పే...ద్ద..చిన్న సినిమాలు | Special story to small telugu movies in 2018 | Sakshi
Sakshi News home page

పే...ద్ద..చిన్న సినిమాలు

Published Sun, Aug 19 2018 12:20 AM | Last Updated on Sun, Aug 19 2018 12:20 AM

Special story to small  telugu movies in 2018 - Sakshi

సినిమాల్లో పెద్దా చిన్న ఉండదు. కానీ చిన్న సినిమా ఒక్కోసారి పెద్దగా కనబడుతుంది.కథా వస్తువు గొప్పదనమే అనలేం! ఇవ్వాళ చిన్న సినిమా పెద్దగా కనబడటానికి కారణం కథ కంటే పెద్ద కథనమే! నిజానికి చిన్న సినిమాలకు పెద్ద సినిమాల మధ్య వెంట్రుక వాసంత సందు కూడా దొరికేది కాదు.ఊపిరాడక డబ్బాల్లోనే చచ్చిపోయేవి. కానీ టైమ్‌ మారింది. కాదు.. కాదు.. సినిమా మారింది. కాదు.. కాదు.. కాదు.. ఆడియన్స్‌ మారారు. సినిమాను మారుస్తున్నారు.  2018లో వచ్చిన ఆరు పే...ద్ద.. చిన్న సినిమాల దర్శకులతో మీకోసం ‘సాక్షి ఫన్‌డే’ స్పెషల్‌..! 

ఛలో 
విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018
దర్శకుడు: వెంకీ కుడుముల
నటీనటులు: నాగశౌర్య, రష్మిక మందన్న
నిర్మాత: ఉష ముల్పురి
సంగీతం:  మహతి స్వరసాగర్‌

‘ఛలో’..  ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్‌బస్టర్‌. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వెంకీ కుడుముల. ‘ఛలో’తో పాపులర్‌ అయిన ఈ దర్శకుడి ఫ్యూచర్‌ ప్లాన్‌ గురించి.. ఆయన మాటల్లోనే...  

∙ ఇంట్లో వాళ్లను ముందే ప్రిపేర్‌ చేశా! 
మాది భద్రాద్రి జిల్లా. హైదరాబాద్‌లో అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివాను. చిన్నతనం నుంచే  సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోబోతున్నట్లు ఇంట్లో నేరుగా చెప్పకుండా ముందు అమ్మానాన్నల్ను ప్రిపేర్‌ చేశా. చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పా. ఆ తర్వాత ‘పై చదువులు చదువుతావా?’ అని అడిగారు. లేదన్నాను. సినిమా ఫీల్డ్‌లోనే కెరీర్‌ అని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అవ్వడంతో వాళ్లూ నో చెప్పలేదు.

∙ సోషల్‌ మీడియా పరిచయాలతో ఇండస్ట్రీలోకి..!  
కాలేజీ డేస్‌లోనే సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్లకు సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు పెట్టేవాడ్ని. డైలాగ్స్‌ను స్టేటస్‌లుగా పెడుతుండేవాడ్ని. హీరో శివబాలాజీ, కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్‌’ రవి వీరందరూ నాకు ఇలానే పరిచయం. అలా ‘ఇంకోసారి’ సినిమా దర్శకుడు సుమన్‌ పాతూరి పరిచయం అయ్యారు. ఆయన దగ్గర నాకు రైటర్‌ బలభద్రపాత్రుని రమణిగారు పరిచయం అయ్యారు. ఆవిడ నన్ను దర్శకుడు తేజగారికి పరిచయం చేశారు. నిజానికి నేను యాక్టర్‌ అవుదామని వెళ్లాను. కానీ తేజగారు నాలో డైరెక్షన్‌ స్కిల్స్‌ ఉన్నాయని చెప్పి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆ టైమ్‌లో డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్‌ మరింత పెరిగింది. ఆ తర్వాత డైరెక్టర్‌ యోగిగారి దగ్గర, నాగశౌర్య ‘జాదుగాడు’ సినిమాకు పనిచేశా. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి దగ్గర కూడా వర్క్‌ చేశా.

∙ ‘ఛలో’ అలా మొదలైంది! 
‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్స్‌ చేస్తున్నప్పుడు, ఈ సినిమా తర్వాత డైరెక్షన్‌ ప్రయత్నాలు స్టార్ట్‌ చేయమన్నారు త్రివిక్రమ్‌గారు. ‘జాదుగాడు’ సినిమా టైమ్‌లో హీరో నాగశౌర్య పరిచయం అయ్యారు. ‘మనం సినిమా చేద్దాం కథ రెడీ చేయ్‌!’ అన్నారు. నేను చెప్పిన కథ ఆయనకు నచ్చింది. ఓ నిర్మాతకు కథ చెప్పాం. ‘కథ కమర్షియల్‌గా ఉంది. వేరే హీరోకి వెళ్దామా?’ అన్నారు. శౌర్యతో ఇంకో లవ్‌స్టోరీ చేయవచ్చు కదా అని ఆయన అభిప్రాయం. ‘నేను శౌర్యతోనే చేస్తాను’ అని చెప్పా. ఆ సమయంలోనే శౌర్య తన పేరెంట్స్‌కు నేను చెప్పిన కథ చెప్పాడు. వాళ్లు ఎగై్జట్‌ అయ్యారు. అలా ఐరా క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌లో నా తొలి సినిమా ‘ఛలో’ మొదలైంది. 

∙ ‘ఛలో’ కథ అప్పుడే పుట్టింది! 
ఆంధ్రప్రదేశ్‌ విభజనలో భాగంగా మా ఊరు అశ్వరావుపేట తెలంగాణ బోర్డర్‌లోకి వచ్చింది. అంటే మా ఇంటి దగ్గర్నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఇప్పుడు ఆంధ్ర వస్తుంది. ఓకే.. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కాకుండా.. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌ అయితే ఎలా ఉంటుంది? హీరో తమిళనాడు అమ్మాయిని లవ్‌ చేస్తే? ఈ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రీన్‌ప్లే వర్కౌట్‌ అవుతుంది కదా అనిపించింది. అలా ‘ఛలో’ సబ్జెక్ట్‌ను టేకప్‌ చేశాను.

∙ నితిన్‌తో చేస్తున్నా! 
 నితిన్‌తో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్‌ వర్క్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది.  అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.

తొలిప్రేమ
విడుదల తేదీ:  ఫిబ్రవరి 10, 2018
దర్శకుడు: వెంకీ అట్లూరి
నటీనటులు: వరుణ్‌తేజ్, రాశిఖన్నా
నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ 
సంగీతం: ఎస్‌. థమన్‌ 

వరుణ్‌తేజ్‌కు హీరోగా ఫస్ట్‌ మేజర్‌ బాక్సాఫీస్‌ హిట్‌ ‘ఫిదా’ తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ కూడా అంతే పెద్ద హిట్‌. వెంకీ అట్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒక సింపుల్‌ ప్రేమకథనే రిఫ్రెషింగ్‌ కథనంతో నడిపించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టి దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి తన కెరీర్‌ గురించి చెప్పిన విశేషాలు...  

∙ యాక్టింగ్‌ నుంచి డైరెక్షన్‌కి! 
నాది హైదరాబాద్‌. ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నప్పుడు రైటింగ్‌పై ఆసక్తి కలిగింది. ముందు ‘స్నేహగీతం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత నాకు యాక్టింగ్‌ కన్నా, రైటింగ్‌ అండ్‌ డైరెక్షన్‌ అంటేనే మక్కువ ఏర్పడింది. అందుకే ‘స్నేహగీతం’ సినిమా చేసిన తర్వాత రైటింగ్‌ అండ్‌ డైరెక్షన్‌పై ఫోకస్‌ పెట్టాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్లీ ‘తొలిప్రేమ’తో డైరెక్టర్‌ అయ్యాను. నిజానికి ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్‌.. టీమ్‌ వర్క్‌ అని చెబుతా.

∙ ‘తొలిప్రేమ’కు నో చెప్పారు!
మొదట్లో ‘తొలిప్రేమ’ కథకు చాలా మంది ఓకే చెప్పలేదు. ఆ తర్వాతే అది దాని దారి వెతుక్కొని ఇలా వచ్చింది. మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఎవరి పని వాళ్లని చేయనిస్తే ఆటోమేటిక్‌గా సక్సెస్‌ అనేది 95 పర్సెంట్‌ కన్ఫర్మ్‌ అయిపోతుంది. ఒక ఫైవ్‌ ఫర్సెంట్‌ లక్‌ ఉండాలి. ‘తొలిప్రేమ’ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి.

∙ పొలిటికల్‌ డ్రామా చేస్తా! 
లవ్‌స్టోరీస్‌తో పాటు నాకు ఫ్యామిలీ డ్రామాలంటే ఆసక్తి ఎక్కువ. పొలిటికల్‌ డ్రామాలన్నా ఇష్టమే. భవిష్యత్‌లో నానుంచి పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాను ఆశించవచ్చు.

∙ అఖిల్‌తో సినిమా చేస్తున్నా! 
ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు దృష్టంతా ఈ సినిమాపైనే. ఒక సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. ఎఫర్ట్‌ అంతా సినిమా మీదనే పెడతా. ప్యారలల్‌గా మరో సినిమా చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. ఏకాగ్రత తగ్గుతుందేమోనని నా భయం. మణిరత్నం, త్రివిక్రమ్‌ నా ఫేవరైట్‌ డైరెక్టర్స్‌. వాళ్ల నుంచి ఎక్కువ ఇన్‌స్పయిర్‌ అయ్యాననే చెప్తా. 

అ!
విడుదల తేదీ:  ఫిబ్రవరి 16, 2018
దర్శకుడు: ప్రశాంత్‌ వర్మ
నటీనటులు: కాజల్, శ్రీనివాస్‌ 
అవసరాల, రెజీనా, నిత్యామీనన్‌ 
నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని 
సంగీతం:  మార్క్‌ కె. రాబిన్‌ 

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘అ!’తో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్‌ వర్మ. ఒక మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు అర్బన్‌ ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. డిఫరెంట్‌ కథల్ని తెరకెక్కించాలన్న డ్రీమ్‌తో ముందుకెళ్తానంటున్న ప్రశాంత్‌ వర్మ తన గురించి చెప్పిన కొన్ని విశేషాలు.... 

∙ సినిమాలను పిచ్చిగా చూసేవాడ్ని! 
మాది భీమవరం దగ్గర పాలకొల్లు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్‌ ఉండేది. కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూల్‌లో మంచి స్టూడెంట్‌ని. చిన్నప్పుడు ప్రతి సినిమా చూసేవాణ్ని. అయితే డైరెక్టర్‌ అవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌ నుంచి షార్ట్‌ ఫిల్మ్స్, మ్యూజిక్‌ వీడియోస్‌ చేయడం స్టార్ట్‌ చేశాను. అవి కూడా బాగా వైరల్‌ అయ్యాయి. తర్వాత ఫిల్మ్స్‌ మీద ఇంట్రెస్ట్‌ పెరిగింది. సినిమా గురించి తెలుసుకోవడం, చదవడం మొదలెట్టాను. ఆ తర్వాత యాడ్స్‌ చేశాను.

∙ ‘అ!’ నా 33వ కథ... 
‘అ!’.. ఫ్రస్ట్రేషన్‌తో రాసిన కథ. 2017 న్యూ ఇయర్‌కు నా కొత్త సినిమా స్టార్ట్‌ కావల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. అప్పుడు ఈ కథ రాశాను. ఆడియన్స్‌ ఎప్పుడూ చూడని ఒక కొత్త కథ చెబుదాం అన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్‌ పిక్‌ చేసుకున్నాను. ఇది నేను రాసిన 33వ కథ. అలా అని ముందు 32 కథలు రిజెక్ట్‌ అయ్యాయని అనను. ఏవేవో కారణాలతో సినిమా ఫైనలైజ్‌ కాలేదు. ‘అ!’ సినిమా నా సొంత ప్రొడక్షన్‌లోనే చిన్న సినిమాలా కొత్త వాళ్లతో చేద్దాం అనుకున్నాను. మెల్లిగా కాజల్, నాని వచ్చి పెద్ద ప్రాజెక్ట్‌ అయింది.

∙ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్‌ లేవు! 
మన దగ్గర మాత్రమే ‘నా కథతో నేనే సినిమా తీస్తాను’ అనుకుంటాం. హాలీవుడ్‌లో ఒకరు కథ రాస్తారు. మరొకరు స్క్రీన్‌ప్లే. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్‌ కంపెనీ ఒక డైరెక్టర్‌ని నియమించుకుంటుంది. ఇలాగే బాలీవుడ్‌ ‘క్వీన్‌’ రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మి’ నా దగ్గరికొచ్చింది. ‘అ!’ పనుల్లో బిజీగా ఉండి చేయడం కుదర్లేదు. ఆ సినిమా మధ్యలో ఆగిపోతే, మిగతా భాగమంతా వెళ్లి పూర్తి చేసి వచ్చాను. డైరెక్షన్‌ అనేది ఒక జాబ్‌ అని అనుకుంటాను నేను. అలానే వెళ్లి ఆ సినిమా చేసి వచ్చాను. నా తర్వాతి సినిమా వేరే అతని కథతో చేస్తున్నాను. ‘కథ’ అని అతనికి టైటిల్‌ వేస్తాను. నాకెలాంటి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్‌ లేవు. 

∙ ఆ బ్రాండ్‌ నా డ్రీమ్‌!
‘స్క్రిప్ట్‌ విల్లా’ అనే కంపెనీ ద్వారా మంచి కథల కోసం వెతికే ప్రొడక్షన్‌ హౌస్‌లకు, యాక్టర్స్‌కు మా సంస్థ నుంచి కథలను అందించే ప్రయత్నం మొదలుపెడుతున్నా. వీలైనన్ని  కొత్త కథలు ఆడియన్స్‌కు చెప్పడమే నా డ్రీమ్‌. ‘వీడు ఇప్పటివరకూ మనం అనుకున్నట్టుగా కాకుండా, కొత్తగా కథలు చెబుతాడ్రా!’ అనే బ్రాండ్‌ని క్రియేట్‌ చేసుకుంటే చాలు. 

ఆర్‌ఎక్స్‌ 100
విడుదల తేదీ:   జూలై 12, 2018
దర్శకుడు: అజయ్‌ భూపతి 
నటీనటులు: కార్తికేయ, 
పాయల్‌ రాజ్‌పుత్‌ 
నిర్మాత: అశోక్‌రెడ్డి 
సంగీతం:  చైతన్‌ భరద్వాజ్‌ 

2018లో చిన్న సినిమాల్లో అతిపెద్ద సెన్సేషన్‌ ‘ఆర్‌ఎక్స్‌100’. కొత్త దర్శకుడు అజయ్‌ భూపతి కొత్త నటీనటులతో చేసిన ఈ సినిమా యూత్‌ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి. ఫ్యూచర్‌లో ఎంత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చినా వాళ్లను తన స్టైల్లోకి తీసుకొచ్చుకొని సినిమా చేస్తానంటున్న అజయ్‌ ఫ్యూచర్‌ ప్లాన్‌ గురించి.. ఆయన మాటల్లోనే.. 

∙ సినిమాలో మా ఊరే! 
మాది ఆత్రేయపురం. సినిమాలో మీరు చూసిందే. నా ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా మా ఊర్లోనే చదువుకున్నాను. మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు మా నాన్న గారు ‘నీకు నేనేం ఆస్తులు ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే నువ్విలా ఉండు. అలా ఉండు అని చెప్పొచ్చు. నీకు నచ్చింది నువ్వు చెయ్‌’ అన్నారు. 

∙ అప్పుడే ఫిక్స్‌ అయ్యా! 
నా పదో తరగతిలోనే ఫిక్స్‌ అయ్యా, సినిమా డైరెక్టర్‌ అవ్వాలని. ఆ తర్వాత చదువుకోవడం కూడా టైమ్‌ వేస్ట్‌లా ఫీల్‌ అయ్యాను. ఎవ్వరైనా సరే వాళ్లేమవ్వాలనుకుంటున్నారు అనే చిన్న క్లారిటీ ఉంటే చాలు.. అది ఎంత కష్టమైనా చేసేయొచ్చు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నాని ‘రైడ్‌’, రవితేజ ‘వీర’ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత మా బాస్‌ రామ్‌గోపాల్‌ వర్మ ‘అటాక్‌’, ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’, ‘వంగవీటి’ సినిమాలకు వర్క్‌ చేశాను.

∙ ఎన్నో అవమానాలు.. చీదరింపులు... 
సినిమాల్లోకి రావాలనుకున్నాక అవమానాలు, చీదరింపులు, పస్తులు ఉండటాలు... అన్నీ ఉన్నాయి. కానీ ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథను చాలామందికి చెప్పా. ఎవ్వరూ రిజెక్ట్‌ చేయలేదు కానీ, వాళ్ల వాళ్ల కారణాల వల్ల సినిమా చేయడం కుదర్లేదు. కార్తికేయకి బాగా నచ్చేసింది. తర్వాత నిర్మాత అశోక్‌ వచ్చారు. నాకు రియలిస్టిక్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ పాయింట్‌ బావుంటుందని గట్టి నమ్మకం ఉండేది. నేను తప్ప ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు ఈ సబ్జెక్ట్‌ని. ‘ఆర్‌ఎక్స్‌ 100’లో  మీరు చూసిన హీరో క్యారెక్టర్‌ మన ఊర్లో కనబడే రెబల్‌ కుర్రాడిలానే ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్, రాంకీగారి పాత్ర.. ఇలా ప్రతీ పాత్రను ప్రేక్షకులు రిలేట్‌ చేసుకునేలా డిజైన్‌ చే శాను.

∙ నెక్ట్స్‌ మల్టీస్టారర్‌... 
‘ఆర్‌ఎక్స్‌100’ సక్సెస్‌ తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ల నుంచి ఆఫర్స్‌ వచ్చాయి. ఇప్పటివరకైతే ఏదీ ఫైనల్‌ చేయలేదు. కానీ నెక్ట్స్‌ సినిమా మాత్రం మల్టీస్టారర్‌ ఉంటుంది. రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి వ్యక్తుల కథ. స్క్రిప్ట్‌ వర్క్‌ స్టార్ట్‌ చేశాను. రెండు నెలల్లో ఫుల్‌ డీటైల్స్‌ అనౌన్స్‌ చేస్తాను. ఏ కథ చెప్పినా రియలిస్టిక్‌ అప్రోచ్‌తో చెప్పడమే నా లక్ష్యం. అలాగే ప్రభాస్, రామ్‌ చరణ్‌తో సినిమా చేయడం నా డ్రీమ్‌. ఒకవేళ మా స్టైల్‌లో సినిమా కావాలని వాళ్లు అడిగినా స్టోరీ సిట్టింగ్స్‌లో వాళ్లను నా దారిలోకి తెచ్చేసి నా స్టైల్లో సినిమా తీసేస్తా!

చి.ల.సౌ
విడుదల తేదీ:  ఆగస్టు 3, 2018
దర్శకుడు: రాహుల్‌ రవీంద్రన్‌ 
నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ
నిర్మాతలు: నాగార్జున,  జశ్వంత్‌ నడిపల్లి 
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి 

‘డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యా’. జనరల్‌గా చాలా మంది నటీనటులు చెప్పే మాట ఇది. అయితే రాహుల్‌ రవీంద్రన్‌ మాత్రం ‘డైరెక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యా’ అంటున్నారు. హీరోగా సినిమాలతో మెప్పిస్తూనే ఉన్న రాహుల్, దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ.’ సినిమా ఈ నెల్లోనే విడుదలై సూపర్‌ హిట్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. డైరెక్టర్‌గా మారిన ఈ యాక్టర్‌ సినిమా గురించి, తన ఫ్యూచర్‌ ప్లాన్‌ గురించి చెప్పిన విశేషాలు... 

∙ చిన్నప్పట్నుంచీ కథలంటే ఇష్టం! 
నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే! నాన్న ఎన్‌.రవీంద్రన్, అమ్మ వసుమతి. నాన్న బిజినెస్‌మేన్‌. చిన్నప్పట్నుంచీ అమ్మ రామాయణం, మహాభారతం కథలు చెబుతూ, యాక్టింగ్‌ చేసి చూపించేది. అప్పుడే నాకు కథలంటే ఇష్టం పెరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నంగారి ‘నాయగన్‌’ (తెలుగులో ‘నాయకుడు’) సినిమాను టీవీలో చూశా. చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపించింది. ఓ సినిమాని ఇలా కూడా తీయొచ్చా? అనిపించింది. అప్పట్నుంచి సినిమా, డైరెక్షన్‌ సైడ్‌ ఇష్టం పుట్టింది. ఇంటర్‌కి వచ్చాక ఫిల్మ్‌మేకర్‌ అవ్వాలనుకుని డిసైడ్‌ అయ్యా. నటుడవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.

∙ అసిస్టెంట్‌గా చాన్స్‌ దొరకలేదు.. హీరో అయ్యా! 
మా ఫ్యామిలీలో ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. మాది ఆ నేపథ్యం కాదు. అందుకే ఫస్ట్‌ చదువు పూర్తి చేసి తర్వాత ప్రయత్నిద్దామనుకుని అహ్మదాబాద్‌లో ‘మైకా’ కళాశాలలో ఎంబీఏ మార్కెటింగ్‌ చేశా. తర్వాత బాంబేలో ఏడాదిన్నర పాటు రేడియో సిటీలో అసిస్టెంట్‌ బ్రాండ్‌ మేనేజర్‌గా చేశా.  2007లో చెన్నైలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అవ్వాలనుకున్నా. కానీ, ఎవరి వద్దా అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదు. ఓ రోజు ఆడిషన్స్‌కి రమ్మని కాల్‌ వచ్చింది. వెళ్లగానే యాక్టింగ్‌ రోల్‌ అన్నారు. ఏ పాత్ర అంటే.. హీరో అన్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చాన్స్‌ రాలేదు. హీరోగా వచ్చింది. చేస్తే ఫిల్మ్‌ మేకింగ్‌ నేర్చుకోవచ్చు. డబ్బులు కూడా వస్తాయని చేశా. రవివర్మన్‌ డైరెక్షన్‌లో ‘మాస్కోవిన్‌ కావేరి’ చిత్రం చేశా. 

∙ ‘అందాల రాక్షసి’ మొత్తం మార్చేసింది! 
‘అందాల రాక్షసి’ చిత్రా నికి ఇద్దరు హీరోలు కావాలి. నవీన్‌ చంద్ర ఓ హీరోగా ఓకే. రెండో హీరో సెట్‌ అవడం లేదు. మీకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా? అని పాటల రచయిత లక్ష్మీ భూపాల్‌గారు అహ్మదాబాద్‌లో నాతోపాటు చదువుకున్న ఫ్రెండ్‌ దీప్తిని అడిగారు. తను నా గురించి చెప్పింది. తెలుగు రాదు అంది. పర్లేదు ఫొటోలు పంపమన్నారు. దీప్తికి పంపా. హను రాఘవపూడిగారు ఆడిషన్స్‌ చేసి ఓకే చేశారు. ఆ సినిమా నాకు టర్నింగ్‌ పాయింట్‌. అక్కడి నుంచి హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యా. సాయి కొర్రపాటిగారు బాగా ప్రమోషన్‌ చేశారు. నాకు, నవీన్‌ చంద్ర, లావణ్యా త్రిపాఠికి మంచి లైఫ్‌ వచ్చింది. ఆ సినిమా విడుదలై ఆరేళ్లయింది. 

∙ డైరెక్షన్‌ ట్రయల్స్‌.. 
హీరో అయినా, ఆ వెంటనే దర్శకుడిగానూ ప్రయత్నాలు మొదలుపెట్టా. నాలుగున్నరేళ్ల క్రితం ఓ హీరోకి ‘చిలసౌ’ కథ చెప్పా. అప్పుడది వర్కవుట్‌ అవ్వలేదు. ఈలోగా మళ్లీ హీరోగా బిజీ. తర్వాత సుశాంత్‌కి చెప్పా. ఓకే. నచ్చింది అన్నాడు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ హరీష్‌కి చెప్పాడు. ఆయన నిర్మాతలు భరత్, జశ్వంత్‌లకు  చెప్పారు. వారు కథ విని ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై ఇంత పెద్ద హిట్‌ అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. 

∙ చిన్మయి హ్యాపీ! 
‘అందాల రాక్షసి’ టైమ్‌లో పరిచయమైన సింగర్‌ చిన్మయి కొద్దిరోజుల్లోనే మంచి ఫ్రెండయింది. తను నా లైఫ్‌ పార్ట్‌నర్‌ అయితే బాగుంటుందని నేనే ప్రపోజ్‌ చేశా. తను కొద్దికాలం ఆలోచించి ఓకే చెప్పింది. తను నాకు, నేను తనకు బలం. ‘చి.ల.సౌ.’ రిలీజయ్యాక, నేను నా కలను సాధించినందుకు తను ఎంతో హ్యాపీ!

∙ యాక్టింగ్, డైరెక్షన్‌ రెండూ చేస్తా! 
తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్‌ టాలెంట్‌ను నిర్మాతలు బాగా ఎంకరేజ్‌ చేస్తారు. ‘చిలసౌ’ రిలీజ్‌కి ముందే చాలామంది కలిసి సినిమాలు చేయమన్నారు. అయితే రెండో సినిమా అన్నపూర్ణ బ్యానర్‌లో చేసేందుకు అడ్వాన్స్‌ తీసుకున్నా. ఇకపై డైరెక్షన్‌కే నా మొదటి ప్రాధాన్యత. మంచి సినిమాలు తీస్తా. అయితే యాక్టింగ్‌ వదులుకోను. ప్రస్తుతం ‘యూ టర్న్‌’, ‘దృష్టి’ సినిమాలు చేశా. త్వరలో రిలీజ్‌ కానున్నాయి. 

గూఢచారి
విడుదల తేదీ: ఆగస్టు 3, 2018
దర్శకుడు: శశికిరణ్‌ తిక్క 
నటీనటులు: అడివిశేష్, శోభిత దూళిపాల, మధుశాలిని 
నిర్మాతలు: అభిషేక్‌ నామ, 
టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ 
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

హీరో అడివి శేష్‌ ‘క్షణం’ సినిమాతో రెండేళ్ల క్రితం న్యూ వేవ్‌ సినిమా అంటూ రవికాంత్‌ పేరు అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. మళ్లీ రెండేళ్లకు అదే న్యూ వేవ్‌  అంటూ ‘గూఢచారి’తో మరో కొత్త దర్శకుడు శశికిరణ్‌ తిక్కను పరిచయం చేశారు. ఆగస్టు 3న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. రిఫ్రెషింగ్‌ స్పై థ్రిల్లర్‌గా, లో బడ్జెట్‌లో తెరకెక్కిన బెస్ట్‌ విజువల్స్‌తో మెప్పిస్తోన్న ఈ సినిమా గురించి, ఫ్యూచర్‌ ప్లాన్స్‌ గురించి శశికిరణ్‌ మాటల్లో.... 

∙ కేరాఫ్‌ అమలాపురం 
నేను పుట్టింది అమలాపురంలో. అమ్మానాన్న రాజమండ్రిలో సెటిల్‌ అయ్యారు. నాన్న గతంలో కొబ్బరి, కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌లు చేసేవారు. ఇప్పుడు రిటైర్‌ అయ్యారు. అన్నయ్య రాజమండ్రిలో బిజినెస్‌ చూసుకుంటున్నారు. 

∙ 15 మంది నిర్మాతలకు కథ చెప్పా! 
నాకు మొదట్నుంచీ డైరెక్షన్‌ అంటే చాలా ఇష్టం. డైరెక్టర్‌ కావాలనే అమెరికాలో న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో డైరెక్షన్, రైటింగ్‌లో రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నా. ఇండియాకొచ్చి శేఖర్‌ కమ్ములగారి దగ్గర ‘లీడర్‌’ సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశా. ‘లీడర్‌’కు పనిచేసిన తర్వాత కొన్ని కథలు రాసుకొని దాదాపు 15మంది నిర్మాతలకి చెప్పా. కొందరు చేద్దామన్నా రకరకాల కారణాల వల్ల కుదర్లేదు. ఓ సినిమా అయితే రేపు లాంచ్‌ అనగా ఆగిపోయింది. ఈ గ్యాప్‌లో ఫ్రెండ్స్‌కి రైటింగ్‌ సైడ్‌ హెల్ప్‌ చేశా. అడివి శేష్‌ ‘కర్మ’ సినిమాకి ప్రమోషన్స్‌ విషయంలో హెల్ప్‌ చేశా.  

∙ ‘గూఢచారి’ అలా పుట్టిందే!
‘కర్మ’ సినిమా అప్పుడే అడివి శేష్‌తో మంచి స్నేహం కుదిరింది. శేష్‌ రాసిన స్పై థ్రిల్లర్‌ ‘గూఢచారి’ కథను ఆయనతో కలిసి నేను, రాహుల్‌ పాకాల (రైటర్‌) ఎనిమిది నెలలు కష్టపడి పూర్తి స్క్రిప్ట్‌గా రెడీ చేశాం. కథని అబ్బూరి రవిగారికి వినిపించాం. ఆయన సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. 

∙ ఇంత పెద్ద సక్సెస్‌ ఊహించలేదు! 
‘గూఢచారి’ హిట్‌ అవుతుందనుకున్నా. కానీ ఇంత పెద్ద హిట్‌ అవుతుందనుకోలేదు. ఈ సినిమా సక్సెస్‌ కాగానే చాలా మంది నిర్మాతలు అడిగారు. ఇంకా ఎవరి వద్దా అడ్వాన్సులు తీసుకోలేదు. ఎవరితో చేయాలన్నది నిర్ణయించుకోలేదు. నాకు డబ్బు ముఖ్యం కాదు, పని సంతృప్తినివ్వడమే ముఖ్యం. నావల్ల నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. 

∙ అన్ని జానర్స్‌ చెయ్యాలి! 
స్పై థ్రిల్లర్‌తో డెబ్యూట్‌ ఇచ్చినా నాకు కామెడీ అంటే ఇష్టం. ఫ్యూచర్‌లో అన్ని జానర్స్‌లో సినిమాలు చేయాలనుంది. నాకిష్టమైన దర్శకుల నుంచి ఇన్‌స్పైరై ఇంకా బాగా పని చేయాలనుకుంటా.                       – సాక్షి సినిమా డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement