ఒక అన్నయ్య రాజు.. ఇంకో అన్నయ్య మంత్రి
‘‘నా సక్సెస్‌ఫుల్ జర్నీలో కీరవాణి, రాజమౌళి తండ్రులకు భాగముంది. నాతో పనిచేసిన కీరవాణి, రాజమౌళి మంచి విజయాలు అందుకున్నారు. వారి సక్సెస్‌లు చూసి ఓ తండ్రి, గురువులా ఆనంద పడుతున్నా. కాంచి కూడా వారిలాగే సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. నటుడిగా, రచయితగా ప్రేక్షకులకు పరిచయమైన ఎస్‌ఎస్ కాంచి దర్శకత్వం వహించిన చిత్రం ‘షో టైమ్’. రణ్‌ధీర్, రుక్‌సర్ మీర్ జంటగా జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు.
రాజమౌళి మాట్లాడుతూ- ‘‘మా కుటుంబంలోని 13మంది కజిన్స్‌లో కీరవాణి అన్నయ్య కింగ్ అయితే కాంచి అన్నయ్య మంత్రి. టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను హీరో అవ్వాలనే తపనతో పూజలు చేసేవాణ్ణి. హీరో అవ్వాలనుందనే విషయాన్ని సిగ్గుతో ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కాంచి అన్నయ్య ఏమవుదామనుకుంటున్నావు? అని అడిగితే హీరో కావాలనుందని చెప్పా. హీరో అవ్వాలంటే ఊర్లో ఉంటే ఎలా? ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి నాకు గైడ్‌లా వ్యవహరిం చారు. ఆయన ఎప్పుడో దర్శకుడవ్వాల్సింది.. ఇప్పుడయ్యారు. ఫస్ట్ లుక్ టీజర్‌తోనే కట్టిపడేశారు.
ట్రైలర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు. కాంచి మాట్లాడుతూ- ‘‘దర్శకత్వం చేయాలన్నది నా కల కాదు కానీ, ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘భారతీయ సినిమా ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే నా ఆశ. అందులో భాగంగానే ‘షో టైమ్’ నిర్మించా. హాలీవుడ్ నటుడు జాకీచాన్‌తో ఓ చిత్రం నిర్మించబోతున్నా’’ అని సుధీర్ పూదోట చెప్పారు.