ఈ సామెత తెలియనివాళ్లు ఉండరు. దీనికి సమాధానం తెలిసినవాళ్లూ ఉండరు. ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా తన జీవితానికి ఈ సామెతను ఆపాదించారు. సినిమాలంటే మీకు చిన్నప్పుడే ఇష్టం ఏర్పడిందా? లేక మీ అమ్మానాన్న (కమల్‌హాసన్, సారిక), ఇంకా ఇతర కుటుంబ సభ్యులు సినిమాల్లో ఉన్నందువల్ల మీరూ వచ్చేశారా? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే– ‘‘కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఏం చెబుతాం. ఇది కూడా అంతే. నేను సినిమా వాతావరణంలోనే పెరిగాను.
అయితే మీ ఫస్ట్ చాయిస్ ఏంటి? అని అడిగితే, ‘సంగీతం’ అంటాను. అయితే నన్ను సినిమానే సెలక్ట్ చేసుకుంది. ఎందుకంటే అది నా డెస్టినీ అని నా ఫీలింగ్. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మా నాన్నగారు యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ లొకేషన్‌కి వెళ్లేదాన్ని. జనరేటర్ వ్యాన్ దగ్గర కూర్చుని హోమ్‌వర్క్ రాసేదాన్ని. ప్రొడక్షన్‌లో ఉన్నవాళ్లంతా నన్ను గారం చేసేవారు. అందుకే చికెన్ అండ్ ఎగ్ ఎగ్జాంపుల్ చెప్పా. నాకు సినిమా మీద దానంతట అదే ప్రేమ పెరిగిందో, సినిమా పరిశ్రమ పిలిచింది కాబట్టి వచ్చానో తెలియడంలేదు.
అయితే ఒకటి మాత్రం నిజం. నా జీవితాన్ని సినిమా నుంచి వేరుచేసి చూడలేను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఓ అభిమాని ఇటీవల శ్రుతీహాసన్‌ని కలిశాడు. అభిమాన తారను కలిసినందుకు బోలెడంత ఆనందాన్ని వ్యక్తం చేసి, ‘మీ పెళ్లెప్పుడు? విందుకి వస్తాను’ అని ట్వీటర్ ద్వారా శ్రుతీని అడిగాడు. ‘‘పెళ్లి విందు అంటే ఇంకా చాలా టైమ్ ఉంది. నా బర్త్‌డే విందుకి వద్దువుగానిలే’’ అని సరదాగా సమాధానం ఇచ్చారామె. బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన శ్రుతి ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని అభిమానికి ఆమె ఇచ్చిన సమాధానం స్పష్టం చేస్తోంది కదూ.
Comments
Please login to add a commentAdd a comment