‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో: బ్రహ్మాజీ | 'Sindhuram' to be hit if the fact had existed in my career says Brahmaji | Sakshi
Sakshi News home page

‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో: బ్రహ్మాజీ

Published Sat, Sep 14 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో: బ్రహ్మాజీ

‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో: బ్రహ్మాజీ

హ్యూమరిజం, హీరోయిజం, విలనిజం.. ఈ మూడింటినీ సమర్థవంతంగా పోషించగల నటుడు బ్రహ్మాజీ. విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, అటుపై హీరోగా మారి, ప్రస్తుతం కేరక్టర్ నటునిగా బిజీ బిజీగా ఉన్న బ్రహ్మాజీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక సంభాషణ...
 
 ****  కెరీర్ ఎలా ఉందండీ?
 రకరకాల పాత్రలు చేస్తూ హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతమైతే క్షణం తీరిక లేదు. లేటెస్ట్‌గా రిలీజైన ‘కమీనా’లో నా పాత్రకు మంచి పేరొచ్చింది.
 
 ****  హీరో అవుదామని వచ్చినట్టున్నారు?
 నిజమే... తాడేపల్లిగూడెంలో చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాలంటే పిచ్చి. అందునా చిరంజీవిగారి అభిమానిని. ఆయన ఏ నేపథ్యం లేకుండా మెగాస్టార్ అయ్యారు. ఆయనలా మనమెందుకు కాకూడద నే భావన మనసులో ఉండేది. అదే నన్ను మద్రాసు వైపు నడిపించింది. 
 
 ****  అంటే చెన్నపట్నం అనుభవాలు మీకూ ఉన్నాయన్నమాట? 
 ప్రైవేట్‌గా ఇంజినీరింగ్ చేస్తానని ఇంట్లో వాళ్లతో నమ్మబలికి తొలిసారి మద్రాసు వెళ్లాను. అక్కడ అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లోకి ప్రవే శించి వాతావరణం ఎలా ఉంటుందో పరిశీలించాను. తర్వాత హైదరాబాద్‌లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. అక్కడే కృష్ణవంశీ, రవితేజ, జేడీ చక్రవర్తి, పూరీ జగన్నాథ్... పరిచయం అయ్యారు.
 
 ****  మరి తొలి అవకాశం?
 రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ కోసం ఆడిషన్స్‌కి పిలిస్తే వెళ్లాను. అందులో మంచి పాత్ర ఇచ్చారు వర్మ. వెన్నుపోటుదారుని పాత్ర. ఆ సినిమా తర్వాత నాకు అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి. 
 
 ****  ‘గులాబీ’లో కూడా దాదాపు అలాంటి పాత్రేగా?
 నా మిత్రుడు కృష్ణవంశీ తొలి సినిమా అది. అందులో నాది ఫలానా టైప్ పాత్ర అని చెప్పకుండా ముందు కొన్ని సన్నివేశాలు తీశాడు వంశీ. తర్వాత నాపై ఆ మిత్రద్రోహానికి సంబంధించిన సీన్స్ తీస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నా తత్వం అలాంటి వాటికి పూర్తి విరుద్ధం. కష్టం మీద ఆ పాత్ర చేశాను. ఇప్పటికీ ఆ పాత్ర గుర్తొస్తే నాకు ఏదోలా ఉంటుంది. కానీ నాకు మంచి పేరు తెచ్చిన పాత్ర అది. 
 
 ****  ‘సిందూరం’ లాంటి సినిమాలో హీరోగా చేసిన మీరు హీరోగా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు?
 ‘సిందూరం’ మంచి సినిమా. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. గులాబీ, నిన్నేపెళ్లాడతా చిత్రాల తర్వాత కృష్ణవంశీ చేసిన సినిమా అది. దాంతో ‘సిందూరం’ కూడా లవ్‌స్టోరీ అనుకున్నారు జనాలు. కానీ అది పూర్తి భిన్నమైన గొప్ప కాన్సెప్ట్. అందుకే తేలిగ్గా జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు రిలీజైతే ఆ సినిమా పెద్ద హిట్. ‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో. ఏదిఏమైనా ‘సిందూరం’ లాంటి మంచి సినిమాలో హీరోగా చేశాననే తృప్తి మాత్రం మిగిలింది. 
 
 ****  ఆ సినిమాలో సెకండ్‌హీరోగా చేసిన రవితేజ ఇప్పుడు అగ్రహీరో. రేస్‌లో వెనుకబడిపోయానని ఎప్పుడైనా అనిపించిందా?
 నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే దక్కుతుంది. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా రకరకాల పాత్రలు చేస్తూ సంతృప్తిగా ఉన్నాను. హీరోలకు ఇన్ని వైరైటీ పాత్రలు చేసే అవకాశం ఉండదు కదా. అయినా రవితేజ నా ప్రాణమిత్రుడు. తను ఆ స్థాయికి రావడం ఫ్రెండ్‌గా నాకు ఆనందమే. 
 
 ****  మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది?
 తను సహాయ దర్శకునిగా ఉన్నప్పట్నుంచే నాకు ఫ్రెండ్. అప్పుడు తన పలకరింత ఎలా ఉండేదో, ఇప్పటికీ అలానే ఉంటుంది. కించిత్ గర్వం కూడా తలకెక్కించుకోని వ్యక్తిత్వం రవితేజది. తను ఏ సినిమాలో నటించినా సాధ్యమైనంతవరకూ నన్ను కూడా ఆ సినిమాలో నటింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అలా నాకు లభించిన పాత్రలు కోకొల్లలు. ఓ విధంగా నా ఫ్రెండ్స్ వల్లే ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది. కృష్ణవంశీ, జేడీ, పూరీ, త్రివిక్రమ్, శ్రీనువైట్ల.. వీళ్లందరూ కెరీర్ తొలినాళ్లలో నాకు మంచి మిత్రులు కావడం వల్లే ఈ రోజు నేనింత బిజీగా ఉన్నాను. 
 
 ****  మీకు డ్రీమ్ కేరక్టర్ ఏదైనా ఉందా?
 అవన్నీ ఒట్టి మాటలండీ. అసలు డ్రీమ్ కేరక్టర్లు ఎవరికీ ఉండవు. మంచి పాత్రలు ఉంటాయి. ప్రకాష్‌రాజ్‌లా వైరైటీ పాత్రలు చేయాలని ఉంది. 
 
 ****  ఇండస్ట్రీలో పరభాషా నటులను ప్రోత్సహించడం ఎక్కువైనట్లుంది?
 అవును. దీనివల్లే తెలుగు నటులకు మంచి పాత్రలు దక్కడం లేదు. హిందీ, మలయాళం చిత్రాలతో పోలిస్తే క్వాలిటీ పరంగా కూడా తెలుగు సినిమా వెనుకబడిందనే చెప్పాలి. మన లోటుపాట్ల గురించి అత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
 ****  నటుడిగానే కొనసాగుతారా? లేక డెరైక్షన్ చేస్తారా?
 డెరైక్షన్‌పై ఇంట్రస్ట్ ఉంది. ఆ శక్తి దేవుడు ఇస్తే తప్పకుండా చేస్తా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement