‘‘మా నాన్నగారు (శైలేంద్రబాబు) 20 ఏళ్లుగా కన్నడంలో సినిమాలు చేస్తున్నారు. అక్కడి స్టార్స్‌తో పని చేశారు. తెలుగులో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేశారు. ఇక్కడి మార్కెట్, ప్రేక్షకుల ఆదరణ చూసి తెలుగులో నన్ను పరిచయం చేయాలనుకుని ‘బ్రాండ్‌బాబు’ సినిమా తీశారు’’ అని హీరో సుమంత్ శైలేంద్ర అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ప్రభాకర్.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ శైలేంద్ర చెప్పిన విశేషాలు.
∙డైరెక్టర్ మారుతిగారిని ఓ మంచి సినిమా చేయమని రెండు మూడేళ్లుగా అడుగుతున్నాను. ఓ రోజు ఆయన నన్ను పిలిచి ప్రభాకర్ దర్శకత్వంలో సినిమా చేయమని, తాను రాసుకున్న కథ అందించారు. ప్రతి ఒక్కరికీ బ్రాండ్స్ వస్తువులు వాడాలనే పిచ్చి ఉంటుంది. అందుకే.. ఓ కొత్త హీరోగా ఇలాంటి కథ నాకు యాప్ట్ అవుతుందనిపించి ఈ చిత్రం చేశా. ఇది పక్కా మారుతి బ్రాండ్ మూవీ.
∙బ్రాండ్స్ అంటే ఇష్టపడే ఓ రిచ్ ఫ్యామిలీ అబ్బాయిగా కనపడతాను. పెక్యులర్ పాత్ర నాది. బ్రాండ్స్ ధరించే వ్యక్తులతోనే మాట్లాడతాడు. అలాంటి యువకుడు ఓ పేదింటి అమ్మాయిని ఎలా ప్రేమించాడన్నదే కథ. తెలుగు ప్రేక్షకులు సినిమాలను పండగలా ఫీలై చూస్తారు. ఇక్కడ మార్కెట్ చాలా పెద్దది.
∙సినిమాల్లోకి రావాలనే ఆలోచన ముందు నుంచీ లేదు. ఓ రోజు మైసూర్‌లో ఉపేంద్రగారి సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఆయనకు దొరికిన ఆదరణ, గౌరవం చూసి నేనూ సినిమాల్లోకి రావాలనుకున్నా. ప్రజల్లో ఆదరణ పొందాలంటే రాజకీయాల్లో అయినా ఉండాలి... లేదా సినిమాల్లో అయినా ఉండాలి. రాజకీయాలు నాకు తెలియవు కాబట్టి సినిమా రంగంలోకి అడుగుపెట్టాను.
∙నటుడు అల్లు అర్జున్ నాకు ఇన్‌స్పిరేషన్. ఆయన నటించిన ‘ఆర్య’ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యా. హీరో అయ్యాక రెండు సార్లు ఆయన్ను కలిశాను. అల్లు శిరీష్ చాలా క్లోజ్. ఎన్టీఆర్, మహేశ్‌బాబు, బన్ని సినిమాలు చూస్తుంటా. కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువగా చూశా.
∙ప్రేక్షకుల అభిరుచి మూడు నాలుగేళ్లకోసారి మారుతుంటుంది. ట్రెండ్ మారుతోంది కాబట్టి అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి చేయడం కంటే పెద్ద మార్కెట్ ఉన్న తెలుగులోనే చేయాలనుకున్నా. పైగా.. రెండు భాషల్లో ఒకేసారి చేసే సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సెంటిమెంట్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment