
సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో ఫిర్యాదు
తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ హీరో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్: సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ‘చందమామ’ హీరో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్ బుక్ లో పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ డబ్బింగ్ పనులను పూర్తి చేశామని, ఈ సినిమా బృందం కసిగా పనిచేస్తోందని పేర్కొంటూ శివబాలాజీ పలు ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలపై ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించాడు. అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైం ఏసీపీ బలరాంకు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కాటమరాయుడు సెట్ లో పవన్ కళ్యాణ్ కు కత్తిని అతడు బహూకరించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి.