KGF Movie Real Story, in Telugu | ‘కె.జి.యఫ్‌’ అసలు కథ? | Kolar Gold Fields History - Sakshi
Sakshi News home page

Published Thu, Jan 3 2019 4:37 PM | Last Updated on Fri, Jan 4 2019 12:39 PM

Story On Kolar Gold Fields - Sakshi

కేజీఎఫ్‌ అంటే అందరికీ తెలిసిందే.. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌(కోలారు బంగారు గనులు). కర్ణాటక రాష్ట్రంలో ఇవి బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడా ఇక్కడా అని తేడాలేకుండా వీటి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కన్నడ సినీ పరిశ్రమలో కోలార్‌ గనుల నేపథ్యంలో తెరకెక్కించిన కేజీఎఫ్‌ చిత్రమే ఇందుకు కారణం. 

అయితే సినిమా లైన్‌ను సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే.. పెదరికంలో పుట్టిన హీరో.. అందరికంటే ధనవంతుడిగా ఎదగాలనుకోవడం.. మహారాజులా చనిపోవాలి అనే కన్నతల్లి చివరి కోరికను నెరవేర్చడం కోసం.. డబ్బు కోసం ఏపనైనా చేసే ఓ వ్యక్తి కథ. అయితే ఇలాంటి ఓ సాధారణమైన లైన్‌కు కోలార్‌ గనులను జోడించడంతో.. భారీ స్థాయిలో హైప్‌ వచ్చి.. ఇండియన్‌ సినిమాగా రూపొందింది. 

అయితే సినిమాలో చూపించిన మాదిరి ఇది నిజంగానే జరిగిందా అంటే.. పూర్తిగా చెప్పలేం. సినిమాలో చూపించిన బానిస బతుకులు మాత్రం కల్పితమనే తెలుస్తోంది. సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడం కోసమే అలాంటి కల్పితాన్ని జోడించారు. కానీ ఈ గనుల పుట్టుక వెనకు చారిత్రక నేపథ్యం మాత్రం చాలా పురాతనమైనది.

నిజంగా కోలార్‌ గనుల్లో అంతటి క్రూరత్వం ప్రదర్శించారా.. కేజీఎఫ్‌ చిత్రం చూసిన తరువాత సగటు ప్రేక్షకుడికి కలిగే ఆలోచన ఇదే. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నెటిజన్లు యూట్యూబ్‌, గూగుల్‌లో శోధించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో కుప్పలుతెప్పలుగా కేజీఎఫ్‌పై వీడియోలు ఉన్నాయి. 

దాదాపు రెండో శతాబ్దపు నాటికే ప్రజలు అక్కడి మట్టిలో బంగారం ఉందని తెలుసుకున్నారు. అయితే అప్పటి కాల పరిస్థితులకనుగుణంగా.. మట్టితో దాన్ని వేరుచేయగా.. చాలా తక్కువ మొత్తంలో బంగారం దొరికేది. అయితే ఇది చోళుల కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అటు తర్వాత ఎన్నో రాజవంశాలు(పల్లవులు, చోళులు, హొయసాలులు..) ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి. ఇక చివరగా ఇది బ్రిటీష్‌ వారి కంటపడింది. అప్పట్లో బ్రిటీష్‌ వారు చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో నివసించేవారు. అయితే అప్పటి లావెల్లె అనే రిటైర్డ్‌ బ్రిటీష్‌ అధికారి బెంగళూరులో నివసించేవారు. పుస్తకాలు చదివే అలవాటున్న ఈయనకు ఓరోజు లావెన్‌ అనే వ్యక్తి కోలార్‌ గనులపై రాసిన ఓ ఆర్టికల్‌ కంటపడింది. రెండు సంవత్సరాలపాటు పరిశోధన చేసి 1871లో మైసూర్‌ రాజుకు కోలార్‌ ప్రాంతాన్ని లీజుకు ఇవ్వమని ఓ లేఖ రాశారు. 

అయితే అందులో బంగారాన్ని వెలికితీయడం కంటే బొగ్గును వెలికితీయడమే లాభాదాయకమని కావాలంటే బొగ్గును తీసుకోడానికి లీజుకు ఇస్తానని మహారాజు అన్నాడు. కానీ అతను బంగారాన్నే వెలికితీయడం పనిగా పెట్టుకున్నాడు. కానీ అదంతా నష్టాలతో నడిచేది. బంగారం వెలికితీత వల్ల వచ్చే ఆదాయం కంటే కార్మికులకు చెల్లించే వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక నష్టాలతో నడుపలేమని తెలిసిన అతను ఓ కంపెనీకి అమ్మేశాడు. అయితే ఈ కంపెనీ మాత్రం సాంకేతికతకు ఉపయోగించడం ప్రారంభించింది. పెద్ద పెద్ద యంత్రాలతో పనులు ప్రారంభించారు. దీంతో వెలికితీతకు తక్కువ మొత్తంలో ఖర్చు కాగ, ఎక్కువ లాభాలు వచ్చాయి. అక్కడికి ఎంతోమంది బ్రిటీష్‌ అధికారులు వచ్చి స్థిరపడిపోయారు. అక్కడ కేజీఎఫ్‌ అనే టౌన్‌షిప్‌ కూడా ఏర్పడింది. 

అయితే నిరంతరం విద్యుత్‌ దీపాల వెలుగులో ఉండే బ్రిటీష్‌ వారికి అక్కడ ఉండటం, పనిచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ విద్యుత్‌ ప్రసారాన్ని ప్రారంభించాలనుకున్నారు. కోలార్‌కు 150కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరి నదిపైన హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. దాదాపు 150కిలోమీటర్ల మేర విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేశారు. అప్పటికి(1901-02) అదే అతిపెద్ద లైన్‌. అయితే ఆసియాలో అప్పటికీ రెండే దేశాల్లో విద్యుత్‌ ఉండేది. జపాన్‌లో ఉండగా.. భారత్‌లో కోలార్‌ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే అప్పటికీ బంగారానికి ఉన్న విలువ అలాంటింది. 

అయితే కాలక్రమంలో కోలార్‌లో నిల్వలు తగ్గడంతో దాని ప్రాబల్యం తగ్గిపోయింది. అయితే నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రపంచబ్యాంకును అప్పు అడగ్గా.. మీ దగ్గర సెక్యూరిటీగా ఏముందని ప్రశ్నించారట. ‘మా దగ్గర అతివిలువైన సంపద ఉంది. అదే కేజీఎఫ్‌’ అని చెప్పి.. కేజీఎఫ్‌ను సెక్యూరిటీగా చూపి అప్పు తెచ్చారట. అప్పట్లో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో దాదాపు 95శాతం కేజీఎఫ్‌ నుంచే ఉత్పత్తి అయ్యేదట. కానీ రానురాను అది పూర్తిగా తగ్గిపోయి 0.7శాతానికి పడిపోవడంతో 2001లో భారత ప్రభుత్వం గనుల తవ్వకాన్ని ఆపేసింది. ఇదీ కేజీఎఫ్‌ కథ. సినిమాలో కల్పితాలు చొప్పించి కోలార్‌ నేపథ్యంలో సినిమా తీయడం.. అది సెన్సేషన్‌ సృష్టించడంతో కోలార్‌ చరిత్రపై అందరి దృష్టిపడింది. మీరు కూడా వీటిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే.. యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు, గూగుల్‌లో బోలెడన్ని పేజీలు దర్శనమిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement