హైదరాబాద్ :
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ 'స్పైడర్'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నగరంలోని శిల్ప కళావేదికలో అట్టహాసంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో విడుదల చేసిన స్పైడర్ చిత్ర అరబిక్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది.
నాకు డైరెక్టర్లు దేవుళ్లతో సమానం..
'సినిమాకు కమిటైతే ప్రాణం పెట్టి నటిస్తా.. నాకు డైరెక్టర్లు దేవుళ్లతో సమానం... ఇది నమ్మాను కాబట్టే నాకు ఇంత మంది అభిమానులున్నారు. మీలాంటి అభిమానులు ఏ హీరోకు ఉండరు. నచ్చితేనే సినిమా చూస్తారు. లేకపోతే చూడరు. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. ఈ రోజుకోసం ఏడాదిన్నరగా ఎదురు చూశాం. 10 ఏళ్ల కింద పోకిరి సమయంలో మురుగదాస్‌ను కలిశాను. ఆయనతో కలిసి చేయడం నా అదృష్టం. డబ్బింగ్ చేసేప్పుడు నేనే స్టన్ అయిపోయా. ఒక సినిమాను రెండు సార్లు చేయడం మామూలు విషయం కాదు. ఎంతో ఎనర్జీ ఉన్న డైరక్టర్‌తో మాత్రమే ఇది సాధ్యమౌతుంది. 10 ఏళ్ల కింద ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. స్పైడర్ లాంటి సినిమా తీయాలంటే ఒక ఫ్యాషన్ ఉండాలని నిర్మాతలను పొగడ్తలతో ముంచెత్తారు. చిన్నప్పటి నుంచి కెమెరామెన్ సంతోష్ శివన్‌తో కలిసి పని చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందన్నారు. పీటర్ హెయిన్స్ మాస్టర్ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు' అని మహేశ్ బాబు అన్నారు.
కొత్త మహేశ్‌ను చూడబోతున్నారు
మహేశ్ బాబు లేక పోతే ఈ సినిమా లేదని స్పైడర్ దర్శకుడు మురుగదాస్ అన్నారు. ఈ చిత్రంలో కొత్త మహేశ్ బాబును చూడబోతున్నారని తెలిపారు. పీటర్‌హెయిన్స్ యాక్షన్ సీన్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీశారన్నారు.
ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయబోతోంది
మహేశ్ బాబు అభిమానులను స్పైడర్ ఆకట్టుకుంటుందని ప్రముఖ దర్శకుడు, చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించిన ఎస్ జే సూర్య అన్నారు. ఇది ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమని తెలిపారు. ఇండస్ట్రీలో రికార్డులన్నీ స్పైడర్ బ్రేక్ చేయబోతోందన్నారు.
ఈ చిత్రాన్ని నేనే నిర్మించాలనుకున్నా
ఈ చిత్రాన్ని తానే నిర్మించాలనుకున్నానని, కానీ తన మిత్రులకు ఈ అవకాశం దొరికిందని దిల్ రాజు అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
అమీర్ తర్వాత మహేశ్ బాబే..
చెన్నైలో జరిగిన ఫంక్షన్‌కు తాను వెళ్లానని, అక్కడ మురుగదాస్ చెప్పిన విషయాలను దర్శకుడు వంశీ పైడిపల్లి పునరుద్ఘాటించారు. 'ప్రతి దర్శకుడు చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ లేక మరో విషయం గురించో ఆలోచించరు. దర్శకుడికి ప్రతి సినిమా రీలీజ్‌కు ముందు ఒక రకమైన ఆందోళన ఉంటుంది. అయితే కేవలం హీరో మాత్రమే ఆ ఆందోళనను తొలగించగలుగుతాడు. అలా అమీర్ ఖాన్ తర్వాత తనకు మహేశ్ బాబు ధైర్యం చెప్పాడు' అని మురుగదాస్ తమిళనాడులో జరిగిన ఫంక్షన్‌లో చెప్పిన విషయాలను వంశీ చెప్పారు.
మహేశ్ అభిమానులకు క్షమాపణ చెబుతున్నా
మహేశ్ బాబు దగ్గరికి వెళ్లిన ఐదు నిమిషాల్లో నాపై నమ్మకంతో ఓకే చెప్పారు. ఇది మహేశ్ బాబు కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. వేదికకు బయట చాలా మంది మహేశ్ అభిమానులు ఉన్నారని వారందరికి క్షమాపణలు చెబుతున్నానని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. మిస్సయిన అభిమానులందరిని కలుపుకొని మరో పెద్ద ఫంక్షన్ జరుపుకుందామన్నారు. చిత్రబృందం సభ్యుల పనితీరును వివరించారు.