
రెండిచ్చినా నో అంటున్నా శ్రుతి
ఒక్కోసారి కొన్ని విషయాలు ఎలా జరిగినా ఇతరులను సంతోషంలో ముంచేస్తాయి. తాజాగా నటి శ్రుతిహాసన్ విషయంలోనూ అలాంటి సంఘటనే జరిగిందని సమాచారం. శ్రుతి చాలా బోల్డ్. అది వ్యక్తిగతం కావచ్చు, వృత్తిపరమైన అంశం కావచ్చు, ఇంకేమైనా కావొచ్చు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటానని బహిరంగంగానే చెప్పేంత ధైర్యవంతురాలు శ్రుతిహాసన్. కథానాయకిగా టాప్ పొజిషన్‌లో ఉన్నా మరోవైపు ఐటమ్ సాంగ్ చేయడానికీ ఏ మాత్రం వెనుకాడరు. అయితే అందుకు పారితోషకం మాత్రం భారీగానే డిమాండ్ చేస్తారు. దీన్ని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతగా భావించవచ్చు.
ఇటీవల ఒక సింగిల్ సాంగ్‌కు రెండు కోట్లు పారితోషికం చెల్లిస్తానన్నా నో అని ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో తమిళ వర్గాలు శ్రుతి నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు చాలా సంతోషిస్తున్నాయట. దీనికీ, వారికీ సంబంధం ఏమిటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. శ్రుతిహాసన్ సింగిల్ సాంగ్ చేయనని చెప్పింది ఒక కన్నడ చిత్రానికట.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ కన్నడం, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాగ్వుర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీప్తీసాతి నాయకిగా నటిస్తున్నారు.
తన కొడుకు తొలి చిత్రం కావడంతో భారీగా రూపొందించాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారట. ఇందులో ఒక ప్రత్యేక సాంగ్‌లో నటి శ్రుతిహాసన్ నటిస్తే మరింత ప్రచారం లభిస్తుందన్న ఆలోచనతో ఆమెను సంప్రదించి అందుకు రెండు కోట్లు పారితోషికం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు, అయినా శ్రుతిహాసన్ నో అన్నట్లు సినీ వర్గాల సమాచారం.
ఇక తమిళ వర్గాల సంతోషానికి కారణం తమిళనాడుకు, కర్ణాటకకు మధ్య కావేరి నీటి సమస్య చాలా కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో శ్రుతిహాసన్ కన్నడ చిత్రంలో నటించడానికి నిరాకరించడం ఇక్కడి వారికి ఆనందాన్ని కలిగించడానికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.అయితే శ్రుతిహాసన్ ఆ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయననడానికి అసలు కారణం ఏమిటో తెలియదు గానీ, ఆ పాటలో ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా మెరవనున్నారు.