మేడ్‌ ఇన్‌ ఇండియా కలను కుట్టిన సూయిధాగ | Sui Dhaaga Movie Review | Sakshi
Sakshi News home page

మేడ్‌ ఇన్‌ ఇండియా కలను కుట్టిన సూయిధాగ

Published Sat, Sep 29 2018 3:24 AM | Last Updated on Sat, Sep 29 2018 10:34 AM

Sui Dhaaga Movie Review - Sakshi

మధ్యతరగతి జీవితాల్లోని సమస్యలు, ఆశల ప్యాచులతో కలల క్లాత్‌ను కుట్టిన సినిమా సూయిధాగ. ఆ కలే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌! సినిమాలో చూపించింది ఒక కుటుంబం కలగానే. కానీ అది దేశానికి అన్వయించుకోవాలనేది బాటమ్‌ లైన్‌. మేక్‌  ఇన్‌ ఇండియా కాదు.. మేడ్‌ ఇన్‌ ఇండియా కావాలని ప్రభుత్వానికీ పంచ్‌ ఇచ్చింది.

విషయం
కథ సింపులే. దేశంలో చాలా చాలా దిగువ మధ్యతరగతి కుటుంబాల్లాగే  మౌజీ (వరుణ్‌ ధావన్‌) వాళ్లదీ సామాన్య కుటుంబం. తాతల వృత్తి నేత. టైలరింగ్‌ కూడా. మారిన కాలంలో అన్నం పెట్టని వృత్తిని ఈసడించుకుంటూ పట్నం వచ్చి  చేతకాని పనిలో సర్దుకుపోతుంటాడు మౌజీ తండ్రి (రఘువీర్‌ యాదవ్‌).  తన పిల్లలూ అలాంటి ఏదో పనిలో పడి నెలకు ఇంత నికరాదాయం సంపాదిస్తే చాలని తపన పడ్తుంటాడు. తండ్రి కోరికను చిన్న కొడుకు తీరుస్తాడు.

ఆ ఇరుకు ఇంట్లో, ఉమ్మడి కుటుంబపు చాదస్తపు భావాలతో తమ సంపాదనను పంచుకోవడం ఇష్టంలేక వేరే వీధిలో కాపురం పెడ్తాడు మౌజీ తమ్ముడు. అతనికి ఒక కొడుకు. భార్య చిన్న ఉద్యోగం చేస్తుంటుంది. ఇక మన  హీరో.. అదే మౌజీ.. చేతిలో స్కిల్‌.. ప్రవర్తనలో ఆకతాయితనం ఉన్నవాడు. తండ్రి నస పడలేక ఓ కుట్టుమిషన్‌ దుకాణంలో పనిచేస్తుంటాడు. యజమాని, అతని కొడుకు మౌజీని ఓ బఫూన్‌లా ట్రీట్‌ చేస్తుంటారు. బట్టలు కుట్టడంలో మౌజీ దిట్ట. డిజైనింగ్‌లో అద్భుతాలు చేస్తుంటాడు.

అంతటి విద్య పెట్టుకొని ఎవడి దగ్గరో ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోవడం అతని భార్య మమత (అనుష్కా శర్మ)కు అస్సలు నచ్చదు.  కానీ ఆమె మాట చెల్లదు ఆ ఇంట్లో. కారణం.. పెద్ద కొడుకు అదే మమత భర్త మౌజీని ఆ ఇంట్లో పనికిరాని వాడుగానే పరిగణిస్తుంటారు. ఉమ్మడి కుటుంబాల్లో సంపాదన లేని కొడుకుకి దక్కే అవమానమే కోడలికీ అందుతుంటుంది కదా. ఆ జంటకు ఆ ఇంట్లో ప్రైవసీ కూడా కరువే. అందుకే తన తమ్ముడికి కొడుకు పుట్టినా తనకు ఇంకా సంతానం లేని స్థితి. కొడుకుతో మాట్లాడ్డానికి కోడలు వెళ్లగానే అత్తగారు పిలుస్తుంటారు ఏదో పని మీద. అదీ ఆ జంట పరిస్థితి.

ఫ్యాషన్‌ వరల్డ్‌లో లోకల్‌ బ్రాండ్‌..
భర్తకున్న ప్రతిభతో అతన్ని ఒక ఎంట్రప్రెన్యూర్‌గా చూడాలని మమత ఆరాటం. ఓ సంఘటనతో భర్తతో ఆ పిచ్చి ఉద్యోగం మాన్పించేస్తుంది. చెట్టు కింద కుట్టు మిషన్‌ పెట్టయినా బతుకుదామనే ధైర్యాన్ని నూరిపోస్తుంది. మమత చెప్పినట్టే వింటాడు మౌజీ. ఈలోపు అతని తల్లికి గుండెనొప్పి వస్తుంది. స్టంట్‌ వేయాల్సి వస్తుంది. ఆమెకు సౌకర్యంగా ఉండడం కోసం ఓ మ్యాక్సీ కుడ్తాడు మౌజీ. అది ఆసుపత్రిలో ఉన్న మిగతా లేడీ పేషంట్లకూ నచ్చుతుంది. తమకూ కుట్టివ్వమని కొంత డబ్బు అడ్వాన్స్‌ ఇస్తారు. కుట్టిస్తాడు.

ఆసుపత్రి మేనేజర్‌కు ఈ వ్యవహారం నచ్చదు. అందులో కమిషన్‌ కొట్టేయడానికి మౌజీని బెదిరిస్తాడు. మౌజీ మరదలు అన్న ఓ బ్రోకర్‌. ఆయన, ఆసుపత్రి మేనేజర్‌ కుమ్మక్కయ్యి మౌజీ మ్యాక్సీ డిజైన్‌ను ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌కు అమ్మేస్తారు... మౌజీని మభ్యపెట్టి. పైగా మౌజీని, మమతను ఆ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఫ్యాక్టరీలో కుట్టుకూలీలుగా మారుస్తారు. ఈ మోసం తెలుసుకున్న మౌజీ తిరగబడ్తాడు. దెబ్బలు తింటాడు. ఇంట్లో వాళ్ల చేత పని చేతకాని వాడిగా ముద్ర వేయించుకుంటాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోడు.

భర్త టాలెంట్‌ మీద నమ్మకాన్నీ కోల్పోదు మమత. ఆ ఇద్దరు ఆ యేటి రేమండ్స్‌ ఫ్యాషన్‌ ఫండ్‌ పోటీలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. రెండు డిజైన్లు తయారు చేసి డెమో ఇస్తారు. కాంపిటీషన్‌లో పాల్గొనే అర్హత సంపాదించుకుంటారు. కానీ తర్వాత కుట్టు సాగాలి కదా.. ఎలా? వాళ్లుండే వీధిలో వాళ్లంతా తమ లాగే చేనేత, కుట్టు కార్మికులే. వృత్తి మీద నమ్మకం సన్నగిల్లి చిన్నాచితకా పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్లందరినీ పోగేస్తారు. సంగతి చెవిన వేస్తారు. ఎవరూ సుముఖంగా ఉండరు.

అయినా పట్టువదలరు. తమ డిజైన్స్‌ సెలెక్ట్‌ అయితే జీవితాలు మారిపోతాయని ఆశలు రేపుతారు.  కలల సూదిలోకి ఆకాంక్షల దారం ఎక్కించి ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను డిజైన్‌ చేయడం మొదలుపెడ్తారు. సూయిధాగ  బ్రాండ్‌ను  ర్యాంప్‌ మీద ప్రదర్శిస్తారు. డిజైన్స్‌ అద్భుతం.. కానీ ప్రొఫిషియెన్సీ ఉంటే నెగ్గేవారు అన్న మాట వినపడుతుంది జడ్జీల నోట. ఓడిపోయామని అర్థమవుతుంది. కానీ కుంగిపోరు. ఫ్యాషన్‌ వరల్డ్‌లో లోకల్‌ టాలెంట్‌ కూడా పోటీలో ఉందని చూపించామని సముదాయించుకుంటారు.

‘గెలవడం కాదు బరిలో ఉన్నామని చూపించాం. నిరాశతో వృత్తి మానేయడం కాదు.. పోటీతో పదును తేలాలి.. మనమే యజమానులు కావాలి’’ అని ఉత్సాహంతో ఇంటికి బయలుదేరుతుంటే.. రీ ఓటింగ్‌ జరిగి.. సూయిధాగానే ఫండ్‌ గెలుచుకుంది అనే మాట వింటారు. తర్వాత సూయిధాగా.. మేడ్‌ ఇన్‌ ఇండియా ట్యాగ్‌లైన్‌తో టాప్‌ బ్రాండ్‌ అవుతుంది. ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా సినిమాటిక్‌ ట్విస్ట్‌లు లేకుండా అత్యంత సహజంగా రోల్‌  చేసిన సినిమా ఇది.

దేశానికి ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అవసరాన్ని తెలియజెప్పిన మూవీ. గ్లోబలైజేషన్‌తో మన వృత్తికారులను కూలీలుగా మార్చొద్దు.. ఊతమిచ్చి  ఎంట్రప్రెన్యూర్స్‌గా నిలబెట్టాలని కోరుతున్న చిత్రం. కాలం కన్నా ముందు పరిగెత్తగల ఆలోచన ఉంది.. ట్రెండ్‌ను క్రియేట్‌ చేయగల టాలెంట్‌ ఉంది.. కావల్సింది ప్లాట్‌ఫామ్‌.. అది ప్రభుత్వం కల్పించాలి. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాలి. ఆత్మహత్యలు ఉండవు.. ఏ రంగంలో కూడా! ఈ ఆశావహ ఫ్రేమే సూయిధాగ!

– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement