వైరముత్తు.. తమిళంలో పేరున్న రచయిత. గొప్ప కవి. అనర్గళంగా మాట్లాడతారు. ఇప్పటివరకూ ఆయన గురించి ఇలాంటి విషయాలే అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు గాయని చిన్మయి ఆయన గురించి బయటపెట్టిన కొన్ని ఆరోపణలను తెలుసుకుని ‘స్వచ్ఛమైన వైరం (తమిళంలో వజ్రాన్ని వైరం అంటారు) అనుకున్నాం.. కాదా?’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ చిన్మయి దగ్గర వైరముత్తు అసభ్యంగా ప్రవర్తించారా అంటే? కాదు. సంగీతానికి సంబంధించిన విభాగంలో వేరే స్త్రీల పట్ల ఆయన అమానుషంగా ప్రవర్తించారట. ఆ స్త్రీలు వైరముత్తు వల్ల తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పారు కానీ, తమ పేరు బయటకు చెప్పకుండా చిన్మయి ట్వీటర్‌కి వ్యక్తిగత మెసేజ్‌లు పంపారు. ఆ సంఘటనలను చిన్మయి బయటపెట్టారు. ‘వైరముత్తు మా పట్ల ఈ విధంగా నడుచుకున్నాడు’ అంటూ ఆ అమ్మాయిలు పేర్కొన్న విషయాలను చిన్మయి తన ట్వీటర్‌లో ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ వచ్చారు. ఫైనల్‌గా ‘నేను పాడినా పాడకపోయినా మీ టైమ్ అయిపోయింది’ అని వైరముత్తుని ఉద్దేశించి చిన్మయి ఓ ట్వీట్ పెట్టారు. ఇక చిన్మయికి ఆ అమ్మాయిలు పంపించిన వ్యక్తిగత మెసేజ్‌లు గురించి తెలుసుకుందాం.
# నాకు 18 ఏళ్లు. ఓ ప్రాజెక్ట్ పని మీద వైరముత్తు గారితో కలసి పని చేయాల్సి వచ్చింది. ఆయన గొప్ప కవి, లెజెండ్ అని నాకు విపరీతమైన అభిమానం ఉండేది. ఓసారి పాటలోని లైన్‌ని వివరిస్తూ సడన్‌గా వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. ఓకే సార్ అంటూ అక్కడి నుంచి పరిగెత్తాను. అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉండటానికి భయపడేదాన్ని. ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకూ నలుగురితో పాటే ఉండేదాన్ని.
# నా వర్క్‌ని అభినందించడానికి తన ఆఫీస్‌కి పిలిచారు. ఆయన్ను నా తాతగారిలా భావించాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం అలాంటిది. అయితే ఆయన నా పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తిస్తాడని ఊహించలేదు. నేను గదిలోకి వెళ్లగానే తలుపు వేసి నన్ను తాకబోయాడు. నేను అక్కణ్ణుంచి పరిగెత్తుకు వెళ్లిపోయాను. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి, తన భార్యకు చెప్పొద్దు అన్నాడు.
# నాకోసం బటర్ మిల్క్ ఆర్డర్ చేశాడు. అది తాగుతున్నప్పుడు నీ పెదాలకేదో అంటుకుంది అంటూ, మెల్లిగా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దుపెట్టుకోబోయాడు. వెంటనే నా ఫోన్ పట్టుకుని పరిగెత్తాను. నా ఫ్రెండ్స్‌కు, కొందరు సింగర్స్‌కు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ విషయం ఇంకా మా ఆయనకు తెలియదు. ఒకవేళ ఆయనకు తెలిస్తే నా కెరీర్‌ను సాగనివ్వరేమో.
# నాకు తెలిసిన ఓ సింగర్‌కి ఎదురైన అనుభవం ఇది. తనని వైరముత్తుకు పరిచయం చేసినప్పుడు మాట్లాడటానికి నిర్మాతను, తనను ఓ హోటల్‌లో కలవమన్నారు. ఆ తర్వాత నీకు పాడే అవకాశం కావాలంటే ఒక రాత్రి గడపాలన్నారు. వెంటనే తను ఏడుపందుకుంది. తను గోల్డ్ మెడలిస్ట్. ఆ సంఘటనతో సినిమాలో పాడనని ఒట్టు పెట్టుకుంది.
# బాధితులు పేర్కొన్న ఈ విషయాలను ట్వీటర్ ద్వారా షేర్ చేసిన చిన్మయి ‘నా ట్వీటర్ ఖాతా హ్యాక్ అవ్వలేదు. నేను ఇక్కడ షేర్ చేసిన ఈ ఆరోపణలన్నింటినీ నమ్ముతాను. వాటి కోసం నిలబడతాను కూడా. అలాగే మానసికంగా కూడా ఆరోగ్యకరంగానే ఉన్నాను’ అని పేర్కొన్నారు. నిజంగానే వైరముత్తు అలా ప్రవర్తించి ఉంటారని కొందరు అంటుంటే, హుందాగా ఉండే వ్యక్తులపై బురద జల్లే ప్రయత్నం అని మరికొందరు అంటున్నారు. నిజమేంటో పెరుమాళ్లకే ఎరుక.
Comments
Please login to add a commentAdd a comment