
‘‘నాకు సినిమా పట్ల అంత ఆసక్తి లేదు. కాకపోతే రాయడం నేర్చుకున్నాను. అమెరికాలో ఎమ్మెస్ చేశాను.. అక్కడే ఓ ఐటీ కంపెనీలో 10 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత 2004లో బెంగళూరుకు మారిపోయా’’ అని సుజాయ్ కారంపూడి తెలిపారు. సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజాయ్, సుశీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుజాయ్ మాట్లాడుతూ– ‘‘మధుర’ శ్రీధర్ షార్ట్ ఫిలిం కోసం ఒక స్టోరీ రాశాను. ఆయనకు బాగా నచ్చడంతో సినిమా కథలు రాయమని సలహా ఇచ్చారు. మేం ఇండస్ట్రీకి కొత్త. ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు. అందుకే తెలుగు సినిమాలు చూశాం. మా ప్రయత్నాల్ని, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. సినిమా నిర్మాణం మాకు చాలా నేర్పించింది.. ఆటుపోట్లు తెలిశాయి. సినిమా అనేది అంత సులభమైన పనేం కాదు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో మా కుటుంబాన్ని కనీసం వారాంతంలో కూడా కలవలేకపోయాం. స్క్రిప్ట్ డెవలప్ చేయడమో, సినిమా మేకింగ్‌లోనో బిజీగా ఉండేవాళ్లం’’ అన్నారు.
సుశీల్ మాట్లాడుతూ– ‘‘మేం సాఫ్ట్‌వేర్ నేపథ్యం నుంచి వచ్చాం. అక్కడ చర్చల్లో డెవలప్‌మెంట్, ఫీడ్‌బ్యాక్ వంటి విలువైన అంశాలు ఉండేవి. ఇవే సూత్రాల్ని మేం స్టోరీ చర్చించేటప్పుడు కూడా పాటించాం. సినిమా మేకింగ్ సమయంలో అవి బాగా దోహదపడ్డాయి. ఒక యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. తల్లిదండ్రుల ఆత్మీయత, భావోద్వేగాల్ని ఈ సినిమాలో చూపించాం. మేకర్స్‌గా మాకిది తొలి సినిమా. విలువైన విమర్శలను ఆహ్వానిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment