
కఠినమైన కసరత్తులు దేనికోసం?
పాత్రల కోసం శరీరాన్ని కష్టపెట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడని హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. అవసరమైతే సన్నబడతారు.. బరువు పెరుగుతారు. ప్రస్తుతం మాత్రం సల్మాన్ పెరిగే పని మీద ఉన్నారు. ‘సుల్తాన్’లో చేయనున్న మల్లయోధుడి పాత్ర కోసమే ఇలా చేస్తున్నారు. దాదాపు పదిహేను కిలోలు పెరిగితే బాగుంటుందని చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ అన్నారట. ‘‘అదెంత పని’’ అంటూ సల్మాన్ కసరత్తులు మొదలుపెట్టేశారు. మామూలుగా బరువు పెరగాలంటే ఇష్టం వచ్చినట్లు తింటే సరిపోతుంది.
కానీ, సల్మాన్‌కు అలా పెరగడం ఇష్టం లేదు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుందని భావించిన ఆయన బాడీని పెంచే వర్కవుట్స్ మొదలుపెట్టారు. ప్రతి రోజూ సుమారు నాలుగు గంటల పాటు పర్సనల్ ట్రైనర్ రాకేశ్ ఆధ్వర్యంలో సల్మాన్ కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. దాంతో పాటు ప్రొటీన్ డైట్ తీసుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ‘దంగల్’లో మల్లయోధుడిగా నటిస్తున్న ఆమిర్‌ఖాన్ కూడా రాకేశ్ సహాయంతోనే బరువు పెరిగారు. మరి.. ఈ ఇద్దరు మల్లయోధుల్లో ఎవరు ‘బెస్ట్’ అనిపించుకుంటారో తెలియాలంటే ‘దంగల్’, ‘సుల్తాన్’ విడుదల వరకూ ఆగాల్సిందే.