
సుమంత్, ఈషారెబ్బా
‘మళ్ళీరావా’ వంటి హిట్ చిత్రం తర్వాత సుమంత్ నటిస్తోన్న సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. ఈషారెబ్బా కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది.
తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. సుమంత్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఈ నెల 4 నుంచి ఆర్‌ఎఫ్‌సీలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాం. ఈ నెల 12 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో సుమంత్, ఈషారెబ్బా, జోష్వి.. ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. సుమంత్ కెరీర్‌లో ఈ సినిమా మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర.