రాయ్‌లక్ష్మితో శ్రీరామ్
తెలుగు చిత్రాల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే, అయితే అవి మంచి కథలై ఉండాలి అంటున్నారు యువ నటుడు శ్రీరామ్. ఆరణాల అచ్చ తెలుగు అబ్బాయి అయిన ఈయన శ్రీరామ్‌గా తెలుగు సినీ ప్రేక్షకుల మనస్సుల్లో మంచి స్థానం సంపాదించుకున్న నటుడే. ఒకరికి ఒకరు చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమై మంచి లవర్ బాయ్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని తిరగరాసిన ఈ యువ హీరో తమిళంలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. రోజాకూట్టంతో హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పలు విజయ వంతమైన చిత్రాల్లో నటించారు.
అదే విధంగా మాతృ భాషలోనూ మరింత ఎదగాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న శ్రీరామ్ తాజాగా తమిళంలో నటించిన షావుకారు పేట్టై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.ఈ చిత్రం తెలుగులోనూ శివగంగ పేరుతో తరపైకి రానుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన నటి రాయ్‌లక్ష్మి హీరోయిన్‌గా నటించారు.ఈ సందర్భంగా శ్రీరామ్‌తో చిన్న చిట్ చాట్..
ప్ర: షావుకారు పేట్టై చిత్రం గురించి చెప్పండి?
జ: షావుకారుపేట్టై ఒక హారర్ కథా చిత్రం. ఈ తరహా హారర్ కథా చిత్రంలో తొలి అనుభవం.దర్శకుడు వడివుడైయాన్ కథ చెప్పగానే కాన్సెప్ట్ నచ్చడంతో వెంటనే అంగీకరించాను. అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేసే చిత్రం ఇది.
ప్ర: చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారట?
జ: అవును.ఇదీ కొత్త అనుభవమే.మరో విషయం ఏమిటంటే చిత్రంలో దెయ్యంగా నటించడం. డబ్బింగ్ చెప్పడానికి ఇంకా కష్టపడాల్సి వచ్చింది.
ప్ర: హీరోయిన్ రాయ్‌లక్ష్మి గురించి?
జ: రాయ్‌లక్ష్మి గురించి చెప్పే తీరాలి.ఆమె నటనకు మంచి గుర్తింపు లభిస్తుంది. మేకప్ వంటి విషయాలలో నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా రిస్కీ సన్నివేశాల్లో ధైర్యం చేసి నటించారు.
ప్ర: మీరు నిర్మాతగా కూడా అవతారమెత్తినట్లున్నారు?
జ: అవును. తమిళంలో నంబియార్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించి నిర్మించాను. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది.దీన్ని ఎప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను.
ప్ర: చిత్ర నిర్మాణ రంగంలోకి దిగడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ: ప్రత్యేక కారణం అంటే నాలాంటి వారికి ఎవరోఒకరు అవకాశం కల్పించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామ్.అలాగే ప్రతిభావంతులన వారికి అవకాశం కల్సించాలన్న భావంతోనే చిత్ర నిర్మాణం ప్రారంభించాను.తెలుగులో విజయం సాధించిన సామిరారా చిత్రం రీమేక్ హక్కుల్ని పొందాను. త్వరలోనే నా సంస్థలో నిర్మించనున్నాను. జవహర్ మిత్రన్‌కు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతల్ని అందించనున్నాను.
ప్ర: తెలుగులో వరుసగా చిత్రాలు చేయడం లేదే?
జ: తెలుగు చిత్రాల్లో నటించాలన్న కోరిక నాకూ ఉంది. అయితే మంచి అవకాశాలు రావడం లేదు. మంచి కథ,నిర్మాణ సంస్థ అనిపిస్తే హీరోగా తెలుగులో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే.
ప్ర: ఏ తరహా చిత్రాలు చేయాలనుకుంటున్నారు?
జ: మంచి ప్రేమ కథా చిత్రాలు చేయడానికే ఇష్టపడతాను.యాక్షన్ కథా చిత్రాలైనా చేయడానికి రెడీ.
ప్ర: మల్టీస్టారర్ కథా చిత్రాలు చేస్తారా?
జ: కథ, నా పాత్ర నచ్చితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.అదే విధంగా ఇకపై నా చిత్రాలు ద్విభాషా చిత్రాలుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.