నటి శ్రీరెడ్డి (ఫేస్‌బుక్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని సినీ నటి శ్రీరెడ్డి తెలిపారు. రాజకీయ డ్రామాలు తనకు చేతకాదని ఆమె పేర్కొన్నారు. తనను చంద్రబాబు, నారా లోకేశ్, మరికొందరు రాజకీయ నేతలు నడిపిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై తన ఫేస్‌బుక్ పేజీలో స్పందించారు. పోరాటాలు చేస్తున్నట్టు నటించడం తనకు రాదని తెలిపారు. ప్యాకేజీల కోసం పోరాటాలు చేసేది ఎవరో అందరికీ తెలుసునని పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. ‘మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకంతే. మా మీద, మా తల్లులను అన్నప్పుడు రోడ్డు మీదకు రేప్‌లు చేస్తున్నప్పుడు, యాసిడ్ పోస్తున్నప్పుడు బెదిరింపులతో భయపెడుతున్నపుడు మా బాధ అర్థం కాలేదా?’ అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.
తన ప్రాణం పోయినా లెక్కచేయబోనని, వీర మరణానికి సిద్ధమని ప్రకటించారు. ‘మీ ఆధిపత్యం సినిమాల్లో చూపించండి. ‘ మా’ఫిలిం ఛాంబర్ మీద చూపించకండి. జర్నలిస్టుల మీద బురద చల్లితే మీ మీదే మరకలు పడతాయి. జర్నలిస్టుల జోలికి వస్తే బాగుండద’ని హెచ్చరించారు. తన పోరాటం చివరి వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘నిజాలు త్వరలో బయటకు వస్తాయి. ఒకరోజు హడావుడి చేసి భయపడి తోక ముడిచే పోరాటం కాదు నాది. పదేళ్ల క్రితం ఒంటరిగా వచ్చా. చాలా అనుభవించా, ఎవరినీ వదలన’ని అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మకు, వార్తా చానళ్లకు ఆమె క్షమాపణ చెప్పారు.
తెలుగు సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’కు వ్యతిరేకంగా గళమెత్తిన శ్రీరెడ్డిపై పలువురు సినిమా ప్రముఖులు మండిపడుతుండగా.. జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నాయకులు ఆమెకు బాసటగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment