చిన్మయి శ్రీపాద
‘మీటూ’ ఉద్యమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కీలకపాత్ర పోషించారు. ప్రముఖ తమిళ కవి వైరముత్తుపై ఆరోపణలు చేయడమే కాకుండా, అజ్ఞాతంగా ఉంటూ ఆయనపై ఆరోపణలు చేసినవారి ట్వీట్స్‌ను తన ట్వీటర్‌లో పోస్ట్ చేశారామె. అది మాత్రమే కాదు.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మయి ఆరోపణలు చేశారు. దాంతో గత ఏడాది నవంబర్‌లో ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండానే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యత్వ ఫీజు చెల్లించలేదనే కారణం చూపి చిన్మయిని యూనియన్ నుంచి పక్కనపెట్టారు.
ఈ విషయంలో న్యాయం కోసం చిన్మయి మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా హై కోర్టు టెంపరరీ స్టే ఇస్తూ, ఈ విషయం మీద మార్చి 25లోగా వివరణ ఇవ్వాలని రాధారవిని ఆదేశించింది. ‘‘ఇది కేవలం కొన్ని రోజుల స్టే మాత్రమే. రాధారవి, అతని అనుచరులు ఎలా స్పందిస్తారో, అప్పుడు కేసు ఎలా ముందుకు నడుస్తుందో చూడాలి. ఇది వరకు యూనియన్ నుంచి తప్పించబడ్డ వాళ్ల అనుభవాలు వింటే ఇది కొన్నేళ్లపాటు సాగే పోరాటం అని అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ఇలా కేసు ఏళ్ల తరబడి సాగితే చిన్మయి గొంతు తమిళంలో మళ్లీ ఎప్పుడు వినిపించాలి? అసలు చిన్మయికి మళ్లీ డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఇస్తారా? కాలమే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment