పొయిటిక్ లవ్
సోషల్ వరల్డ్‌లో ఓపెన్‌గా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్న యువతరం రియల్ వరల్డ్‌లోకి వచ్చేసరికి అంత ఓపెన్‌గా ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్‌ఫ్యూజన్‌గా సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుతం ట్రెండ్‌ని ఆవిష్కరిస్తూ రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. నాగ శౌర్య, పల్లక్ లల్వానీ జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
సంగీత జ్ఞాని ఇళయారాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 7న విడుదల చేయనున్నారు. ఈలోపు నేటి నుంచి శుక్రవారం వరకూ విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, వరంగల్‌లో ఒక్కో పాటను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. రమేశ్ వర్మ చాలా ట్రెండీగా, పొయిటిక్‌గా తెరకెక్కించారు.
ఇళయరాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యాం కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి.