Brand Babu
-
బ్రాండ్ బాబు సినిమాపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 'బ్రాండ్ బాబు' సినిమా పై కేసు నమోదైంది. తన ఫోటోను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించడంపై ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. బ్రాండ్ బాబు సినిమాలో చనిపోయిన సన్నివేశంలో తన ఫోటో చూపారని బాధిత మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మారుతి కథను సమకూర్చారు. -
‘బ్రాండ్ బాబు’ స్పెషల్ ప్రీమియర్ షో
-
‘బ్రాండ్ బాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రాండ్ బాబు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ సంగీతం : జెబి రచన : మారుతి దర్శకత్వం : ప్రభాకర్ పి నిర్మాత : శైలేంద్ర బాబు దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలా మారుతి మార్క్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రాండ్ బాబు.. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాకర్ దర్శకుడు. బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడిగా తొలి ప్రయత్నం ‘నెక్ట్స్ నువ్వే’తో నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన బ్రాండ్ బాబుతో ఆకట్టుకున్నారా..? డిఫరెంట్ క్యారెక్టర్లో తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మెప్పించాడా..? కథ: డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ) తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్(సుమంత్ శైలేంద్ర), తన బ్రాండ్ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్) తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : బ్రాండ్ బాబుగా తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మంచి నటన కనబరిచాడు. రిచ్ ఫ్యామిలీ వారసుడిగా పొగరు, యాటిట్యూడ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ సరిగ్గా సరిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మురళీ శర్మ సూపర్బ్ అనిపించారు.(సాక్షి రివ్యూస్) చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మకు బ్రాండ్ బాబులో కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపించినా.. ఓవరాల్‌గా మరోసారి కీలక పాత్రలో మురళీ శర్మ సినిమాకు ప్లస్ అయ్యారు. ఇతర పాత్రల్లో పూజిత పొన్నాడా, రాజా రవీంద్ర, వేణు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : దర్శకుడిగా ఫుల్ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదాత్మకంగా మలిచాడు. బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ అందుకున్న ప్రభాకర్ నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. రెండో ప్రయత్నంగా మారుతి బ్రాండ్‌తో బ్రాండ్ బాబు సినిమాను తెరకెక్కించారు. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కినా సినిమాలో ఎక్కువగా మారుతి మార్క్ సీన్సే కనిపిస్తాయి. దర్శకుడిగా ప్రభాకర్ తన మార్క్ చూపించలేకపోయాడు. కామెడీ పరంగా సినిమా బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులు తమ ఎమోషన్స్‌ను దాచుకొని బయటికి ఎలా నటిస్తోరో, ఎలా ప్రవర్తిస్తారో చూపించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. కొన్నిసీన్స్ అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. (సాక్షి రివ్యూస్)హీరోకు హీరోయిన్ మీద ప్రేమ కలగడానికి, అతనిలో మార్పు రావడానికి బలమైన కారణం ఏమీ కనిపించదు. జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. సుమంత్ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు భారీగానే ఖర్చు పెట్టారు. ప్లస్ పాయింట్స్ : కామెడీ మురళీ శర్మ నటన ప్రొడక్షన్ వ్యాల్యూస్ మైనస్ పాయింట్స్ : పాటలు ఎడిటింగ్ సెకండ్ హాఫ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మారుతిగారి జోక్యం లేదు
‘‘డైరెక్టర్ మారుతిగారు ‘బ్రాండ్ బాబు’ కథ రెడీ చేసి వేరే డైరెక్టర్‌తో చేయాలనుకుంటున్న టైమ్‌లో నిర్మాతలు ‘బన్ని’ వాసు, ఎస్.కె.ఎన్, ఎడిటర్ ఉద్భవ్ నా గురించి చెప్పారు. మారుతిగారు కథ చెప్పారు. బాగా నచ్చింది. డైరెక్షన్ చేస్తానని చెప్పా’’ అన్నారు ప్రభాకర్. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రభాకర్ చెప్పిన విశేషాలు... ► నా తొలి చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’ నిరాశపరచింది. అయితే సినిమా చూసినవారు సూపర్ అన్నారు. కానీ ప్రేక్షకుల్ని సినిమాకి రప్పించలేకపోయాం. దెయ్యం కథ కావడంతో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో మహిళా ప్రేక్షకులు, పిల్లలు సినిమాకి రాలేదు. ► మారుతిగారు ‘బ్రాండ్ బాబు’ కథని చక్కగా వండి నా చేతుల్లో పెట్టి వడ్డించమన్నారు. ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు నా బ్రదర్ చనిపోవడంతో వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ ఆగకూడదని మారుతిగారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఓ సీన్ డైరెక్ట్ చేశారు. హీరో ఫ్యామిలీకి బ్రాండ్స్ పిచ్చి ఉంటుంది. దాన్నే వెటకారంగా, వినోదాత్మకంగా చూపించాం. ► ఇప్పటి హీరోయిన్లు కథ, పాత్ర గురించి కాకుండా హీరో ఎవరు? బ్యానర్ ఏంటి? అని అడుగుతున్నారు. ఈషా నా పాత్ర ఏంటి? అన్నారు. తనను చూస్తుంటే సావిత్రి, సౌందర్యగార్లను చూసినట్టు అనిపించింది. ► ‘బ్రాండ్ బాబు’ డైరెక్షన్ విషయంలో మారుతిగారు జోక్యం చేసుకోలేదు. మనం మరో సినిమా చేద్దామని మారుతిగారు అన్నారు. జ్ఞానవేల్ రాజాగారు ఓ చిత్రం చేద్దామన్నారు. ఆరేడు సెంటిమెంట్ కథలు రెడీ చేశా. నటుడిగానూ కొనసాగుతా. -
ఉపేంద్రగారిని చూసి హీరో అయ్యా
‘‘మా నాన్నగారు (శైలేంద్రబాబు) 20 ఏళ్లుగా కన్నడంలో సినిమాలు చేస్తున్నారు. అక్కడి స్టార్స్‌తో పని చేశారు. తెలుగులో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేశారు. ఇక్కడి మార్కెట్, ప్రేక్షకుల ఆదరణ చూసి తెలుగులో నన్ను పరిచయం చేయాలనుకుని ‘బ్రాండ్బాబు’ సినిమా తీశారు’’ అని హీరో సుమంత్ శైలేంద్ర అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ప్రభాకర్.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ శైలేంద్ర చెప్పిన విశేషాలు. ∙డైరెక్టర్ మారుతిగారిని ఓ మంచి సినిమా చేయమని రెండు మూడేళ్లుగా అడుగుతున్నాను. ఓ రోజు ఆయన నన్ను పిలిచి ప్రభాకర్ దర్శకత్వంలో సినిమా చేయమని, తాను రాసుకున్న కథ అందించారు. ప్రతి ఒక్కరికీ బ్రాండ్స్ వస్తువులు వాడాలనే పిచ్చి ఉంటుంది. అందుకే.. ఓ కొత్త హీరోగా ఇలాంటి కథ నాకు యాప్ట్ అవుతుందనిపించి ఈ చిత్రం చేశా. ఇది పక్కా మారుతి బ్రాండ్ మూవీ. ∙బ్రాండ్స్ అంటే ఇష్టపడే ఓ రిచ్ ఫ్యామిలీ అబ్బాయిగా కనపడతాను. పెక్యులర్ పాత్ర నాది. బ్రాండ్స్ ధరించే వ్యక్తులతోనే మాట్లాడతాడు. అలాంటి యువకుడు ఓ పేదింటి అమ్మాయిని ఎలా ప్రేమించాడన్నదే కథ. తెలుగు ప్రేక్షకులు సినిమాలను పండగలా ఫీలై చూస్తారు. ఇక్కడ మార్కెట్ చాలా పెద్దది. ∙సినిమాల్లోకి రావాలనే ఆలోచన ముందు నుంచీ లేదు. ఓ రోజు మైసూర్లో ఉపేంద్రగారి సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఆయనకు దొరికిన ఆదరణ, గౌరవం చూసి నేనూ సినిమాల్లోకి రావాలనుకున్నా. ప్రజల్లో ఆదరణ పొందాలంటే రాజకీయాల్లో అయినా ఉండాలి... లేదా సినిమాల్లో అయినా ఉండాలి. రాజకీయాలు నాకు తెలియవు కాబట్టి సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ∙నటుడు అల్లు అర్జున్ నాకు ఇన్స్పిరేషన్. ఆయన నటించిన ‘ఆర్య’ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా. హీరో అయ్యాక రెండు సార్లు ఆయన్ను కలిశాను. అల్లు శిరీష్ చాలా క్లోజ్. ఎన్టీఆర్, మహేశ్‌బాబు, బన్ని సినిమాలు చూస్తుంటా. కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువగా చూశా. ∙ప్రేక్షకుల అభిరుచి మూడు నాలుగేళ్లకోసారి మారుతుంటుంది. ట్రెండ్ మారుతోంది కాబట్టి అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి చేయడం కంటే పెద్ద మార్కెట్ ఉన్న తెలుగులోనే చేయాలనుకున్నా. పైగా.. రెండు భాషల్లో ఒకేసారి చేసే సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సెంటిమెంట్ కూడా ఉంది. -
నా బలం అదే - మారుతి
‘‘స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంది. నేను అనుకున్న కాన్సెప్ట్ వారికి నచ్చాలి. కాలం కలిసి రావాలి. కొన్ని విషయాల ప్రభావం నా మీద పడకుండా నేను నాలా ఉండాలని ప్రయత్నించే వ్యక్తిని నేను. నేను తీసే సినిమాల కథలు దేనికదే డిఫరెంట్. డైరెక్టర్స్ ఎగై్జట్ అయ్యేదే సినిమా. కొందరికి బాగా నచ్చుతుంది. మరికొందరికి అది నార్మల్‌గా ఉండొచ్చు. నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమీ లేదు’’ అన్నారు మారుతి. సుమంత్ శైలేంద్ర కథానాయకుడిగా పార్కీ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రాండ్ బాబు’. ఇందులో ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. ఎస్. శైలేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి కథ అందించడంతోపాటు సమర్పకులుగా వ్యవహరించారు. ‘బ్రాండ్ బాబు’ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మారుతి చెప్పిన సంగతులు... ∙భావోద్వేగాలకు, ప్రేమలకు విలువ ఇవ్వకుండా కేవలం బ్రాండ్స్‌ని మాత్రమే ఫాలో అవుతుంటాడు హీరో. హోమ్మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే ప్రయత్నంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత నిజం తెలుసుకుంటాడు. బ్రాండ్స్‌ను బట్టే ఇతరులను అంచనా వేసే హీరో ఫ్యామిలీ అతని లవ్‌ని ఒప్పుకుంటారా? ఆ తర్వాత హీరో పరిస్థితి ఏంటి? అన్నదే స్టోరీలైన్. ఏ టాపిక్ తీసుకున్నా మారుతి నవ్వించడగలడు అనుకునే ప్రేక్షకుల అంచనాలు ‘బ్రాండ్ బాబు’ సినిమాలో కూడా మిస్ కావన్న హామీ ఇవ్వగలను. ∙ఏదో కాసేపు బ్రాండ్స్‌పై ప్రేక్షకులను నవ్విద్దామని చేసిన కథ కాదు ఇది. మంచి సందేశం కూడా ఉంటుంది. సినిమాలో జెన్యూనిటీ ఉంటుంది. ఫస్ట్ టైమ్ నేను పూర్తి స్థాయిలో కథ, మాటలు ఇచ్చిన చిత్రమిది. ఆడియన్స్‌కు ఎక్కడా బోర్ కొట్టదు. బ్రాండ్స్‌ను ఫాలో అవుతూ ఎమోషన్స్‌కు, ప్రేమకు విలువ ఇవ్వనివారికి ఈ సినిమా వాటిని గుర్తు చేస్తుంది. ∙శైలేంద్రబాబుగారు నాకు ఎప్పటి నుంచో స్నేహితులు. ఆయన తన అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకుంటున్నప్పుడు నా దగ్గర ఈ పాయింట్ ఒకటి ఉందని చెప్పాను. హీరోగా పర్ఫెక్ట్గా న్యాయం చేశాడు. బ్రాండ్‌ను ఫాలో అయ్యేవారి క్యారెక్టర్లో ఓ యారగెంట్ యాంగిల్ ఉంటుంది. సుమంత్ శైలేంద్ర ఆ యారగెన్సీని వెండితెరపై ఫర్ఫెక్ట్గా మ్యాచ్ చేశాడు. మ్యూజిక్ బాగా కుదరింది. ఎప్పుడైనా సినిమా గురించి సినిమానే మాట్లాడాలి. మనం చెప్పినంత మాత్రాన ఆడియన్స్ రారు. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ∙నేను పద్ధతిగా రాసుకున్న కథను నా విజన్‌కు తగ్గట్లుగా ప్రభాకర్ చక్కగా తెరకెక్కించాడు. ప్రభాకర్‌కు సీరియల్స్ చేసిన అనుభవం ఈ సినిమాకు హెల్ప్ అయింది. స్క్రిప్ట్‌లో ఎమోషన్‌ను ఈజీగా పట్టేశాడు. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి రైటర్‌గా నేను శాటిస్ఫై అయ్యాను. ∙ఒక కాన్సెప్ట్ తీసుకుని రెండు గంటల పాటు థియేటర్స్‌లో ఆడియన్స్‌ను ఎలా కూర్చోబెట్టగలరు అన్న ప్రశ్నను మారుతిని అడిగినప్పుడు...‘‘ నా బలం అదే. మతిమరుపు కాన్సెప్ట్ పై ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తీశాం. మెదడకు సమస్య ఉంటే ప్రేమించే హృదయం ఏం చేస్తుంది? అనే పాయింట్‌ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. నా సినిమా కథలన్నీ చిన్న చిన్న పాయింట్సే. రన్నింగ్ ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తుంటాను. ‘భలే మంచి చౌక బేరం’ సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చాను. నిర్మాత రాధామోహన్‌గారు చూశారు. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. నా దర్శకత్వంలో రూపొందుతోన్న నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి ఆ సినిమా రిలీజ్ సమయంలో తప్పకుండా మాట్లాడతాను. -
మారుతి కామెడీ టైమింగ్ కనిపించింది
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మారుతిగారి కామెడీ టైమింగ్ చాలా చోట్ల కనిపించింది. ప్రభాకర్ దర్శకత్వ ప్రతిభ తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సుమంత్ శైలేంద్రకు స్వాగతం పలుకుతున్నా. సుమంత్, ఈషా రెబ్బాకు ఈ చిత్రం మంచి హిట్ తీసుకురావాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా ప్రభాకర్ పి. దర్శకత్వంలో ఎస్. శైలేంద్ర నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని నాగచైతన్య విడుదల చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్ నాగచైతన్యకు నచ్చడం సంతోషంగా ఉంది. వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ విడుదల చేసినందుకు నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు ఈషా రెబ్బా. ఈ చిత్రానికి సంగీతం: జేబి, కెమెరా: కార్తీక్ ఫలని. -
ఏదైనా ‘బ్రాండ్’ కావాల్సిందే...!
ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతి.. మరో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రభాకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బ్రాండ్ బాబు’ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి కథను అందించగా.. జేబీ మ్యూజిక్ సమకూర్చాడు. కాగా, ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం కాబోతున్నాడు. తన చిత్రాల్లో హీరోలకు ఏదో ఒక వీక్నెస్ పెట్టే మారుతి.. ఈ చిత్రంలో హీరోకు బ్రాండ్ అనే జాడ్యాన్ని అంటగట్టాడు. బ్రాండ్ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని డైమండ్.. ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించటం, ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పటం, వాళ్లను ఎదిరించి తన ప్రేమను ఎలా గెలిపించుకోగలిగాడు. తదితర కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్ సరసన తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తోంది. రాజా రవీంద్ర, మురళీ శర్మ, సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ రిలీజ్
-
నేనెవర్నీ ప్రేమించలేదు
‘‘బ్రాండ్ బాబు’ చిత్రం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్యూర్ కామెడీతో పాటు సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్లు ఉన్నాయి. అన్నింటికీ మించి చక్కటి ప్రేమ కథ కూడా ఉంటుంది. కుటుంబమంతా కలిసి మా సినిమా హాయిగా చూడొచ్చు’’ అని కథానాయిక ఈషా రెబ్బా అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, మురళీ శర్మ ముఖ్య తారలుగా ప్రభాకర్.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా కీలకమైంది. నాకు, హీరోకి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది? ప్రేమలో ఎదురయ్యే మిస్ అండర్స్టాండింగ్స్ ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాం? అన్నది ఆసక్తికరం. ఓ రకంగా చెప్పాలంటే కథ మొత్తం మారుతిగారి శైలిలోనే సాగుతుంది. చాలా మంది హీరో పాత్రలో మమేకం అవుతారు. ఆ క్యారెక్టర్‌ను అలా డిజైన్ చేశారు మారుతిగారు. సుమంత్ శైలేంద్ర కన్నడలో రెండు మూడు చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఇదే మొదటి చిత్రం. నా పాత్రలన్నింటికీ నేనే డబ్బింగ్ చెప్పా. ఇప్పటి వరకూ నేను ఎవర్నీ ప్రేమించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌గారి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ముఖ్యమైన పాత్రలో, సుమంత్‌గారితో ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
ఆగస్టులో ‘బ్రాండ్ బాబు’
మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. డైరెక్టర్ మారుతి కథ అందించిన ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. మురళీశర్మ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేసిన బ్రాండ్ బాబు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియోను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మారుతి స్టైల్లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. -
ఆ రెండిటికీ లింకు పెట్టకూడదు – మారుతి
‘‘నేను తొలిసారి పూర్తిగా మాటలు, స్క్రిప్ట్ అందించిన సినిమా ఇది. శైలేంద్రబాబుగారికి న్యారేట్ చేశా. డైరెక్టర్‌గా చాలా మందిని అనుకున్నా ప్రభాకర్‌గారే కరెక్ట్ అనిపించింది. ఒక సినిమా ఫెయిల్ అయితే కథ ఫెయిల్ అయినట్లే తప్ప.. టెక్నీషియన్ ఫెయిల్ అయినట్లు కాదని నేను నమ్ముతాను. ఫెయిల్యూర్‌కి, టెక్నీషియన్‌కి లింకు పెట్టకూడదు. ఈ సినిమాని అందరూ ప్రేమించి చేశారు’’ అని దర్శకుడు మారుతి అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, మురళీశర్మ ముఖ్య తారలుగా ప్రభాకర్.పి దర్శకత్వంలో మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మారుతి చాలా సార్లు తన ఫంక్షన్లకు పిలిచినా రాలేకపోయాను. ఈ సినిమాకు రాకపోతే ఇంకోసారి పిలవనన్నాడు. నాకు చాలా థాట్స్ ఉంటాయి. కానీ, రాయడానికి చాలా సమయం పడుతుంది. మారుతి సింపుల్‌గా కథ రాస్తాడు. అందుకే తనంటే విపరీతమైన గౌరవం’’ అన్నారు. ‘‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తర్వాత తెలుగులో నేను నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. ఈ సినిమా ద్వారా నా తనయుడు సుమంత్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను’’ అన్నారు ఎస్.శైలేంద్రబాబు. ‘‘సినిమా సక్సెస్ అయితే ఎవరైనా అవకాశం ఇస్తారు. అంతంత మాత్రమే ఆడిన నా సినిమా (నెక్ట్స్ నువ్వే) చూసి నువ్వు బాగానే డైరెక్ట్ చేశావ్ అని మారుతిగారు మెచ్చుకుని నాకు ఈ సినిమాకి చాన్స్ ఇచ్చారు’’ అన్నారు ప్రభాకర్. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. -
‘బ్రాండ్ బాబు’ టీజర్
-
‘బ్రాండ్ బాబు’ టీజర్ విడుదల
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాగా ‘బ్రాండ్ బాబు’ రాబోతోంది. డైరెక్టర్ మారుతి అందించిన ఈ కథను ప్రభాకర్ తెరకెక్కించారు. బ్రాండ్ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని మనస్తత్వం ఉన్న హీరో కథే ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈరోజు (జూలై 9) విడుదల చేశారు. బ్రాండ్ వస్తువులు వాడే వ్యక్తి ఓ పేదింటి అమ్మాయి అయిన ఈషా రెబ్బతో ప్రేమలో పడటం... తన ప్రేమను గెలిపించుకోవడంలో ఏం చేశాడు, హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. సుమంత్ శైలేంద్ర ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి జేబీ సంగీతం అందిస్తున్నారు. -
మారుతి స్టైల్లో ‘బ్రాండ్ బాబు’
డైరెక్టర్ మారుతి నుంచి మరో సినిమా రాబోతోంది. అయితే దర్శకుడిగా మాత్రం కాదు. తాను అందించిన కథతో తెరకెక్కుతున్న బ్రాండ్ బాబు సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్లోనే ఇది మారుతి మార్క్ సినిమాగా కనిపిస్తోంది. బ్రాండ్ బాబు-పనిమనిషి ప్రేమ అన్నట్టు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బ్రాండ్ బాబుగా సుమంత్ శైలేంద్ర నటించగా, పనిమనిషిగా ఈషా రెబ్బ నటిస్తోంది. బ్రాండ్ బాబు తండ్రిగా మురళీ శర్మ నటిస్తోన్నట్లు తెలుస్తోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి జేబి సంగీతాన్ని అందించగా, శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. త్వరలోనే టీజర్ విడుదల కానుంది. ప్రస్తుతం మారుతి నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. Here it is first look of #BrandBabu @ParkyPrabhakar @vennelakishore @sumanth9111 @YoursEesha @UrsVamsiShekar @SKNonline pic.twitter.com/056tUBIHP5 — Maruthi dasari (@DirectorMaruthi) July 8, 2018 -
మారుతి కథతో ‘బ్రాండ్ బాబు’
యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు మారుతి మార్క్‌తో రిలీజ్ అవుతున్న మరో మూవీ బ్రాండ్ బాబు. మారుతి స్వయంగా కథ అందిస్తూ సమర్పిస్తున్న ఈ సినిమాతో కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బుల్లితెర స్టార్ యాంకర్ పీ ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుండగా మురళీశర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. జెబీ సంగీతమందిస్తున్నారు. మారుతి మార్క్కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు.