
శివకార్తికేయన్ కన్ను మరోసారి బాలీవుడ్ బ్యూటీస్‌పై పడిందా? ఇందుకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇటీవల నటించిన సీమరాజా, మిస్టర్ లోకల్ చిత్రాలు నిరాశపరిచాయి. అయినా మళ్లీ విజయాన్ని అందుకుంటాననే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులేస్తున్నానని శివకార్తికేయన్ ఇటీవల పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఈయన రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తాను నిర్మించిన నెంజముండు నేర్మై యుండు ఓడు రాజా చిత్రం ఈ నెల 24న తెరపైకి రానుంది.
తన నిర్మాణ సంస్థలో మరో చిత్రానికి కూడా రెడీ అయ్యిపోయారు. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి శివకార్తికేయన్ ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. దీన్ని లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలను కడుతున్నారు. ఇంతకు ముందు విఘ్నేశ్‌శివన్ తెరకెక్కించిన నానుమ్ రౌడీదాన్, తానా సేర్నద కూటం చిత్రాలకు అనిరుదే సంగీతాన్ని అందించాడు.
ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మూవీలో శివకార్తికేయన్‌కు జంటగా నటి నయనతారనే నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ కన్ను ముంబై బ్యూటీస్‌పై పడిందని సమాచారం. తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటిస్తున్న అలియాభట్‌ను శివ కార్తికేయన్ సరసన నటింపజేసే పనిలో ఉన్నారట. ఒక వేళ ఆ అమ్మడు కాకపోతే కియారా అద్వానిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్లో శివకార్తికేయన్‌తో జత కట్టడానికి సై అనే బ్యూటీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. మరో విషయం ఏమిటంటే అలియాభట్ గానీ, కియారా అద్వాని గానీ ఇప్పటి వరకూ కోలీవుడ్‌లో పరిచయం కాలేదు. అలాంటిది శివకార్తికేయన్ సరసన కోలీవుడ్ ఎంట్రీకి వీరు సుముఖత చూపిస్తారా లేదా అన్నది చూడాలి.