ప్రతిష్ఠాత్మకంగా నా వందో సినిమా
‘‘తెలుగు నేల రెండుగా విడిపోయినా... తెలుగువారందరూ ఒక్కటే. అందరూ కలిసి మెలిసి ఉండాలి. ఇరు ప్రాంతాలూ గొప్పగా అభివృద్ధి చెందాలి’’ అని బాలకృష్ణ అన్నారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణ సినీ స్టూడియోలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు బాలకృష్ణ. ‘‘మహానటుడు నందమూరి తారకరామారావుగారి బిడ్డగా పుట్టడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అభిమానులు అందించిన ప్రోత్సాహంతో అద్భుతమైన పాత్రలు పోషించి, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు నాన్న. ఇప్పుడు నేను కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నాను’’ అన్నారు బాలకృష్ణ.
ప్రస్తుత పరిస్థితుల్లో తనకు సినిమాలకన్నా ప్రజలే ముఖ్యమని, అటు నటునిగా, ఇటు బాధ్యతగల ప్రజానాయకునిగా తాను పూర్తి చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని అందుకే మంత్రి పదవిని సైతం కాదనుకున్నానని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు. ఇటీవల ప్రారంభమైన తన 98వ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఉంటుందని, తరువాత రూపొందే తన 100వ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉండనుందని బాలకృష్ణ ప్రకటించారు. తదనంతరం జరిగిన బాలకృష్ణ సన్మాన కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, నందమూరి రామకృష్ణతో పాటు బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేశ్, భరత్‌లు కూడా పాల్గొన్నారు.