హీరో... ఫొటోలు చూస్తే.. తెరనిండా సీనియర్ ఆర్టిస్టులు... ఇవన్నీ ‘శతమానం భవతి’పై అంచనాలు క్రియేట్ చేశాయి. గత ఏడాది సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ హిట్‌తో పండగ చేసుకున్న శర్వానంద్ ఈసారి కూడా వెనక్కి తగ్గలేదు. మెగా 150 ఫిల్మ్.. నటసింహం నూరో సినిమా మధ్య వచ్చాడు.
కథేంటి?: ఆత్రేయపురంలోని పెద్దమనిషి రాఘవరాజు (ప్రకాశ్‌రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతుల ఇద్దరు కుమారులు, కుమార్తె విదేశాల్లో స్థిరపడ్డారు. రాఘవరాజు తమ్ముడి కుమారుడు బంగార్రాజు (సీనియర్ నరేశ్). బంగార్రాజు కుమారుడు రాజు (శర్వానంద్). రాఘవరాజు, జానకమ్మ దంపతులకు బంగార్రాజు కుటుంబం నోట్లో నాలుకలా ఉంటారు.
సంక్రాంతి పండక్కి పిల్లాపాపలతో తమ పిల్లలు ఊరు వస్తారని జానకమ్మ ఎదురుచూపులతో ఏళ్లకు ఏళ్లు గడుస్తుంటాయి. పరాయి గడ్డ మీద ఉన్న పిల్లలకు సొంత ఊరికి వచ్చే తీరిక ఉండదు. భార్యామణి బాధ చూడలేక రాఘవరాజు ఓ పథకం వేస్తాడు. సంక్రాంతికి కొన్ని రోజుల ముందే íపిల్లలను రప్పిస్తాడు. వరసకు బావ అయ్యే రాజుతో రాఘవరాజు మనవరాలు నిత్య (అనుపమా పరమేశ్వరన్) ప్రేమలో పడుతుంది. రాజుకీ నిత్య అంటే ఇష్టమే. ఇంతలో రాఘవరాజు వేసిన పథకం జానకమ్మకి తెలిసి గొడవ జరుగుతుంది. రాజు, నిత్యల ప్రేమకథ రాఘవరాజు కుమార్తెకి తెలిసి మేనల్లుణ్ణి హెచ్చరిస్తుంది. ఇంట్లో గొడవల్నీ, తన ప్రేమకథలో సమస్యల్నీ రాజు ఏ విధంగా పరిష్కరించాడనేది మిగతా కథ.
విశ్లేషణ: క్లుప్తంగా చెప్పాలంటే... ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాబట్టి, సహజంగానే ఇతర కుటుంబ కథాచిత్రాల పోలికలు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే దర్శకుడు ఎక్కువ సమయం వృథా చేయకుండా ప్రారంభంలోనే కథలోకి, నేరుగా తాను చెప్పాలనుకున్న పాయింట్‌లోకి వెళ్లాడు. ఊహించదగ్గ కథ చుట్టూ మంచి సన్నివేశాలు అల్లుకోవడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ప్రకాశ్‌రాజ్, జయసుధలు తాము తప్ప మరొకరు ఆ పాత్రల్లో నటించలేరు అన్నట్టుగా సన్నివేశాలను రక్తి కట్టించారు. ప్రకాశ్‌రాజ్–జయసుధల డామినేషన్ ఉన్నప్పటికీ కథకు ప్రాధాన్యం ఇచ్చి, శర్వానంద్ ఈ సినిమా ఒప్పుకున్న విషయం అర్థమవుతుంది. మరదలి మీద ఉన్న ప్రేమను అత్త కోసం చంపుకునే సన్నివేశాల్లో శర్వా హావభావాలు, డైలాగులు పలికిన తీరు బాగుంది.
శర్వా, అనుపమల జోడీ బాగుంది. కంగారుపడే బంగార్రాజు అలియాస్ కంగార్రాజు పాత్రలో నరేశ్ నటన అద్భుతం. ‘దిల్’ రాజు నిర్మాణ విలువలు, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. మిక్కి జె.మేయర్ బాణీలు హాయిగా సాగాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ‘శతమానం భవతి...’ పాటలో సాహిత్య విలువలు అనుబంధాలను మరోసారి గుర్తుచేస్తాయి. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. సెకండాఫ్ మధ్యలో అంత్యాక్షరి తరహాలో సాగిన డబ్ స్మాష్ సన్నివేశాలు కథని సాగించడానికి ఉపయోగపడ్డాయి. మిగతా భాగమంతా సున్నితమైన భావోద్వేగాలతో సాగుతుంది. ఇక, పతాక సన్నివేశం పిల్లలకు దూరంగా సొంతూళ్లల్లో నివసిస్తున్న తల్లిదండ్రుల భావాల్ని తెరపై చూపింది. మొత్తంగా ‘దిల్’ రాజు మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ ‘శతమానం భవతి’. డబ్బు సంపాదనలో పడి, తల్లిదండ్రుల ఆప్యాయతానురాగాలను మిస్ అవుతున్న పిల్లలకు ఈ సినిమా ఓ మంచి మెసేజ్.
చిత్రం
‘శతమానం భవతి’
తారాగణం
శర్వానంద్,
అనుపమా పరమేశ్వరన్,
ప్రకాశ్‌రాజ్, జయసుధ,
సీనియర్ నరేశ్...
ఛాయాగ్రహణం
సమీర్‌రెడ్డి,
సంగీతం
మిక్కి జె.మేయర్,
నిర్మాత: ‘దిల్’ రాజు,
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం
వేగేశ్న సతీష్