తమ్ముడి సినీ ఆరంగేట్రంపై సోనమ్ ఆందోళన
తన తమ్ముడు హర్షవర్ధన్ బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేయడంపై సినీ నటి సోనమ్ కపూర్ ఆందోళన వ్యక్తం చేసింది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తీయనున్న ‘మీర్జా సాహిబా’ సినిమాలో అనిల్ కపూర్ చిన్న కుమారుడైన హర్షవర్ధన్ నటించనున్నాడు. బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి హర్షవర్ధన్ రావడం సంతోషంగా ఉందని అంటూనే, చిన్న వయస్సులోనే సినిమాల్లో నటించడం ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయాన్ని సోనమ్ కపూర్ వ్యక్తం చేసింది. అయితే సినీ కెరీర్‌లో బాగా రాణించాలని కోరుకుంటున్నానని ఆమె ఆదివారం మీడియాకు తెలిపింది. చారిత్రక నేపథ్యమున్న ప్రేమకథతో తెరకెక్కిస్తున్న మీర్జా సాహిబా సినిమాలో హర్షవర్ధన్ మీర్జా పాత్రను పోషిస్తున్నాడని వివరించింది.
అమెరికాలో స్క్రీన్‌ప్లే, నటనలో విద్యాభ్యాసం చేసిన హర్షవర్ధన్ ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చాడని తెలిపింది. త్వరలో విడుదల కానున్న రణబీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా నటించిన బాంబే వెల్వెట్ సినిమా దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవముందని తెలిపింది. బాలీవుడ్‌లో మరో సోదరుడు అర్జున్ కపూర్ మెరుగ్గా రాణిస్తున్నాడని ఆనందం వ్యక్తం చేసింది. అర్జున్ రోజురోజుకు పరిణితితో కూడిన నటన చేస్తున్నాడని వివరించింది. అందంగా కనిపించే అర్జున్ మంచి వ్యక్తి అని, మంచి వ్యక్తులకే జీవితంలో అంతే మంచి జరుగుతుందని తెలిపింది. అర్జున్ మంచి స్నేహితుడని, ఏవైనా సమస్యలున్నా తనతో చర్చిస్తాడని చెప్పింది. నా స్నేహితుడిగా ఉండాలని అర్జున్ కోరుకుంటాడని, అయితే అతను నిదానపు మనిషి కాదని వెల్లడించింది.