
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోని కపూర్ వాంగ్మూలాన్ని దుబాయ్ పోలీసులు రికార్డు చేశారు. మొత్తం నలుగురు సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో బోని, వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసినట్టు తెలిసింది. మూడున్నర గంటల పాటు ఆయన్ను విచారించారని, రికార్డెడ్ ఆన్ కెమెరా ముందు బోని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు వెల్లడైంది. నీళ్లతో నిండి ఉన్న బాత్‌టబ్‌లో శ్రీదేవీ అకస్మారక పరిస్థితిలో ఉన్నట్టు గుర్తించినట్టు బోని చెప్పినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. అంతేకాక శ్రీదేవీని రషీద్ ఆసుపత్రికి తరలించిన సమయంలో బోనితో పాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు. అపస్మారక స్థితిలో శ్రీదేవీ బాత్‌టబ్‌లో పడిపోయి ఉన్న సమయంలో, బోని వారికే ముందస్తుగా కాల్ చేసి సమాచారం అందించాడు. అంతేకాక రషీద్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు అటెండెంట్ల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
మరోవైపు శ్రీదేవీ మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యూఏఈ ఆరోగ్యశాఖ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేసింది. ఆ రిపోర్టులో ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి నీటి టబ్‌లో పడిపోవడం వల్లే మృతి చెందినట్టు పేర్కొంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బాత్రూంకి వెళ్లిన శ్రీదేవీ, బాత్రూంలో కాలు జారి నీళ్ల టబ్‌లో పడిపోయిందని, ఆ సమయంలో ఊపిరాడక చనిపోయినట్టు తెలిపింది. ఘటన జరిగిన తర్వాత కొద్ది సేపటికి హోటల్ గదికి వచ్చిన బోని కపూర్, హోటల్ సిబ్బంది సాయంతో బాత్రూం డోర్లను బద్దలు కొట్టి తెరిచారు. ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవీని, హుటాహుటిన దగ్గర్లోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీదేవి ఊపిరి ఆగిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. అయితే శ్రీదేవీ శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించినట్టు యూఏఈ రిపోర్టు పేర్కొది. అంతేకాక అసలు గుండెపోటు విషయాన్నే ఫోరెన్సిక్ రిపోర్టు ప్రస్తావించలేదు.
Comments
Please login to add a commentAdd a comment