ఒకటోసారి...రెండోసారి.!
ఇదేంటి? వేలం పాటలోలా ఒకటోసారి.. రెండోసారి.. అంటున్నారనుకుంటున్నారా? దానికి కారణం లేకపోలేదు. కథానాయికగా శ్రద్ధాదాస్ హీరో రాజశేఖర్‌తో ఒకటోసారి, దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రెండోసారి సినిమా చేయనున్నారు. అసలు విషయం అదన్న మాట. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు శ్రద్ధాదాస్. ‘గుంటూర్ టాకీస్’ తర్వాత ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు.
తాజాగా రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో శ్రద్ధాదాస్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. మరో నాయికగా పూజా కుమార్‌ని తీసుకున్నారట. ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’ చిత్రాల్లో కమల్‌హాసన్‌తో పూజా కుమార్ జతకట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇందులో రాజశేఖర్ పోలీసాఫీసర్ పాత్ర చేయనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.